https://oktelugu.com/

మేయర్ ఎన్నిక.. చెయ్యెత్తి జై కొట్టుడే..!

గ్రేటర్‌ హైదరాబాద్‌ పోరు ఆషామాషీగా సాగలేదు. సాధారణ ఎన్నికలకు ఏమీ తక్కువకాదు అన్నట్టుగా నడిచింది. పార్టీలు నువ్వా నేనా? అన్నట్టు ప్రచారం చేయగా.. ఓటర్లు మాత్రం ఎవరికీ పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. దీంతో ఏ పార్టీ మేయర్ పదవి దక్కించుకుంటుంది? దీనికోసం ఏ రెండు పార్టీలు దోస్తీ కడతాయి? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించిన రూల్స్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. Also Read: ‘చిత్రపురి’కి కొత్త […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 12, 2020 / 03:29 PM IST
    Follow us on


    గ్రేటర్‌ హైదరాబాద్‌ పోరు ఆషామాషీగా సాగలేదు. సాధారణ ఎన్నికలకు ఏమీ తక్కువకాదు అన్నట్టుగా నడిచింది. పార్టీలు నువ్వా నేనా? అన్నట్టు ప్రచారం చేయగా.. ఓటర్లు మాత్రం ఎవరికీ పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. దీంతో ఏ పార్టీ మేయర్ పదవి దక్కించుకుంటుంది? దీనికోసం ఏ రెండు పార్టీలు దోస్తీ కడతాయి? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించిన రూల్స్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.

    Also Read: ‘చిత్రపురి’కి కొత్త బాస్ ఎవరంటే?

    మేజిక్ ఫిగర్ అవసరం లేదు..
    మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు పూర్తి స్థాయి మేజిక్‌ ఫిగర్‌ అవసరం లేదని ఎలక్షన్ కమిషన్ తేల్చింది. కనీసం సగం మంది సభ్యులు హాజరవ్వాలన్న కోరం నిబంధనతో చేతులెత్తే పద్ధతిలోనే ఎన్నిక నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. డివిజన్లకు ప్రత్యక్షంగా ఎన్నికైన కార్పొరేటర్లతోపాటు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌ అఫిషియో సభ్యుల హోదాలో ఈ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు కలిగి ఉంటారని తెలిపింది.

    తొలి సమావేశంలోనే..
    గెలిచిన కార్పొరేటర్లతో నిర్వహించే మొదటి సమావేశంలో వారి ప్రమాణ స్వీకారం అనంతరం.. మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. మొత్తం సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైతే కోరం ఉన్నట్లు పరిగణించి, మేయర్‌ ఎన్నిక నిర్వహిస్తారు. మేయర్‌ ఎన్నిక జరిగితేనే డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగనుందని కనిషన్ పేర్కొంది. ఈ ఎన్నిక కోసం కూడా రిటర్నింగ్‌ అధికారిని నియమిస్తారు. ఒకటే నామినేషన్‌ దాఖలైతే ఏకగ్రీవమని ప్రకటిస్తారు. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే.. చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తారు.

    విప్ ఉంటుంది కానీ..
    మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా రాజకీయ పార్టీలు, కార్పొరేటర్లు ఎటువంటి క్యాంపులు నిర్వహించవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎవరిని ఎవరూ ప్రలోభపెట్టొద్దని చెప్పింది. ఈ ఎన్నికలకు కూడా నియమావళి వర్తిస్తుందని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు విప్‌ జారీ చేసుకోవచ్చని తెలిపింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, విప్‌ను ధిక్కరించినా చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే.. ఎవరైనా విప్‌ను ధిక్కరించి ఓటు వేస్తే మాత్రం అది చెల్లుబాటు అవుతుందని ప్రకటించింది. అంటే.. ఆ ఓటును లెక్కిస్తారు. కానీ.. ఎన్నిక తర్వాత విప్‌ ధిక్కరించిన సభ్యుడిపై.. విప్‌ జారీ చేసిన వ్యక్తి మూడు రోజులలోగా ప్రిసైడింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయాలి. అప్పుడు విప్‌ను ధిక్కరించిన సభ్యునికి రిటర్నింగ్‌ అధికారి ఏడు రోజులలోగా నోటీసు జారీ చేస్తారు.

    Also Read: కేటీఆర్ ఇలాఖాలో ఆధిపత్య పోరు.. రాజీనామా బాటపట్టిన నేతలు..!

    స్పందించకపోతే..?
    విప్ ధిక్కరించి, నోటీసు అందుకున్న సభ్యుడు 30 రోజులలోగా వివరణ ఇవ్వాలి. లేకపోతే మరో నోటీసును రిటర్నింగ్‌ అధికారి జారీ చేస్తారు. విప్‌ ధిక్కరించిన సభ్యుడు ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని పక్షంలో పదవిని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది.

    మూడేళ్ల వరకు అవిశ్వాసం లేదు..
    జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను పదవుల నుంచి తొలగించాలంటే అవిశ్వాసం తీర్మానం ద్వారానే సాధ్యం. అయితే.. వారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావాల్సిందే. ఇక, ఏ రెండు పార్టీల మధ్యనైనా మేయర్‌ పదవి ఒప్పందం జరిగితే మొదటి మేయర్‌ రాజీనామా చేసిన తర్వాత మరో మేయర్ ప్రమాణం చేయాల్సి ఉంటుంది.

    పార్టీల బలాబలాలివే..
    గ్రేటర్‌లో టీఆర్‌ఎస్ పార్టీకి 56, బీజేపీకి 48, ఎంఐఎంకు 44, కాంగ్రెస్‌ కు ఇద్దరు సభ్యులు ఉన్నారు. మొదటి సమావేశం నాటికి ఎక్స్‌ అఫిషియో సభ్యుల బలం తేలనుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం టీఆర్‌ఎస్ కు కనీసం 35 మంది, ఎంఐఎంకు 10 మంది, బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్ కు ఒక ఎక్స్‌ అఫిషియో సభ్యులున్నారు.