ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ రాకతో భవన నిర్మాణ రంగ కార్మికులు, నిరుద్యోగులు, తాడేపల్లి కరకట్ట వాసులు తమ గోడు విన్నవించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ జరిగింది. ఇందులో రాష్ర్టంలోని తాజా పరిస్థితులపై చర్చించారు. పార్టీలో పనిచేస్తూ కరోనా బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నంద్యాలకు చెందిన సోమశేఖర కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందజేశారు.
ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టేందుకు పార్టీ పని చేస్తుందని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు.
కార్మికుల కష్టాలు తెలుసుకున్న పవన్ కల్యాణ్ వారి సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. సీఎం ఇంటి భద్రత పేరుతో పేదల ఇళ్లు ఖాళీ చేయించడం దారుణమన్నారు. తాడేపల్లి కరకట్ట వాసులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. అధికారుల తీరుపై ఆక్షేపణ చేశారు. ఈ నేపథ్యంలో వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తామని చెప్పారు.
అర్తరాత్రి పేదల ఇళ్లపై పొక్లెయిన్లు పంపిస్తున్నారని అన్నారు. ఇదేంటని అడిగితే బూతులు తిడుతున్నారని విమర్శించారు. ముప్పై ఏళ్ల నుంచి తాము అక్కడే జీవిస్తున్నామని చెప్పినా నిలువ నీడ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. వారిని అక్కడి నుంచి ఖాళీ చేయిస్తే ముందే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం నివాసం భద్రత పేరుతో కార్మికులను బెదిరించడం బాగా లేదని నిరసన తెలిపారు.
జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని చెప్పారు. వారి సమస్యలను పరిష్కరించే వరకు విశ్రమించేది లేదని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వారి ఇళ్లను ఖాళీ చేయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఏం పాపం చేశారని విమర్శించారు. అయినా సీఎం పరిపాలన రాజధానికిగా విశాఖను చేసుకుంటే తాడేపల్లిలో ఇళ్లను ఖాళీ చేయించడం ఎందుకని ప్రశ్నించారు. దీనిపై పునరాలోచించుకోవాలని సూచించారు.