Medigadda Barrage Damage: ఇసుక పునాదే.. ధవలేశ్వరానికి, కాలేశ్వరానికి ఎంత తేడా?

ధవలేశ్వరం ఆనకట్ట నిర్మించిన ప్రాంతంలో ఇసుక నిండి ఉంటుంది. ఇక్కడ పునాది నిర్మించాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. పైగా ఫౌండేషన్ కూడా సరిగ్గా కుదరాలి.

Written By: Anabothula Bhaskar, Updated On : October 25, 2023 1:18 pm

Medigadda Barrage Damage

Follow us on

Medigadda Barrage Damage: ఎప్పుడో ఆర్డర్ కాటన్ కాలంలో నిర్మించిన ధవలేశ్వరం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. మానవ నిర్మిత అద్భుతంగా ప్రశస్తి పొందుతోంది. వాహనాలు, రైళ్ళ రాకపోకలకే కాదు ఉభయగోదావరి జిల్లాలకు వర ప్రదాయినిగా మారింది. అయితే తాజాగా మేడిగడ్డ బ్యారేజ్ కొంతమేర కుంగిపోవడంతో ఒకసారిగా ధవలేశ్వరం చర్చల్లోకి వచ్చింది. ధవలేశ్వరం ఆనకట్టను గోదావరి నీరు ఉదృతంగా ప్రవహించే చోట కట్టారు. వాస్తవానికి ఈ ఆనకట్ట లేకపోతే ఉభయగోదావరి జిల్లాల పంట పొలాలకు గోదావరి నీరు అందడం దాదాపు అసాధ్యం. అయితే ఈ డెల్టా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సర్ ఆర్థర్ కాటన్ ధవలేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. సాంకేతిక పరిజ్ఞానం అంతంతమాత్రంగా ఉన్న ఆ రోజుల్లోనే ఈ స్థాయి ఆనకట్టను కట్టారు.

ధవలేశ్వరం ఆనకట్ట నిర్మించిన ప్రాంతంలో ఇసుక నిండి ఉంటుంది. ఇక్కడ పునాది నిర్మించాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. పైగా ఫౌండేషన్ కూడా సరిగ్గా కుదరాలి. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. ధవలేశ్వరం ఆనకట్టను ఇసుక ప్రాంతంలో నిర్మించినప్పటికీ పునాదిని పకడ్బందీగా, పటిష్టంగా రూపొందించారు. ఫౌండేషన్ కూడా చెక్కు చెదరకుండా నిర్మించారు. దీనివల్లే గోదావరి ఏ స్థాయిలో ప్రవహించినప్పటికీ ధవలేశ్వరం ఆనకట్ట దృఢంగా ఉంది. కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైనది మేడిగడ్డ బరాజ్. ప్రాణహిత నది గోదావరిలో కలిసిన అనంతరం ఉండే ప్రవాహం దగ్గర ఈ బరాజ్ నిర్మించారు. అయితే ఇసుకలో పునాది నిర్మించేటప్పుడు సరైన జాగ్రత్త తీసుకోకపోవడం వల్లే 20 నెంబర్ పిల్లర్ అడుగుమేర కుంగిపోయింది అని తెలుస్తోంది. ఈ పిల్లర్లు కుంగిపోవడానికి కారణాలు ఏమిటో ఇప్పటికీ అధికారులు చెప్పలేకపోతున్నారు. దానికి గల కారణాన్ని అన్వేషించడానికి అటు కేంద్ర సిబ్బంది, ఇటు రాష్ట్ర అధికారులు పరిశీలన జరుపుతున్నారు.

ఇప్పటికే ఈ ప్రాజెక్టును మొత్తం ఖాళీ చేశారు. ప్రాణహిత నది నుంచి వరద వస్తున్నప్పటికీ దానిని యధావిధిగా కిందికి వదిలేస్తున్నారు. ఈ బ్యారేజ్ ను 28.25 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జికి అనుగుణంగా నిర్మించారు. అయితే గతంలో భారీ వరదను కూడా ఈ నిర్మాణం తట్టుకుందని అధికారులు చెబుతుండగా.. తాజా కుంగుబాటును మాత్రం కొట్టి పారేస్తున్నారు. అయితే ఈ నీరును ఎప్పటికప్పుడు కిందికి వదిలేయడం వల్ల ఆ ప్రభావం సుందిళ్ల, అన్నారం బ్యారేజీల మీద పడుతోంది. ఇంత జరుగుతున్నప్పటికీ అధికారిక మీడియా కేవలం కుట్ర కోణం ఉంది అనే దిశలోనే వార్తా కథనాలు ప్రచురిస్తోంది. అసలు విషయాన్ని మాత్రం చెప్పలేకపోతోంది. వెతకబోతున్న తీగ కాలికి తగిలినట్టు.. అధికార భారత రాష్ట్ర సమితిని టాకిల్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డను ఒక అస్త్రంలాగా వాడుకుంటున్నది. ప్రస్తుతానికి అయితే ప్రాజెక్టును ఖాళీ చేసిన నేపథ్యంలో లోపం ఎక్కడ ఉందో తెలుసుకోవడం వీలవుతుందని అధికారులు అంటున్నారు. లోపం తెలిసిన నేపథ్యంలో ఎల్ అండ్ టి సంస్థ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు గోదావరి వరద గత వాన కాలంలో పంప్ హౌస్ లను ముంచేసినప్పుడు మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. అయితే వాటిల్లో ఎన్ని మోటార్లు పనిచేస్తున్నాయో ఇప్పటికీ ప్రభుత్వం చెప్పలేకపోవడం విశేషం. మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు విషయంలోనూ ప్రభుత్వం ఏ విషయాన్నీ స్పష్టం చేయడం లేదు. అంటే తెర వెనుక ఏదో జరుగుతోంది అని అనుమానం బలపడుతోంది!