Asiatic Lion: మొన్న నమిబియా నుంచి చీతాలను తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్కులో వదిలిపెట్టారు. వీటికి పేర్లు పెట్టాలని స్వయంగా ప్రధానమంత్రి మోడీ మన్ కీ బాత్ లో దేశ ప్రజలను కోరారు. వాస్తవానికి చీతాలకు మన దేశం ఆవాసం కాదు. ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో సమృద్ధిగా ఉంటాయి. అక్కడ అడవులు విస్తారంగా ఉంటాయి కాబట్టి వాటికి ఆహార కొరత అనేది ఉండదు. పైగా ఆఫ్రికా ప్రాంతపు వాతావరణ పరిస్థితులు చీతాలకు అనుకూలంగా ఉంటాయి. అప్పుడెప్పుడో మనదేశంలో చీతాలు ఉండేవి. కానీ కాలక్రమేణా అవి అంతరించిపోయాయి. అవి అంతరించిపోయాక గాని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం తీసుకువచ్చింది. అయితే దేశంలో చీతాలను పెంచాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంది. ఇందుకోసం ఆఫ్రికా దేశాలతో సంప్రదింపులు జరిపింది. అనేక కారణాలవల్ల ఇది ఆగిపోయింది.
-మోడీ హయాంలో
నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చీతాలను మన దేశంలోకి తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉండేవారు. ఆ తర్వాత రకరకాల సంప్రదింపుల వల్ల ఇటీవల నమీబియా అడవుల నుంచి 7 చీతాలను ప్రత్యేక విమానం ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి తీసుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు వివాదం ఇక్కడే మొదలవుతున్నది. వాస్తవానికి చీతాలకు మన దేశం సురక్షితమైన ఆవాసం కాదు. ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో సమృద్ధిగా ఉంటాయి. అయితే చీతాలను భారత ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి విమానంలో తీసుకువచ్చి ఎంతో జాగ్రత్తగా సాకుతోంది. కానీ, రాజసానికి పర్యాయపదంగా ఉండే ఆసియా సింహాలకు భారత గడ్డ జన్మస్థానం. గతంలో మనదేశపు సింహాల వీర్యాన్ని ఇతర దేశాలు సేకరించి తీసుకెళ్లాయి. అక్కడ ఆసియా దేశపు సింహాలను పున: సృష్టించాయి. కానీ మన దగ్గరికి వచ్చేసరికి సింహాల విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా ఆ సింహాల మనుగడ నేడు ప్రమాదంలో పడింది. ఒకప్పుడు దేశమంతా కనిపించిన ఆసియా సింహాలు ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అభయారణ్యానికి మాత్రమే పరిమితమయ్యాయి. అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేరిన వీటిని కాపాడాలని సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఆదేశించిన్నా ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఎక్కడో ఉన్న చీతాలను తీసుకురావడం పై ఉన్న ఆసక్తి భారత దేశ గొప్పతనానికి ప్రతీకలైన సింహాలపై కనిపించడం లేదు.
Also Read: YSRCP Candidates: వైసీపీలో అభ్యర్థులు ఫైనల్.. ఆ లిస్ట్ ఇదే.. ఎమ్మెల్యేగా ఎంపీ
_మనుగడ ప్రమాదంలో పడింది
గుజరాత్లో గిర్ నేషనల్ పార్క్ ఆసియా సింహాలకు చిట్టచివరి ఆవాసం. అడవి తక్కువగా ఉండటం, వాటి సంఖ్య పెరిగిపోవడంతో మునగడ ప్రమాదంలో పడింది. రెండు సంవత్సరాల క్రితం వచ్చిన భారీ వర్షాలకు అనేక సింహాలు చనిపోయి వరదల్లో కొట్టుకొచ్చాయి. సింహాల దుస్థితిని చూసి చలించిన కొంతమంది వన్యప్రాణి ప్రేమికులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీంతో రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఆసియా సింహాలను చేర్చాలని, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాస్తవానికి ఆసియా సింహాలు గుంపులు గుంపులుగా తిరుగుతాయి. వీటికి విశాలమైన అడవి అవసరం.ఒక ప్రైడ్(గుంపు) కనీసం 20 చదరపు కిలోమీటర్ల సొంత ఆవాసాన్ని కలిగి ఉంటుంది. తక్కువలో తక్కువ 400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వేటాడుతుంది. 2015 లెక్కల ప్రకారం గిర్ అడవిలో 109 మగ సింహాలు, 201 ఆడ సింహాలు, 213 పిల్లలు ఉన్నాయి. 1965లో రక్షిత అడవిగా ప్రకటించిన గిర్ విస్తీర్ణం 1,412 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇందులోను అనేక ప్రాంతాల్లో రక్షిత అడవిలో మానవ ఆవాసాలు ఉన్నాయి.
పైగా గిర్ పరిసర ప్రాంతాల్లో ఏటా వరదలు సర్వసాధారణమయ్యాయి. దీనివల్ల సింహాలు అకాల మరణం చెంది వరదల ధాటికి కొట్టుకొస్తున్నాయి. గిర్ నేషనల్ పార్క్ లో సింహాలకు ప్రమాదం పొంచి ఉండటంతో వాటిని మధ్యప్రదేశ్లోని కునో అరణ్యంలోకి తరలించాలని 1994లో ఒక ప్రతిపాదన వచ్చింది. ఇక్కడి చుట్టుపక్కల గ్రామాల ప్రజలను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసింది. తర్వాత గుజరాత్ లో మారిన రాజకీయాల కారణంగా సింహాల తరలింపునకు బ్రేక్ పడింది. 2000 సంవత్సరంలో ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వచ్చింది. అనేక వాదనల తర్వాత గిర్ అడవుల్లోని సింహాలను కునోకు తరలించాలని 2013లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్, క్యూ రేటివ్ పిటిషన్ వేయాల్సి వచ్చింది. అయినప్పటికీ సింహాలను తరలించే ప్రక్రియ పూర్తికాలేదు. ప్రధానమంత్రి మోడీ గుజరాత్ నుంచి సింహాలను తరలించేందుకు సానుకూలంగా లేకపోవడమే ఇందుకు కారణమని ఆ రాష్ట్ర అధికారులు అంటున్నారు. అయితే ప్రస్తుతం గిర్ ప్రాంతంలో వేటగాళ్ల బెడద ఎక్కువైంది. పైగా అభయారణ్యం పరిధిలో మానవ ఆవాసాలు పెరిగిపోవడంతో సింహాలు వేటాడేందుకు అవకాశం లభించడం లేదు. ఆసియా సింహాల మనుగడపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ ఏ నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read: Kodali Nani- Vallabhaneni Vamsi: జగన్ కు గట్టి షాకిచ్చిన కొడాలి నాని, వల్లభనేని వంశీ