Amit Shah And NTR Meeting: జూనియర్ ఎన్టీఆర్ పై బీజేపీ కన్ను పడిందా ?, అమిత్ షాతో ఎన్టీఆర్ ఎందుకు భేటీ అయ్యాడు ? తెలంగాణలో అమిత్ షా టూర్ ముగిసింది. కానీ ఈ టూర్ కి సంబంధించిన న్యూస్ మాత్రం ఇంకా వైరల్ అవుతూనే ఉంది. నిజానికి ఎన్టీఆర్ ఏమీ షాను కలవడానికి ఆసక్తి చూపించలేదు. షానే తారక్ ను కలవాలని కబురు పెట్టాడు. దాంతో షా ఆహ్వానం మేరకు తారక్ భేటీ అయ్యాడు. అయితే, ఈ భేటీ పై ఇప్పుడు సర్వత్రా అనుమానం కలుగుతుంది. ఎప్పటి నుంచో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఎన్టీఆర్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

అందుకే, బీజేపీ పెద్దలు ఎన్టీఆర్ పై గురి పెట్టారని టాక్ నడుస్తోంది. మరోపక్క ‘RRR’లో కొమురం భీం పాత్రలో ఒదిగిపోయిన జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా అయినట్లు షా ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. ఆ అభిమానం కారణంగానే షా తారక్ ను కలుస్తున్నాడు తప్ప, మరో రాజకీయ కారణం ఏమి లేదు అని మరో టాక్ ఉంది. ఏది ఏమైనా ఈ భేటీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. వందలాది ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఇతర భాషల సైట్లు వీరి గురించి రాస్తున్నాయి.
సోషల్ మీడియా మొత్తం ఈ భేటీ గురించే హాట్ టాపిక్ అయ్యింది. పైగా నిన్న మధ్యాహ్నం నుంచి #AmitShahWithNTR అనే హ్యాష్‌ట్యాగ్‌తో లక్షల ట్వీట్లు వస్తున్నాయి. మరోపక్క బీజేపీ నేతలు, అభిమానులు ఎన్టీఆర్ పార్టీలో చేరాలని ఆశిస్తున్నారు. ఇది భారత రాజకీయాల్లో కొత్త శకమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తమ్మీద రానున్న ఎన్నికల్లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ సూచనలకు తాజాగా కొడాలి నాని కామెంట్స్ ఇంకా బలాన్ని ఇస్తున్నాయి. అమిత్ షా, NTR భేటీ పై వైసీపీ నేత కొడాలి నాని స్పందించారు. అవసరం ఉంటేనే మోడీ, అమిత్ షా ఎవరితోనైనా మాట్లాడుతారని, వారితో ఉపయోగం లేకుంటే అసలు దగ్గరికి కూడా రానివ్వరని, ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాబట్టి అమిత్ షా దేశవ్యాప్తంగా అతనితో ప్రచారం చేయించే ఛాన్స్ ఉందని తెలిపాడు.

మరి ఇది నిజమే అయితే, ఇక ఎన్టీఆర్ ను మరోసారి రాజకీయ తెర చూసే అవకాశం ఉంది. అయితే, షా ఎన్టీఆర్ ను కలవడానికి మరో కారణం కనిపిస్తోంది. హైదరాబాద్ లో ఉన్న సెటిలర్లను ఆకర్షించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుందట. ఇందులో భాగంగానే.. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ ను భేటీ అయ్యారని తెలుస్తోంది.