Ramanuj Pratap Singh- Cheetahs: నమిబియా నుంచి ఇండియాకు వచ్చిన చిరుతల గురించే ఇప్పుడు చర్చ అంత. కవ్వాల్ నుంచి తడోబా దాకా ఎన్నో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నప్పటికీ.. ఇండియాలో చిరుతలకు సంబంధించి ఒక్క రిజర్వ్ ఫారెస్ట్ కూడా లేదు. చదువుతుంటే ఆశ్చర్యం అనిపించినా ఇది ముమ్మాటికి నిజం. అంటే ఇండియాలో చిరుతలు నివసించేందుకు అనువైన వాతావరణం లేదా అంటే.. ఉంది. ఒకప్పుడు ఉమ్మడి మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర ప్రాంతాల్లో చిరుతలు భారీగా సంచరించేవి. భారతదేశాన్ని ఆంగ్లేయులు పాలిస్తున్నప్పుడు వారి వేట సరదా చిరుతల ప్రాణాల మీదికి వచ్చేది. పైగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా చిరుతల్లో సంతాన ఉత్పత్తి అంతంత మాత్రమే ఉండేది. ఇలా చిరుతలు అంతరించగా మూడు మాత్రం మధ్యప్రదేశ్ ఇప్పటి చత్తీస్గడ్ రాష్ట్రం అడవుల్లో మిగిలాయి. 1947-48 కాలంలో చతిస్గడ్ రాష్ట్రం కొరియా జిల్లాలో సస్తుగ సంస్థానం రాజు మహారాజ రామానుజ ప్రతాప్ సింగ్ వేటాడి వెంటాడి చంపాడు. దీంతో భారతదేశంలో చిరుతలు దాదాపుగా అంతరించిపోయాయి. 1952లో భారత దేశ ప్రభుత్వం అధికారికంగా చిరుతలు అంతరించిపోయాయని ప్రకటించింది. ఆ తర్వాత ఇతర దేశాల నుంచి చిరుతలను తీసుకురావాలని ప్రతిపాదనలు ఉన్నా ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు.
అందుకే అంతరించిపోయాయా?
భారతదేశంలో చిరుతలు అంతరించిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పూర్వం బ్రిటిషర్లు భారతదేశాన్ని పాలించినప్పుడు తమ వీరత్వాన్ని ప్రదర్శించుకునేందుకు చిరుతపులులను వేటాడేవారు. అధునాతన ఆయుధాలు వారి వద్ద ఉండటంతో ఆ బుల్లెట్లు వాటి శరీరం నుంచి దూసుకెళ్లేవి. రాజులు పాలించిన కాలంలోనూ చిరుతలను పెంపుడు జంతువులుగా సాకేవారు. ఇంట్లో కుక్కల మాదిరిగా చిరుతపులులను గొలుసుల ద్వారా కట్టేసేవారు. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం పెద్ద పులుల కంటే చిరుతపుల ద్వారా మనుషులకు తక్కువ ముప్పు ఉంటుందని తేలింది.
ఇక భారత దేశంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం 1972లో చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాగా పూర్వకాలంలో చిరుతలను రాజులు, బ్రిటిషర్లు ఎలా వేటాడే వారో, వేటాడిన తర్వాత వాటి పక్కన నిలుచుని ఎలా ఫోటోలు దిగేవారో.. ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి ఫర్వీన్ కస్వాన్ అనే అధికారి ట్విట్టర్లో పలు ఫోటోలను, కొన్ని వీడియోలను పోస్ట్ చేశారు. శనివారం ప్రధానమంత్రి మోడీ మధ్యప్రదేశ్లో కునో రిజర్వ్ ఫారెస్ట్ లో నమీబియా నుంచి వచ్చిన చిరుతలను వదిలిపెట్టిన నేపథ్యంలో.. కస్వాన్ ట్విట్లు వైరల్ గా మారాయి.