
Jagan- Astrologer Vijay Kumar: ఏపీ సీఎం జగన్ భయపడుతున్నారా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడును తట్టుకోలేకపోతున్నారా? వైఎస్ భాస్కరరెడ్డి అరెస్ట్ తరువాత కలవరపాటుకు గురవుతున్నారా? ‘కీ’లక అరెస్టులు ఉంటాయని భావిస్తున్నారా? భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని గ్రహించారా? దీని నుంచి ఎలాగైనా బయటపడాలని చూస్తున్నారా? ఈసారి కేంద్ర పెద్దలతో కాకుండా.. ఓ లాబియిస్టును నమ్ముకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. రాజకీయంగాను న్యాయవ్యవస్థపై ప్రభావం చూపించగలరని ప్రచారం జరుగుతున్న విజయ్ కుమార్ అనే వ్యక్తిని రంగంలోకి దిగారు. ప్రత్యేక విమానంలో ఆయన్ను తాడేపల్లి ప్యాలెస్ కు తెచ్చి చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భాస్కరరెడ్డి అరెస్ట్ తరువాత అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దుచేసుకొని మరీ విజయ్ కుమార్ తో చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రముఖులతో పరిచయాలు..
కర్నాటకకు చెందిన విజయ్ కుమార్ ప్రముఖ జ్యోతిష్యుడిగా పేరుంది. ఆన్ లైన్ లో జ్యోతిష్య సలహాలు ఇస్తుంటారు. దేశంలోని ప్రముఖులతో సంబంధాలున్నాయి. జ్యోతిష్యం కంటే పెద్ద లాబియింగ్ జరుపుతుంటారని ప్రచారం ఉంది. జ్యోతిషం, పూజల పేరిట రాజకీయ నేతలు, న్యాయ వ్యవస్థలోని పలువురు ప్రముఖుల వద్ద మంచి పేరు సంపాదించుకున్నారు. తనకున్న పరిచయాలతో తెర వెనుక చక్రం తిప్పుతూ పనులు చక్కబెడుతుంటారన్నది ఒక టాక్ గా ఉంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిం ద్, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టులోని అనేక మంది ప్రముఖులతో విజయ్ కుమార్ పూజలు చేయించడం, వారికి జ్యోతిష్యం చెప్పడం చేస్తుంటారని తెలుస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, ఇతర న్యాయ ప్రముఖులు ఇటీవల తిరుమల, శ్రీశైలం సందర్శించినప్పుడు కూడా ఆయన వారి వెంట ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతటి కీలక పరిచయాలుండబట్టే న్యాయ వ్యవస్థను వీలైనంత మేర మేనేజ్ చేసే బాధ్యతను జగన్ ఆయనకు అప్పగించారని ప్రచారం జరుగుతోంది.
లాబియింగులు చేస్తున్న జ్యోతిష్యులు…
ఇటీవల ఇటువంటి లాబియింగులు, ప్రలోభాల్లో స్వామిజీలు, జ్యోతిష్యులు ఎంటరవుతున్నారు. తెలంగాణలో ఆ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెట్టిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇలా ప్రలోభ పెట్టిన బృందంలో స్వామిజీ ఒకరు ఉండడం విశేషం. వారికి దేశ వ్యాప్తంగా ప్రముఖులతో పరిచయలు ఉంటాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్వామిజీలకు ప్రాధాన్యత పెరిగింది.అంతెందుకు తెలుగునాట విశాఖకు చెందిన శారదాపీఠం వ్యవస్థాపకుడు స్వరూపానందేంద్ర స్వామిజీకి ఎనలేని ప్రాధాన్యత దక్కుతుంది. ఆయన సిఫారసులకు తెలుగు రాష్ట్రాల పాలకులు పెద్దపీట వేస్తారన్న టాక్ ఉంది. పూజలు, జ్యోతిష్యాల పేరిట దేశ ప్రముఖులకు వీరు దగ్గరవుతున్నారు. లాబీయిస్టులుగా మారుతున్నారు.

చివరి ప్రయత్నంగా..
ఇన్నాళ్లూ ఢిల్లీ లాబీయింగ్ పనిచేసినా.. ఇప్పుడు మాత్రం కుదిరే పని కాదన్నట్టుగా పరిస్థితి ఉంది.
సీబీఐ స్పీడ్ పెంచినప్పుడల్లా, ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో వ్యవహారం నెరపి, బ్రేకులు వేయించిన జగన్ ప్రయత్నాలు ఈసారి ఫలించలేదని తెలుస్తోంది. దీంతో కొత్త రూట్‌లో ప్రయత్నాలు మొదలెట్టారు.విజయ్ కుమార్ ను నమ్ముకున్నారు. అత్యంత సన్నిహితుడు, పారిశ్రామికవేత్త, కృష్ణపట్నం పోర్టు ఎండీ గా పనిచేసిన చింతా శశిధర్ విజయ్ కుమార్ ద్వారా ప్రయత్నిస్తే వర్కవుట్ అవుతుందని జగన్ కు సలహా ఇచ్చారుట. అందుకే శశిధర్ దగ్గరుండి కర్ణాటక వెళ్లి విజయ్‌కుమార్‌ను స్వయంగా వెంట పెట్టుకొని వచ్చారు. మైసూ ర్ నుంచి ప్రత్యేక విమానంలో విజయ్ కుమార్ నుతెప్పించారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మరి విజయ్ కుమార్ జగన్ ను ఎంతవరకూ కష్టాల నుంచి గట్టెక్కించగలరో చూడాలి మరీ.