Telangana Liberation Day 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పొలిటికల్ వార్ రోడ్ల మీదకు ఎక్కుతోంది. ఏపీలోలా రాళ్లేసుకునే రాజకీయాలు కాకుండా.. విడివిడిగా ఎవరి బలప్రదర్శన వారు చేయనున్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఓన్ చేసుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ సెప్టెంబర్ 17న భారీ సభలు ఏర్పాటు చేస్తున్నాయి.
పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ సభ..
సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. ఇక ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా వచ్చే అవకాశం ఉంది. గతేడాది కూడా కేంద్రం తరపున అధికారికంగా సెప్టెంబర్ 17ను చేశారు. ఇప్పుడు మరోసారి చేయబోతున్నారు.
16, 17న కాంగ్రెస్ సమావేశం..
తెలంగాణలో ఈనెల 16, 17 తేదీలలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 17న భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ జన సమీకరణ చేయాలనకుంటుంది. శివారు ప్రాంతాల్లో ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేయాలన్న ఆలోచిస్తోంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలంతా హాజరవుతారు.
ఒకేరోజు రెండు సభలు..
ఒకే రోజు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ బహిరంగసభలు జరగనున్నాయి. విమోచనా దినోత్సవం విషయంలో మొదటి నుంచి కార్నర్ అవుతోంది బీఆర్‌ఎస్ పార్టీనే. ఉద్యమ సమయంలో అధికారికంగా నిర్వహిస్తామని ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయింది. గత ఏడాది బీజేపీ అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిసిన తర్వాత జాతీయ సమైక్యతా దినోత్సవం అంటూ కొత్త పాట అందుకున్నారు. ఈసారి అదే చేస్తారా.. మరేదైనా ప్లాన్ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.
పోలీసులకు సవాలే..
ఒకే రోజు రెండు జాతీయ పార్టీల సభలు.. జాతీయ నేతల రాక నేపథ్యంలో తెలంగాణ పోలీసులకు సవాల్‌గా మారనుంది. ట్రాఫిక్ కంట్రెల్, శాంతిభద్రతల పరిరక్షణ.. శాంతియుతొంగా సభలు జరిగేలా చూడడం వంటివి తెలంగాణ పోలీసులే చూసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర హోం మంత్రి వస్తే.. కేంద్ర బలగాలు రంగంలోకి దిగే అవకాశం ఉంది.