Chiranjeevi- Urvashi Rautela: చిరంజీవి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య విడుదలకు సిద్ధం అవుతుంది. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా పోస్ట్ ప్రొడక్షన్ త్వరలో ప్రారంభం కానుంది. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం వాల్తేరు వీరయ్య జనవరి 11న విడుదల చేస్తారట. చిరంజీవి ఊర మాస్ రోల్ చేస్తుండగా మసాలా ఐటెం సాంగ్ సిద్ధం చేస్తున్నారు. ఐటెం భామగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రాతెలాను ఎంపిక చేశారు. చిరంజీవి-ఊర్వశి రాతెలా పై ఐటెం సాంగ్ చిత్రీకరించారట.

ఐటెం సాంగ్ కోసం భారీ సెట్ వేశారట. వాల్తేరు వీరయ్య మూవీ హైలైట్స్ లో ఒకటిగా ఈ ఐటెం సాంగ్ నిలవనుందట. ఊర్వశి రాతెలా గ్లామర్, మెగాస్టార్ స్టెప్స్ ప్రేక్షకులకు ఐ ట్రీట్ అంటున్నారు. ఇక ఐటెం సాంగ్స్ కి స్పెషలిస్ట్ అయిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సాంగ్ స్వరపరిచారు. మరొక విషయం ఏమిటంటే తెలుగులో ఊర్వశి నటిస్తున్న మొదటి చిత్రం వాల్తేరు వీరయ్య. చిరంజీవి కోసం ఫస్ట్ టైం ఈ స్టార్ మోడల్ అండ్ యాక్టర్ ని రంగంలోకి దించుతున్నారు.
రామ్ పోతినేని-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో కూడా ఊర్వశి రాతెలా నటిస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రవితేజ కీలక రోల్ చేయడం మరొక విశేషం. వాల్తేరు వీరయ్య మూవీ కథపై కొన్ని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. చిరంజీవి-రవితేజ సవతి తల్లులకు పుట్టిన అన్నదమ్ములని, వారి మధ్య సంఘర్షణ ఉంటుంది అంటున్నారు. హీరోగా ఫేమ్ రాని టైంలో రవితేజ ‘అన్నయ్య’ మూవీలో చిరంజీవి తమ్ముడిగా చేశారు.

మైత్రి మూవీ మేకర్స్ వాల్తేరు వీరయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ముఖ్యంగా చిరంజీవి మాస్ లుక్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించింది. వింటేజ్ చిరు గుర్తుకు వచ్చారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. మొత్తంగా దర్శకుడు బాబీ ఫుల్ మీల్ వంటి చిత్రం సిద్ధం చేస్తున్నాడని అర్థమవుతుంది. చాలా కాలం తర్వాత చిరంజీవి-బాలకృష్ణ సంక్రాంతికి పోటీపడుతున్నారు.