CM KCR On AP: ఏపీలో కేసీఆర్ ఫోకస్ ఎవరి పైన ? బీఆర్ఎస్ దూకుడు ఎవరికి నష్టం ? ఎవరికి లాభం ? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సంక్రాంతి సందర్భంగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీనే చర్చకు కారణమవుతోంది. ఏపీలోని కీలక ప్రాంతాల్లో ఫ్లెక్సీల ఏర్పాటుతో బీఆర్ఎస్ ఫోకస్ పైన స్పష్టతనిస్తోంది. సంక్రాంతి తర్వాత ఏపీ బరిలో దిగేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.

ఏపీలో బీఆర్ఎస్ వేగంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ తర్వాత ఏపీ పైనే ఎక్కువగా దృష్టి సారించింది. సంక్రాంతి తర్వాత విస్తరణ వేగంగా చేపట్టాలని భావిస్తోంది. విజయవాడ, కోస్తాంధ్రలోని కీలక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సంక్రాంతి సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాపులు అధికంగా ఉన్న ప్రాంతాలైన కాకినాడ, ముమ్మడివరం, పోలవరం, యానాం ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పై అందరి దృష్టి పడింది.
వచ్చే ఎన్నికల్లో కాపు సామాజివర్గ ఓటు బ్యాంకే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎత్తుగడ వేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాపుల ఓట్లు చీల్చడం ద్వార పవన్ కు నష్టం కలిగించే ప్రయత్నం జరుగుతోందనేది పలువరి వాదన. కాపు ఓట్లు చీల్చితే జనసేన, టీడీపీ పొత్తు ప్రభావం అధికార పార్టీ పైన ఉండదనే చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగానే కాపు సామాజికవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ కు ఏపీ పగ్గాలిచ్చారని తెలుస్తోంది. ఫలితంగా బీఆర్ఎస్ వ్యూహం జగన్ పార్టీకి కలిసొస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు జనసేన, టీడీపీల వైపు పూర్తీగా వెళ్లకుండా చూసే వ్యూహం కూడ బీఆర్ఎస్ కు ఉందని మరో చర్చ జరుగుతోంది.

జనసేన, టీడీపీ అసంతృప్తుల్ని, కాపు నేతల్ని బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం తోట చంద్రశేఖర్ ముమ్మరంగా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జనసేన నేత, తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు కేసీఆర్ ను కలిశారు. ఇదే తరహాలో మరికొందరు బ్యూరోక్రాట్లను బీఆర్ఎస్ వైపు నడిపించాలని తోట చంద్రశేఖర్ వ్యూహరచన చేస్తున్నారు. అయితే… జనసేన , టీడీపీ మాత్రం బీఆర్ఎస్ ను పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ ప్రభావం ఏమాత్రం ఉండదని భావిస్తున్నారు.