Agneepath Scheme Protest: మన దేశంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించం సాధారణంగా మారింది. ఆ నిర్ణయం మంచిదా కాదా, దాని ఫలితాలు ఎలా ఉంటాయి.. ఆ నిర్ణయంతో సత్ఫలితాలు వస్తాయా, విఫలమవుతాయా అనే విచక్షణ లేకుండా గుడ్డిగా వ్యతిరేకించడం విపక్షాలకు అలవాటుగా మారింది. ఇలాంటి పరిస్థితిలో దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం మొదలైంది. ఇక్కడ అధికార పక్షంతోపాటు విపక్షాల తొదరపాటు నిర్ణయాలతో యవత దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలకు దిగుతోంది. అగ్నిపథ్ అగ్గి రాజేస్తోంది. ఇక్కడ తమకు నచ్చదు కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశమే ప్రతిపక్షాల్లో కనిపిస్తోంది. ఇక ఎన్నికలకు రెండేళ్ల ముందు ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యమే కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇక్కడ రెండింటికీ విచక్షణ లేనట్లుగానే కనిపిస్తోంది. దీంతో ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు ఆందోళనకుగురై నిరసనలు చేస్తున్నారు. కేవలం నాలుగేళ్లు సర్వీస్‌లో ఉంచి ఆ తర్వాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏమిటని వారి ఆందోళన.. ఇలాంటి అపోహలను తొలగిస్తూ, వాస్తవాలను దేశ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
అగ్నిపథ్ పథకం ఎందుకు?
దేశ రక్షణకు వెన్నెముకగా నిలిచే త్రివిధ దళాలను మరింత బలోపేతం చేయడంతోపాటు యువతకు, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా సంస్కరణలకు అంకురార్పణ పలికిన కేంద్ర ప్రభుత్వం ’అగ్నిపథ్’ పేరుతో కొత్త సర్వీసులను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయించే వార్షిక బడ్జెట్‌లో అత్యధికం వేతనాలు, ఫించన్లకే పోతోంది. ఈ భారాన్ని తగ్గించడం ద్వారా మిగులు నిధులను రక్షణ రంగ ఆధునీకరణకు కేటాయించడం అగ్నిపథ్‌లో ఒక భాగం. మన దేశంలో సైన్యంలో సుమారు 15 లక్షల మంది త్రివిధ దళళాల్లో పనిచేస్తున్నారు. వీరుకాకుండా మరో 10 లక్షల మంది రిజర్వు దళాల్లో ఉన్నారు. వీరికి చెల్లించే జీత భత్యాలు, పింఛన్లతో పాటు, ఆయుధాల కోసం, రక్షణ ఒప్పందాల కోసం కేంద్రం ఏటా రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఆదునిక యుగంలో మానవ శక్తికంటే ఆయుధ శక్తి ముఖ్యం. ఇందు కోసం ఖర్చు తగ్గించుకుని ఆధునిక పరిజ్ఞానం పెంచుకోవడంపై దృష్ట పెట్టింది. ఈ క్రమంలోనే పింఛన్ల భారం తగ్గించడంతతోపాటు యువతకు ఉపాధి కల్పించేలా అగ్నిపథ్‌కు శ్రీకారం చుట్టింది.
Also Read: Agneepath Scheme Advantages Disadvantages: ‘అగ్నిపథ్’ యువకులకు లాభమా..? నష్టమా..?
గడ్డిగా వ్యతిరేకించడమే సమస్య…
దేశ రాజకీయాలు పూర్తిగా దిగజారిపోతున్నాయి. పార్టీతో సబంధం లేకుండా అన్నీ ఒకే విధానం అవలంబిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే ఇంకోలా వ్యవహరిస్తున్నాయి. ఇదే ఇప్పుడు సమస్యగా మారుతోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించడమే తమ విధి అన్నట్లు ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి. ఈ విధానం మంచిదా, కాదా, అములో ఏమైనా లోపాలు ఉన్నాయా.. అని సమీక్ష చేసి.. ప్రభుత్వానికి సూచనలు చేయాలి. కానీ దేశంలో ప్రతిపక్షాలన్నీ ఒకే పంథా అవలంబిస్తున్నాయి. కేంద్రం తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో అధికార పక్షాలు తమ నిర్ణయాలను సమర్థించుకుంటూ విపక్షాలపై దుమ్మెత్తి పోస్తోంది. ఇక్కడే సామాన్య జనం ఎటువైపు ఉండాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.
సైన్యం విషయంలో రాజకీయమెందుకు?
సైన్యంలో చేరిక విషయంలో కేంద్రం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. గతంలో సైన్యం విషయంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. అఖిలపక్ష సమావేశం నిర్వహించేవి. సైన్యం విషయంలో విపక్షాలు కూడా అధికార పార్టీకి మద్దతు ఇచ్చేవి. నేడు ఆ పరిస్థితి లేదు. ఈ విధానం కూడా సమస్యు కారణమవుతోంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఎవరూ ఆలోచన చేయడం లేదు. మన దేశంలో ఏటా సైన్యం కోసం రూ.5 లక్షల కోట్లకుపైగానే ఖర్చవుతోంది. ఇందులో వేతనాల కోసమే రూ.3 లక్షల కోట్లు ఖర్చువుతోంది. ఈ విధానంతో ఆధునికసాంకేతికత విషయంలో దేశం వెనుకబడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం వేతన భారం తగ్గించడం కోసం అగ్నిపథ్ పథకం తీసుకువచ్చింది. దీని ద్వారా సైన్యానికి ఆధునిక ఆయుధాలు రావడంతోపాటు దేశ రక్షణ సామర్థ్యం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో విపక్షాలు విచక్షణా రహితంగా గుడ్డిగా కేవలం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఈమేరకు యువతను రెచ్చగొట్టాయి. విపక్షాల పర్యవసానంగా దేశవ్యాప్తంగా హింస, నిరసనలు, అల్లర్లు జరుగుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమన ధోరణి. ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నదే నిర్ణయాలు చేయడం కోసమే. ఈ నిర్ణయాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. విధానాలను ప్రజల ముందు ఉంచాలి. వాటి ఫలితాలలు ఎలా ఉంటాయో వివరించాలి.
దేశ భవిష్యత్తు కంటే రాజకీయాలకే ప్రాధాన్యం..
దేశంలో ప్రస్తుతం దేశ భవిష్యత్తును ఆలోచించే పార్టీల కంటే తమ ప్రయోజనాల గురించి నిర్ణయాలు తీసుకునే పార్టీలే ఎక్కువగా ఉన్నాయి. మూర్ఖపు నిర్ణయాలతో దేశ భవిష్యత్‌కు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. విధ్వంస రాజకీయాలతో దేశ రాజ్యాంగమే అపహాస్యమయ్యే పరిస్థితి నెలకొంటుంది. ప్రజాస్వామ్యయ వైఫల్యానికి ఇలాంటి ఘటనలు నిదర్శనంగా నిలుస్తాయి. ప్రభుత్వ ఉద్యోగమే చేయాలనే భావనను ప్రతిపక్షాలు యువతలో చొప్పించడం కూడా ద్వేషభావం పెరిగేందుకు కారణమవుతతోంది. పార్టీతో, ప్రభుత్వంతో సంబంధం లేకుండా యువత కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ నిర్ణయాలను విశ్లేషించుకునే విధంగా వ్యవస్థను తయారు చేయాలి. ‘వినదగునెవ్వరు చెప్పిన’ అన్నట్లు మంచి ఎవరు చెప్పినా వినాలి. చివరకు శత్రువు చెప్పినా వినాలి. చెడు మిత్రుడు చెప్పినా వ్యతిరేకించాలి. గుడ్డిగా వ్యతిరేకించే విధానం మారాలి.