Gujarat AAP Isudan Gadhvi: ముక్కూమొఖం కూడా తెలియని ఓ టీవీ యాంకర్ ఇప్పుడు కాబోయే గుజరాత్ సీఎం అవ్వనున్నారు. అదే ప్రజాస్వామ్యం అంటే.. పంజాబ్ లో జరిగిందే .. గుజరాత్ లోనూ జరుగుతోంది. ప్రజలే సీఎం క్యాండిడేట్ ను ఎన్నుకున్నారు. ఈ కొత్త ఒరవడితో ఆమ్ ఆద్మీ సామాన్యులకు చేరువ అవుతోంది. జనంలోంచే లీడర్లను ఎన్నుకుంటోంది.

దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఢిల్లీ పక్కనున్న పంజాబ్ లో ఎలాగైతే ప్రజాస్వామ్య బద్దంగా పంజాబ్ సీఎం అభ్యర్థి ఎవరని ప్రజలనే ఓట్లేసి ఎన్నుకోవాలని అన్నారో.. గుజరాత్ లోనూ అలానే చేశారు. అనూహ్యంగా గుజరాత్ ఆప్ అధ్యక్షుడు కాకుండా మరొకరు సీఎం అభ్యర్థిగా ప్రజలు ఓటేశారు. అతడే ఇప్పుడు గుజరాత్లో అధికారంలోకి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ తరుఫున సీఎం అభ్యర్థి అవుతాడు.
పంజాబ్ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలతోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1, 5 తేదీల్లో గుజరాత్ ఎన్నికల్లో పార్టీని లీడ్ చేసే అవకాశం ఒక టీవీ యాంకర్ కు ఇచ్చారు. ఆయనే గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ తరుఫున సీఎం అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
పంజాబ్ తరహాలోనే గుజరాత్ లోనూ సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన పోల్ లో 40 ఏళ్ల టీవీ యాంకర్ ‘ఇసుదాన్ గఢ్వీ’ ఎన్నికయ్యాడు. శుక్రవారం ఈయనను కేజ్రీవాల్ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. గుజరాత్ సీఎం అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవాలని ఆప్ పార్టీ పోల్ నిర్వహించింది. ఇందులో గఢ్వీకి 73 శాతం ఓట్లు వచ్చాయి. ఈ రేసులో గుజరాత్ ఆప్ ఇన్ చార్జి అయిన గోపాల్ ఇటాలికాకు 20శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. గుజరాతీలు గఢ్వీ వైపే మొగ్గుచూపడంతో ఆయనే ఆప్ గుజరాత్ సీఎం అభ్యర్థిగా ఎంపికైనట్టు కేజ్రీవాల్ ప్రకటించారు.
-ఎవరీ ఇసుదాన్ గఢ్వీ?
ఓ జర్నలిస్ట్ గా.. టీవీ యాంకర్ గా గుజరాతీలకు చిరపరిచితుడు ఇసుదాన్ గఢ్వీ. 40 ఏళ్ల గఢ్వీ గుజరాత్ లోని ద్వారక జిల్లా పిపాలియా గ్రామంలోని రైతు కుటుంబంలో జన్మించాడు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ లో మాస్టర్స్ చేశాడు. దూరదర్శన్ లో ‘యోజన’ అనే కార్యక్రమంతో తన కెరీర్ ను మొదలుపెట్టాడు. 2007-11 వరకూ ఈటీవీ గుజరాతీ చానెల్ లో జర్నలిస్ట్ గా పనిచేశాడు. పలు కుంభకోణాలను వెలికితీసి గుజరాత్ ప్రభుత్వాన్ని షేక్ చేశారు. నీతి, నిజాయితీగల జర్నలిస్టుగా రాష్ట్రమంతా పాపులర్ అయ్యాడు.
2015లో గుజరాత్ చానెల్ ‘వీటీవీ’లో ఎడిటర్ గా చేరారు. 2021 వరకూ అందులో చేరి ‘ప్రైమ్ టైమ్’ షో ‘మహామంథన్ ’పేరుతో సమకాలనీ అంశాలపై ఆయన చేసే చర్చతో పాపులర్ అయ్యాడు. యాంకర్ గా, జర్నలిస్ట్ గా ప్రజాదరణ పొందిన గఢ్వీ ఏడాది క్రితమే మీడియాను వీడి 2021 జూన్ లో అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆమ్ ఆద్మీలో చేరారు. అవినీతి ఆరోపణలు లేని ఈయన ఆప్ ప్రధాన కార్యదర్శిగా త్వరగానే ఎదిగారు. ప్రభుత్వ నియామక పరీక్ష లీక్ పై పోరాటం చేసి ఈ మధ్య జైలుకు కూడా వెళ్లాడు. గుజరాత్ లో 48 శాతం ఉన్న ఓబీసీ సామాజికవర్గానికి చెందిన నేత ఈయన. తాజాగా ప్రజలే ఈయన సీఎం కావాలని అభ్యర్థిగా ఓటు వేయడంతో ఈ గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుఫున బరిలోకి దిగబోతున్నారు. మరి ఈయన గెలుస్తాడా? గుజరాత్ లో పార్టీని గెలిపిస్తాడా? పంజాబ్ లోలాగానే గుజరాత్ లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడుతుందా? అన్నది వేచిచూడాలి.