Modi Youth: మోదీ.. మోదీ.. ఇంటా బయటా ఆయన నామస్మరణే.. అసలు మోదీలో ఏముంది? ఆయనంటే ఎందుకంత క్రేజ్..ముఖ్యంగా యువత మోదీ అంటే ఎందుకు పడిచస్తారు? అంత క్రేజ్ ఆయనకు ఎందుకొచ్చిందంటే? ఆసక్తికర సమాధానాలు వస్తున్నాయి… దేశంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లకు పైగా అవుతోంది. ప్రధాని కాకముందు ఆయన గుజరాత్ కు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీర్చి దిద్దారు. మోదీ మేనియా చూసిన ప్రజలు దేశాన్ని కూడా ఆ విధంగా తయారు చేస్తారని 2014లో ఆయనను గెలిపించారు. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ఐదేళ్ల తరువాత అంతేస్థాయిలో గ్రాఫ్ పెరిగి రెండో సారి ప్రధానమంత్రి అయ్యారు. మనదేశంలో ఒక పార్టీ రెండు పర్యాయాలు పాలించడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే ఇక్కడ బీజేపీపై కాకుండా మోదీపై ఉన్న నమ్మకంతోనే ఆయనను గెలిపిస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఈ క్రమంలో మోదీ గెలుపునకు కారణం ఎవరు..? ఆయనను మళ్లీ మళ్లీ ఎవరు గెలిపిస్తున్నారు..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పెషల్ ఫోకస్…
2014కు ముందు ఉన్న బీజేపీ వేరు.. మోడీ వచ్చాక మారిన బీజేపీ వేరు.. మోడీ వచ్చాక పార్టీకి చాలా మార్పులు వచ్చాయి. అంతకుముందు హిందుత్వం అనే భావనతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది. కానీ 2014 తరువాత మోదీ మేనియాతోనే బీజేపీ పలుచోట్ల విజయం సాధించిందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే మోదీని గెలింపిచన వారెవరు..? అన్న ప్రశ్నకు ఒక్కటే సమాధానం వినిపిస్తోంది. అదే యువత. మోదీ వెనక ఉన్నది యువతనేనని ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనను గెలిపిస్తున్నది మిలీనియల్స్ తరం అంటోంది. మరి ఈ తరం మోదీని ఎందుకు కోరుకున్నది..?
వివన్ మార్వాహా అనే ఆర్థిక పరిశీలకుడు కొన్ని పరిశోధనలు చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. మోదీని ఎక్కువగా మిలినియల్స్ తరం కోరుకుంటుందని అంటున్నారు. మిలినియల్స్ తరం అంటే 1981-1996 మధ్య పుట్టిన వారు. దేశంలో వీరి సంఖ్య 40 కోట్లు ఉందట. వీరిని మోదీ ఆకర్షించడం ద్వారా ఆయన మళ్లీ మళ్లీ గెలుస్తున్నారని అంటున్నారు. వారి మనసులు దోచుకున్నమోదీ వారి ఓట్లతోనే అధికారంలో ఉంటున్నారని అంటున్నారు. మరి వీరు మోదీని కోరుకోవడానికి కారణం ఏంటి..? ఎందుకు మోదీపై అభిమానం పెంచుకున్నారు..?
మనదేశంలో మిలీనియల్ష్ కాలానికి చెందిన యువత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వీరిలో ఎక్కువ శాతం నిరుద్యోగులే ఉన్నారు. 30 సంవత్సరాలు వచ్చినా చాలామంది తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉన్నారు. కొందరు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండగా.. మరికొందరు తమకు అనువైన ఉద్యోగం రాలేదని వేచి చూస్తున్నారు. రకరకాలుగా సరైన జాబ్ కోసం వేచిచూస్తుండడంతో నిరుద్యోగం పెరిగిపోయింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని గ్రామాలు, పట్టణాల్లోని యువకులు ఇదే విషయంపై వాపోయారు. ఆర్థిక వ్యవస్థ ఛిన్నభిన్నంగా ఉండడంతో ప్రతీ చోట ఆశాంతిక వాతావరణం ఏర్పడింది. 30 ఏళ్లు దాటిన యువకులు కనీస ఖర్చుకోసం తల్లిదండ్రులపై ఆధారపడుతున్నారు.
ఈ విషయాన్ని మోదీ బాగా పసిగట్టారు. దేశంలో నిరుద్యోగ సమస్యలో కొట్టుమిట్టాడుతోందని గ్రహించారు. అందుకే యువతను లక్ష్యంగా చేసుకొని వారికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. అయితే మొదటి పర్యాయంలో ఉద్యోగాలు ఇప్పించడంలో ఫెయిల్ అయినా మరోసారి అవకాశం ఇస్తే తమకు న్యాయం జరుగుతుందని యువత నమ్మింది. దీంతో 2019 ఎన్నికల్లోనూ మోదీకే పదవి కట్టబెట్టారు. మొత్తంగా 18 నుంచి 35 సంవత్సరాల వయసులో ఉన్నవారు మోదీని బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయన మళ్లీ మళ్లీ గెలుస్తున్నారు.
అయితే యువత ఆశించిన ఉద్యోగాలు వస్తున్నాయా..? అంటే సమాధానం ఎవరూ చెప్పలేకపోతున్నారు. దశాబ్దాల పాటు రాజకీయ నాయకులను మార్చుకుంటూ వస్తున్న యువతకు ఎప్పుడూ నిరాశే ఎదరవుతుంది. ఏ పార్టీకి చెందిన నాయకులూ యువతకు న్యాయం చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ నాయకుల కొన్ని ప్రసంగాలు యువతను ఆకర్షించే విధంగా ఉన్నా వారి జీవితాలకు మాత్రం సరైన న్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.