
తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలకు.. రాబోయే ఎలక్షన్ కు ఏ మాత్రం సంబంధం ఉండదు. గత రెండు దఫాలుగా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగానే సాగింది యుద్ధం. కాంగ్రెస్ లోని లుకలుకలను సరిగ్గా క్యాష్ చేసుకొని సూపర్ విక్టరీ కొట్టింది గులాబీ పార్టీ. కానీ.. వచ్చేసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండబోతోంది. మరి, బీజేపీ రేసులోకి దూసుకురావడం ఒకెత్తయితే.. కొత్త పీసీసీ చీఫ్ తో కాంగ్రెస్ లో నూతనోత్సాహం నెలకొంది. మరోవైపు కొత్త పార్టీతో షర్మిల వచ్చేస్తున్నారు. దీంతో.. పోరు రసవత్తరంగా మారడం ఖాయంగా మారింది.
అయితే.. పార్టీల విషయాన్ని పక్కన పెడితే.. నాయకుల్లో ఎవరు ప్రజల హృదయాలను గెలుచుకుంటారనే చర్చ కూడా సాగుతోంది. సీనియర్ గా ఉన్న కేసీఆర్ ను పక్కన పెడితే.. రాబోయే ఎన్నికల్లో యువపోరాటం సాగే పరిస్థితి కనిపిస్తోంది. గులాబీ పార్టీ పరంగా చూస్తే.. యువనేత కేటీఆర్ స్థాయి ఏంటన్నది అందరికీ తెలిసిందే. పరిస్థితి అనుకూలించలేదుగానీ.. లేదంటే ఈ పాటికే సీఎం సీటు ఎక్కేసేవారు. ఇక, వచ్చే ఎన్నికల్లో గెలిస్తే.. ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి అయిపోయినట్టేనని అంటున్నారు. మరి, ఇంతటి ముఖ్యమైన ఎన్నికలను ఎదుర్కొనేందుకు కేటీఆర్ ఏ స్థాయిలో పోరాటం చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ఇక, రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న మరో పార్టి కాంగ్రెస్. సరైన నాయకుడు లేకనే.. ఆ పార్టీ రెండు సార్లు అధికారం కోల్పోయిందన్నది కేడర్ అభిప్రాయం. లేదంటే.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటుంటారు. సీన్ కట్ చేస్తే.. వారంతా ఎలాంటి నేత కావాలని ఆశించారో.. సరిగ్గా అలాంటి నేతే వచ్చేశాడు. ఫైర్ బ్రాండ్ గా పేరొంది రేవంత్ రెడ్డి.. ఆ ఒకే ఒక్క క్వాలిఫికేషన్ తో పీసీసీ సీట్లో కూర్చున్నారు. మరి, దాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తాడో కూడా తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. సోనియాగాంధీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడం ఒకటైతే.. వ్యక్తిగతంగానూ టీఆర్ఎస్ తో వైరం ఉండనే ఉంది. సో.. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రేవంత్ బరిలోకి దిగడం ఖాయం.
మరో ప్రత్యర్థి బీజేపీ గురించి చెప్పుకోవాల్సింది కూడా చాలా ఉంది. కాంగ్రెస్ చతికిల బడిన సంధికాలాన్ని సరిగ్గా వినియోగించుకున్న బీజేపీ.. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే స్థాయికి చేరింది. ప్రధానంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నారు. కేసీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కమలం శ్రేణుల్లో మరింత జోష్ నింపారు. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని చెబుతున్నారు. కాబట్టి.. పోరు ఆషామాషీగా ఉండే ప్రసక్తే లేదు.
ఈ ముగ్గురు మళ్లయోధుల పోరాటంలోకి తాను కూడా దిగబోతున్నట్టు ప్రకటించారు షర్మిల. వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అనే బ్రాండ్ తో తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న ఆమె.. రెండు రోజుల్లో పార్టీని ప్రారంభించబోతున్నారు. సోదరుడు జగన్ జైలుకు వెళ్లిన సమయంలో.. పార్టీ బాధ్యతలు అందుకొని తనదైన సహకారం అందించారు షర్మిల. ఆ కారణంగానే.. తెలంగాణలో షర్మిల పార్టీ పెడుతున్నారనే సరికి ఓ అటెన్షన్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికిప్పుడు ఈమె పార్టీపై ఒక అంచనాకు రాలేకపోయినప్పటికీ.. ఎన్నికల నాటికి లెక్క వేరే విధంగా ఉండొచ్చని అంటున్నారు. ఈ విధంగా.. 2023లో జరగబోయే ఎన్నికలు జోర్దార్ గా సాగడం ఖాయం. మరి, వీరిలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారు? ఎవరు హీరోలుగా మారుతారు? ఎవరు జీరోలుగా మిగిలిపోతారు? అన్నది చూడాలి.