మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల్లో రికార్డు సృష్టిస్తోంది. అనుకున్న విధంగా ప్రభుత్వానికి ఖజానా రాకపోవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంతలో అంటే.. కేవలం రెండు నెల (నవంబర్, డిసెంబర్)ల్లోనే ఏకంగా రూ.10,572 కోట్ల రుణాన్ని బాండ్ల వేలం ద్వారా తీసుకుంటోంది. ఒక్క డిసెంబరులోనే రూ.7 వేల కోట్ల అప్పులు చేస్తోంది. గత నవంబరులో రూ.3,572 కోట్ల రుణం తీసుకున్న ప్రభుత్వం.. డిసెంబరు 1న రూ.1000 కోట్లు, 8న మరో రూ.1000 కోట్లు, 15న రూ.2 వేల కోట్లు, 22న మరో రూ.2 వేల కోట్ల అప్పులు తీసుకుంది. ఈ నెల 29న మరో రూ.1000 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్‌బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read: ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పింది టీఆర్‌ఎసే కదా..!
సాధారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయినప్పుడు.. ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాల అమలు వంటి వాటి కోసం బాండ్ల వేలం ద్వారా అప్పులు చేసే వీలు సర్కారుకు ఉంటుంది. వీటితోపాటు కార్పొరేషన్ రుణాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం (2020–-21)లో ఇప్పటికే రూ.22 వేల కోట్లు అప్పులు చేయగా.. తాజాగా తీసుకోనున్న రుణంతో కలిపి అది రూ.32,572 కోట్లు కానుంది. గత ఆర్థిక సంవత్సరం (2019–-20) మొత్తంగా ప్రభుత్వం చేసిన అప్పులు రూ.30 వేల కోట్లలోపే ఉండగా.. ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికే రూ.32 వేల కోట్లు దాటనున్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని పెంచడం, జీఎస్టీ పరిహారం పొందడానికి వీలుగా ఆప్షన్-1ను ఎంచుకున్నందున మరో రూ.5,017 కోట్ల అదనపు రుణం తీసుకోవడానికి కూడా రాష్ట్రానికి వెసులుబాటు కలిగింది.
యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు బంధు డబ్బులను చెల్లించడానికి వీలుగా ప్రస్తుతం అధికారులు నిధులను సమకూర్చే పనిలో పడ్డారు. ఇందుకు రూ.7,300 కోట్లు అవసరం ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిధులను ఈ నెలాఖరు నుంచి జనవరి మొదటి వారంలోగా రైతుల ఖాతాల్లో జమ చేయాలనే యోచనలో ఉన్నారు. అందుకే ఈ నెలలో ఎక్కువగా అప్పులు తెస్తున్నారు. కాగా, ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం రూ.లక్ష కోట్లకు అటు ఇటుగాఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు రూ.40 వేల కోట్ల మేర రుణాలు తీసుకుంటున్నందున.. ఈసారి వ్యయం రూ.1.35 లక్షల కోట్ల దాకా ఉంటుందని భావిస్తున్నారు.
Also Read: కేసీఆర్ దిద్దు‘బాట’ చర్యలు
గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.1.02 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. దీనికితోడు రూ.29,902 కోట్ల అప్పులు తేవడంతో మొత్తం వ్యయం రూ.1.32 లక్షల కోట్లు అయింది. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ను రూ.1.82 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇందులో రూ.30 వేల కోట్లు భూవిక్రయం ద్వారా, మరో రూ.30 వేల కోట్లను అప్పుల ద్వారా సమకూర్చాలని ప్రతిపాదించారు. మిగిలిన రూ.1.22 లక్షల కోట్ల నిధులు వివిధ ఆదాయ మార్గాల ద్వారా సమకూరుతాయని అంచనా వేశారు. కానీ, ఇందులో రూ.20 వేల కోట్ల మేర తగ్గే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్