VK Pandian : ఎవరి పాండియన్‌.. నవీన్‌ పట్నాయక్‌ ఎందుకు రాజకీయ వారసుడిగా ప్రకటించారు?

బీజేడీ అధినేతగా నవీన్‌ పట్నాయక్‌ను అమితంగా ఆదరించిన ఒడిశా ప్రజలు తమిళియన్‌ అయిన వీకే పాండియన్‌ను ఏమేరకు ఆదరిస్తారు? ఆయనను ఒక నేతగా ఏమేరకు సొంతం చేసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Written By: NARESH, Updated On : October 26, 2023 9:42 pm
Follow us on

Naveen Patnaik : అయితే తండ్రి లేకుంటే కొడుకు, మరీ ప్రత్యామ్నాయం లేకుంటే కూతురు.. అల్లుడు, వారి పిల్లలు.. ఇలా సకుటుంబ సపరివారసమేతం.. దేశం నుంచి రాష్ట్రం దాకా ఏలింది, కొన్ని చోట్ల ఏలుతున్నది కుటుంబాలే కదా! పైగా ఆ కుటుంబాల్లో ఒక్కొక్కరు ఒక్కో పవర్‌ హౌస్‌. ఎవరి మాట వినకున్నా నాయకులకు చిక్కులే. చివరికి ఫ్లెక్సీలో ఫొటో మిస్‌ అయినా ఇబ్బందే. అలాంటి కుటుంబ రాజకీయాల్లో ఓ సీఎం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా ముఖ్యమంత్రి? ఏమిటా కథా?

తమిళనాడుకు చెందిన తాజా మాజీ ఐఏఎస్‌ అధికారి వీకే పాండియన్‌.. ఒడిశా అధికార పార్టీ బిజు జనతా దళ్‌(బీజేడీ) అధినేత, సీఎం నవీన్‌ పట్నాయక్‌ రాజకీయ వారసుడిగా మారే అవకాశం కన్పిస్తోంది. తదుపరి బీజేడీ చీఫ్‌ పాండియనే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వీకే పాండియన్‌ ఇటీవలే ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే కీలకమైన ‘5టీ, నబీన్‌ ఒడిశా’ కార్యక్రమానికి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఏకంగా కేబినెట్‌ హోదాను పొందడం తెలిసిందే. ఈ నియామకం కీలకమైందని విశ్లేషకులు చెబుతున్నారు. పాండియన్‌ నేరుగా సీఎం నవీన్‌ పట్నాయక్‌కే రిపోర్టు చేశారు. అయితే, బీజేడీ అధినేతగా నవీన్‌ పట్నాయక్‌ను అమితంగా ఆదరించిన ఒడిశా ప్రజలు తమిళియన్‌ అయిన వీకే పాండియన్‌ను ఏమేరకు ఆదరిస్తారు? ఆయనను ఒక నేతగా ఏమేరకు సొంతం చేసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎన్నో ఏళ్ల నుంచి..

28 ఏళ్ల వయసులోనే 2002లో ఐఏఎస్‌ అధికారి అయిన వీకే పాండియన్‌ తమిళనాడు వాసి. తన బ్యాచ్‌మేట్‌, ఒడిశాలోని క్రేంద్రపారా జిల్లాకు చెందిన సుజాతను వివాహం చేసుకున్నారు. స్వల్ప కాలంలో గంజాం జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఇది సీఎం నవీన్‌ పట్నాయక్‌ సొంత నియోజకవర్గం కూడా కావడంతో పాండియన్‌కు, సీఎం నవీన్‌కు మధ్య బలమైన బంధం ఏర్పడింది. ప్రధాన మంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన సమయంలోనూ సీఎం వెంటే పాండియన్‌ ఉండేవారు. 2011లోనే సీఎం ప్రైవేట్‌ సెక్రటరీగా కూడా పాండియన్‌ నియమితులయ్యారు. ఈ హోదాలోనే ఆయన బీజేడీ కార్యకలాపాలను కూడా తన కనుసన్నల్లో నడిపించారు. బీజేడీ నేతలు ఏం చేయాలన్నా సూచనలు, అనుమతులు కూడా పాండియనే ఇచ్చేవారంటే.. పార్టీపై ఆయన ఏ స్థాయిలో పట్టుబిగించారో అర్థమవుతుంది. ఈ క్రమంలోనే పాండియన్‌ వీఆర్‌ఎస్ కు దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోనే అది అనుమతి పొందడం, వెంటనే కేబినెట్‌ హోదాతో కూడిన కీలకమైన బాధ్యతలను అప్పగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బీజేడీలో సీనియర్‌ నాయకులు ఉన్నప్పటికీ వారందరినీ పక్కన పెట్టి పాండియన్‌కు పెద్దపీట వేయడం చర్చనీయాంశమైంది.

అప్పుడే కీలకంగా వ్యవహరించారు

నవీన్‌ పట్నాయక్‌ రాజకీయ గురువు ప్యారీమోహన్‌ మహాపాత్ర 2012లో తిరుగుబాటు చేశారు. సీఎం నవీన్‌ లండన్‌లో ఉన్న సమయంలో ఆయన పదవిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పాండియన్‌ కీలకంగా వ్యవహరించారు. పదవీ గండం నుంచి నవీన్‌ బయటపడ్డారు. ఇక, అప్పటి నుంచి పాండియన్‌, నవీన్‌ల మధ్య బంధం మరింత బలోపేతమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

నవీన్‌ పట్నాయక్‌ వయసు 77 ఏళ్లు. ఆయన తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. పైగా ఆయన అవివాహితులు. ఈ నేపథ్యంలో నవీన్‌ తర్వాత ఎవరు? అనే ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది అయితే, నవీన్‌ కుటుంబం నుంచి ఎవరూ కూడా ఆ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. కొద్ది రోజులుగా పాండియన్‌ పేరు వినిపిస్తున్న నేపథ్యంలో నవీన్‌ స్థానాన్ని ఆయన భర్తీ చేయొచ్చని తెలుస్తోంది.
పాండియన్‌ రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాలో విస్తృతంగా పర్యటించి అన్ని అంశాలపైనా అవగాహన పెంచుకున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారాలు కూడా చూపుతున్నారని సమాచారం. బీజేడీ విషయానికి వస్తే పాండియన్‌ను ప్రశ్నించే వారు ఒక్కరూ లేరు ‘‘పాండియన్‌ తమిళియనే అయినా, ఒడియాపై ఆయనకు తమిళం కన్నా పట్టు ఎక్కువ. పైగా ఆయన ఒడిశా అల్లుడు. 20 ఏళ్లకుపైగా ఆయన రాష్ట్రానికి సేవలందించారు. ఎంతో మంది రాజకీయ నేతలకన్నా చాలా బాగా ప్రజలను ఆకర్షించగల వాగ్ధాటిని సొంతం చేసుకున్నారు. కాబట్టి, తమిళ్‌-ఒడియా అనే చర్చ అప్రస్తుతం. 2024లో జరగనున్న ఎన్నికలు చాలా కీలకం. ఇందులో పాండియన్‌ కీలక పాత్ర పోషించనున్నారు’’ అని అక్కడి రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.