RRR vs CM Jagan: ఏపీ రాజకీయాలు మరోసారి కీలక మలుపు తిరగనున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు తన పార్లమెంటు స్థానానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరిలో ఆయన తన ఎంపీ సభ్వత్వానికి రాజీనామా చేస్తే మరోసారి ఏపీలో ఉపఎన్నికల నగారా మోగనుంది. అయితే, వైసీపీ ఎంపీ సీటుతో పాటు వైసీపీకి కూడా రాజుగారు గుడ్ బై చెప్పనున్నట్టు సమాచారం. అనంతరం కాషాయ కండువా కప్పుకుని నరసాపురం పార్లమెంట్ ఉపఎన్నికల్లో పోటీచేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఎన్నికల్లో ఆర్ఆర్ఆర్ గెలిస్తే జగన్ ప్రభుత్వంపై జనాలకు నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. ఒకవేళ జగన్ హవాతో ఈ సీటు కూడా వైసీపీ ఖాతాలో చేరితే రాజుగారు నవ్వుల పాలు కాక తప్పదు..
2019 ఎన్నికల్లో రఘురామకృష్ణం రాజు వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ తీసుకునే నిర్ణయాలను ఆయన ఎందుకో వ్యతిరేకిస్తూ వచ్చారు. టీటీడీలో అన్యమతస్తులను నియమించడం, హిందూ ఆలయాల మీద దాడులతో పాటు మైనార్టీ వర్గాలను జగన్ అక్కున చేసుకోవడం వంటి విషయాల్లో ఆర్ఆర్ఆర్ గుర్రుగా ఉన్నారు. జగన్ తిరుపతి వెళ్లిన సమయంలోనూ అన్యమతస్తుల రిజిస్టర్‌లో జగన్ సంతకం చేయాలని పట్టుబట్టారు. ఎక్కడ చెడిందేమో తెలీదు గానీ వైసీపీ ఎంపీగా కొనసాగుతూనే జగన్‌కు వ్యతిరేకంగా రఘరామ చాలా కామెంట్స్ చేశారు. అంతేకాకుండా అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏకంగా సీబీఐకు లేఖ రాసి జగన్, వైసీపీ శ్రేణుల ఆగ్రహానికి కారణమయ్యారు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ సెన్సార్ రివ్యూ.. – సినిమా ఎలా ఉందంటే.. ?
ఈ క్రమంలోనే బీజేపీతో జట్టుకట్టేందుకు తన ఎంపీ సభ్వత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. రాజుగారు నిజంగానే రాజీనామా చేస్తే ఆరు నెలల్లో ఆ స్థానానికి ఉపఎన్నిక జరగాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 14 వరకు పార్లమెంట్స్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. పార్లమెంట్ సెషన్స్ అయ్యాక ఆర్ఆర్ఆర్ రాజీనామా చేస్తే ఈ ఏడాది చివర్లో సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసంలో ఎన్నికలు జరుగుతాయి.
ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఆర్ఆర్ఆర్ వైసీపీ యేతర పార్టీల మద్దతు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. నర్సాపురంలో వైసీపీ బలమైన అభ్యర్థులు లేరు. ఇతర పార్టీలు అక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. క్షత్రియులు, కాపులు గనుక ఆర్ఆర్ ఆర్‌కు జై కొడితే 2024 ఎన్నికల్లో జగన్ పార్టీపై ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతిపక్షాలు పుంజుకునే అవకాశం లేకపోలేదు. అందుకే ఈ ఎన్నికలు ఆర్ఆర్ఆర్ వర్సెస్ జగన్ అన్నట్టుగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.