Demolition of Hindu temples: వందల ఏళ్లు భారతదేశాన్ని పాలించిన ముస్లిం పాలకులు చేసింది హిందూ వ్యతిరేక పాలన కాబట్టే వాళ్లు దేశంలో అనేక దేవాలయాలు కూల్చేశారు ఎన్నో దేవాలయాల్ని దోచుకున్నారన్న భావజాలాన్ని మొట్టమొదటిసారి హిందూ-ముస్లిం విభజనను తీసుకురావాలన్న బ్రిటీషు అధికారుల కుట్రలో భాగంగా ప్రారంభమైనదే! ఆ తరువాత ఇదే భావజాలాన్ని ఆర్.ఎస్.ఎస్, సంఘ్ పరివార్ వగైరా హిందూ మతతత్వ సంస్థలు తరువాతి కాలాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాయి.
-హిందూ పాలకులు చేసింది హిందూ వ్యతిరేక పాలన అనుకోవచ్చా?
ముస్లిం పాలకులు అనేక దేవాలయాలు కూల్చేశారు, గుళ్లలోని సంపదను దోచుకున్నారు కాబట్టి వారు చేసింది ముమ్మాటికీ హిందూ వ్యతిరేక పాలనే అని డిక్లేర్ చేసేవారు మరి స్వయంగా అనేకమంది హిందూ పాలకులు దేవాలయాలు కూల్చిన, దేవాలయాల సంపదను దోచుకెళ్లిపోయిన సంఘటనలు కూడా చరిత్రలో అనేకం ఉన్నాయి కాబట్టి ఆయా హిందూ పాలకులు చేసింది హిందూ వ్యతిరేక పాలన అని చెప్పగలరా?
ఎంతసేపు గజనీ, ఘోరీల కథలనే చెబుతూ ఒక్క ముస్లిం పాలకులే హిందూ దేవాలయాలు కుల్చారన్న కథల్నే పదే పదే వండి వార్చుతూ ఉన్న కారణంగా చాలా మందిలో ముస్లిం పాలకులంటే ‘హిందూ దేవాలయాలు కూల్చేసిన హిందూ వ్యతిరేక క్రూరులు’ అనే ఒక భావన ఏర్పడిపోయింది. నిజానికి దేవాలయాలను కూల్చేసిన, దోచుకున్న సంఘటనలు ముస్లిములకన్నా హిందూ పాలకుల కాలంలోనే ఎక్కువగా జరిగిందన్నది చరిత్ర పుటలు తిరగేస్తే తెలుస్తుంది!
-అటు ముస్లిం పాలకులైనా, ఇటు హిందూ పాలకులైనా దేవాలయాలను ఎందుకు కుల్చారు?
ఆనాటి ప్రతీ హిందూ రాజ్యానికి ఒక రాష్ట్రదైవం ఉండేది. ఆ ఆలయం ఆ రాజ్యలక్ష్మికి, సౌభాగ్యానికి, ప్రతిష్టకు సంకేతంగా కొనసాగేది. అంతేకాక ఆలయాలలో రహస్య మాళిగలలో సంపదలను భద్రపరచుకోవటం జరిగేది. ఆ విధంగా దేవాలయాలు సంపదకు నిలయాలుగా ఉండేవి.
Also Read: AP government: దావోస్ లోనూ అదే భజన.. అబద్ధాలను వండి వార్చుతున్న ఏపీ సర్కారు
ఒక రాజు మరో రాజ్యాన్ని జయించినపుడు ఓడిపోయిన రాజ్యం యొక్క రాష్ట్ర దైవాన్ని తరలించుకొని తన రాజ్యంలో ప్రతిష్టించుకోవటం అన్నది వేల సంవత్సరాలుగా నడిచిన ఒక సంప్రదాయం. అలా చేయటం ద్వారా మాత్రమే ఆ రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకోవటం పూర్తయినట్లు భావించేవారు. మధ్య యుగాల్లో ఒక రాజ్యం మరో రాజ్యాన్ని జయించినప్పుడు ఓడిపోయిన రాజ్యం యొక్క రాజ్య దేవతను, ధ్వంసం చేయడమో, తరలించుకుపోయి తమ రాజ్యంలో కలుపుకునేవారు. అలా చేయడం యుద్ధాన్ని నెగ్గటానికి, వారి రాజ్యాన్ని తమ రాజ్యంలో కలుపుకోవటానికి సంకేతంగా భావించేవారు.
ఆ విధంగా రాజ్యాలకు రాజ్యాలకూ మధ్య జరిగిన అనేక యుద్ధల్లో ఒక్క ముస్లిం రాజులే కాదు అనేక హిందూ రాజులు సైతం ఆలయాలను ధ్వంసం చేసిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. అదంతా కేవలం అప్పటి రాజ్యకాంక్ష తాలూకు యుద్ధోన్మాదమే తప్ప మతోన్మాదం కాదు.
అలాగే ఖుతుబుద్దీన్ ఐబక్ నుండి ఔరాంగ్ జేబ్ వరకు ఎందరో ముస్లిం పాలకులు భారీ విరాళాలు, జాగీర్లు ఇచ్చి దేవాలయాలు కట్టించిన, పునరుద్ధరించిన చరిత్ర సైతం ఉంది. కానీ, ఈ చరిత్ర నేడు మరుగుపరచబడింది. ఎందరో హిందూ-ముస్లిం పాలకులు ఎన్నో దేవాలయాల్ని కూల్చేయటం జరిగిందన్నది కాదనలేని వాస్తవం. అది కేవలం రాజ్యాల మధ్య యుద్ధ జ్వాలలు రగులుకున్న సమయంలో జరిగిందే తప్ప అందులో ఎటువంటి మత ఉన్మాదమూ లేదు.
Also Read: Who Will Win AP Elections: ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే గెలుపెవరిది?