కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. వైరస్ సోకిన వారిలో చాలా మంది ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి. దీంతో.. మెరుగైన చికిత్స తీసుకోవడానికి అందుబాటులో ఉన్న ఆసుపత్రులకు వెళ్తున్నారు బాధితులు. అలా చూసినప్పుడు తెలుగు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రధాన నగరం హైదరాబాద్.
అయితే.. కొన్ని రోజులుగా ఆంధ్రప్రాంతానికి చెందిన అంబులెన్సులు హైదరాబాద్ కు రావొద్దని.. తెలంగాణ సర్కారు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో.. నిన్నామొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఉమ్మడి రాజధాని అంశం.. ఇప్పుడు తెరపైకి వచ్చింది. చట్ట ప్రకారం చూసుకున్నా.. తమకు మూడేళ్లపాటు హైదరాబాద్ పై హక్కులు ఉన్నాయని ఆంధ్రులు అంటున్నారు.
నిజానికి ఇందులో వందశాతం న్యాయం ఉంది. హైదరాబాద్ పై ఏపీ వాసులకు పదేళ్లపాటు హక్కుంది. అయినప్పటికీ.. భాగ్యనగరం తమదే అన్నట్టుగా వ్యవహరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది ఆలోచించినప్పుడు.. స్వార్థరాజకీయాలే కనిపిస్తున్నాయని అంటున్నారు జనం.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు సరిగ్గా ఏడాది కాలంపాటు హైదరాబాద్ లో ఉన్నారో లేదో.. 2015లో ఆయన విజయవాడకు వెళ్లిపోయారు. అయితే.. ఆయన వెళ్లిపోవడం వెనుక ఓటుకు నోటు ఒప్పందం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ కేసులో రాజీ పడడం ద్వారానే ఆయన హైదరాబాద్ ను వీడారని అన్నారు. ఆ విధంగా.. ఆ నాడే హైదరాబాద్ పై హక్కును వదిలేసుకున్నట్టైందని నిట్టూరుస్తున్నారు ప్రజలు.
ఇప్పుడు చూస్తే.. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ హైదరాబాద్ లోనే మకాం పెట్టారు బాబు. ఆయనే కాదు.. ఏపీకి చెందిన మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు చాలా మంది హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కానీ.. ఎటొచ్చీ ఆంధ్రకు చెందిన సామాన్య జనానికి మాత్రమే హైదరాబాద్ లో అడుగు పెట్టే అవకాశం లేకుండా పోయిందనే ఆవేదన వ్యక్తమవుతోంది.
రాష్ట్ర విభజనతో సరైన రాజధాని లేకుండా పోయిన ఆంధ్రులకు.. చట్టప్రకారం హక్కుగా ఉన్న ఉమ్మడి రాజధానికి ప్రాణాలు కాపాడుకునేందుకు వెళ్లే అవకాశం కూడా లేకపోయిందని ఆవేదన చెందుతున్నారు. ఇదంతా స్వార్థ రాజకీయాల ఫలితమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏపీవాసులు.