ఉదయం ఓ కండువా.. మధ్యాహ్నం మరో కండువా.. సాయంత్రం అయిందంటే ఇంకో కండువా.. ఎన్నికల సీజన్ వస్తోందంటే చాలు జంపింగ్ జిలానీలు పార్టీలు మారుతూనే ఉంటారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కూడా పార్టీలు మారుతున్న వారిని మనం చూస్తూనే ఉన్నాం. టికెట్లు దక్కక కొందరైతే.. పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదంటూ ఇంకొందరు. కొంత మందేమో సొంత గూటికి చేరితే.. ఇంకొందరు కొత్త దారుల్లో వెళ్తుంటారు.
Also Read: మాట ఇచ్చి మరిచిపోతున్న ఏపీ సీఎం జగన్…?
అలా పార్టీల మారే వారిని ఏమనాలి..? అలా మారే వారితో ఎంత వరకు ప్రయోజనం ఉంటుందా..? మళ్లీ ఎన్నికల దాక అదే పార్టీలో కొనసాగుతారని నమ్మకం ఏంటి..? అధికారం దక్కకుంటే పార్టీ మరరనే గ్యారంటీ ఏంటి..? ఇవన్నీ ఆలోచించకుండానే ఎలక్షన్ టైంలో పార్టీల అధినేతలు ఎవరిని పడితే వారిని చేర్చుకుంటూ ఉంటారు. వారితోని ఎప్పటికైనా ముప్పు అనే విషయాన్ని గ్రహించరు. పార్టీ ఏదైనా.. అధినాయత్వం ఎవరిదైనా.. ప్రతి ఒక్కరూ ఈ కప్పదాట్లను ప్రోత్సహిస్తూనే ఉంటారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహించారు. ఆ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. కొందరిని కావాలని లాగితే.. మరికొందరేమో అధికారం కోసం వచ్చారు. దీంతో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఎంత దుర్భరంగా తయారైందో అందరికీ తెలుసు. ముఖ్యంగా విశాఖలో దారుణంగా దెబ్బతింది.
విశాఖ జిల్లాలో మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా.. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు కూడా ఓడిపోయారు. వారు ఇప్పుడు పార్టీ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదట. టీడీపీ అధినేత చంద్రబాబు సాధారణంగా కొంత డబ్బు, పరపతి ఉన్నోళ్లకే టికెట్లు ఇస్తుంటారు. అలా విశాఖ ఎంపీగా గీతం సంస్థల అధినేత శ్రీభరత్‌ను, అనకాపల్లి నుంచి ఆడారి ఆనంద్, అరకు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కిశోర్ చంద్రదేవ్‌కు టిక్కెట్లు ఇచ్చారు.
విశాఖ ఎంపీగా పోటీచేసిన శ్రీభరత్ టీడీపీ నేతల వల్లే తాను ఓడిపోయానంటూ ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. తన ఓటమికి కారణాలపై అధిష్ఠానానికి నివేదికలతో సహా ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శ్రీభరత్ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకూ ఆయన దూరంగానే ఉంటున్నారట. ఇటీవల కొందరు పార్టీ కార్యాలయం, కార్యక్రమాల నిర్వహణ కోసం కొంత మొత్తాన్ని ఇవ్వాలని శ్రీభరత్ దగ్గరకు వెళ్లినా ఆయన పెద్దగా పట్టించుకోలేదట.
Also Read: జగన్ సర్కార్ ను ఉతికారేస్తోన్న మీడియా..?
అనకాపల్లి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆడారి ఆనంద్ వైసీపీకి చేరువయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని పట్టించుకునే వారు లేరు. ఎవరిని నియమించాలనుకున్నా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కిశోర్ చంద్రదేవ్ అసలు పార్టీలో ఉన్నారా లేరా అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీకే పరిమితమయ్యారు. ఇంకా లోకల్‌కు చేరనే లేదు. ఇలా విశాఖలోని మూడు పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అనేది లేకుండా పోయింది. అందుకే.. సాధారణంగా ‘బెల్లం చుట్టూ ఈగలు’ అని అంటుంటారు. అధికారం ఉంటేనే మన వెంట క్యాడర్ ఉంటుందనేది వాస్తవం.