NTR Jagan: పాలనా సంస్కరణలు చేసిన వారు చరిత్రలో నిలిచిపోయారు. నాడు పటేల్ , పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజలపై జరుగుతున్న దోపిడీని అరికట్టిన నాటి సీఎం ఎన్టీఆర్ ‘మండలాల’ వ్యవస్థను ప్రవేశపెడితే తొలుత అందరూ విమర్శించారు. దీంతో ఎన్టీఆర్ ఓడిపోతారని.. చరిత్ర హీనుడవుతారని అన్నారు. కానీ ఆ మండలాలే ఇప్పుడు ప్రజలకు పాలన చేరువ చేసి అధికారులను అందుబాటులో ఉంచి తెలుగు రాష్ట్రాల్లోనే గొప్ప సంస్కరణగా నిలిచిపోయింది.
ఇప్పుడు అలాంటి అరుదైన అవకాశాన్ని చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో వదులుకున్నాడు. పక్కనే ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాలు విభజించి ప్రజల దృష్టిలో హీరో అయిపోగా.. కాలయాపనతో చంద్రబాబు అధికారం పోగొట్టుకున్నాడు. కానీ జగన్ మాత్రం తన పాలనలో జిల్లాలు ప్రకటించి ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు.
అయితే ఎన్టీఆర్ ‘మండలాలను’ గొప్ప సంస్కరణగా అభివర్ణించిన టీడీపీ మీడియా ఇప్పుడు జగన్ ‘జిల్లాల’ను మాత్రం జీర్ణించుకోవడం లేదు. తాజాగా టీడీపీ అనుకూల మీడియా రాతలు చూస్తే అసలు జగన్ చేసిన జిల్లాలు వేస్ట్ అని.. అవి ఎందుకు పనికిరావని.. ప్రజలకు ఉపయోగం లేవన్నట్టుగా రాస్తున్నారు. ఎన్టీఆర్ ను దేవుడిని చేసి జగన్ ను దెయ్యంగా నామమాత్రుడిగా చూపిస్తున్నారు.
కొత్త జిల్లాలను ప్రకటించినప్పటి నుంచి మీడియా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఏబీఎన్ రాధాకృష్ణ ఈరోజు తన ‘కొత్తపలుకు’ కాలమ్‌లో ఏదో రాశారు. “జిల్లాల సంఖ్య పెంచడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఈ రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేదు. అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది” నొక్కి వక్కాణించారు. అయితే గత రెండు మూడు రోజులుగా జిల్లా కేంద్రం ప్రజలకు దూరమవుతోందని అదే దినపత్రిక వాపోయింది. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు భౌతికంగా వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నప్పుడు, ప్రభుత్వ కార్యాలయాల భౌతిక దూరం గురించి ఎందుకు ఆందోళన చెందాడని నిలదీస్తున్నారు. ఈరోజు జిల్లాల విభజనతో పెద్దగా ప్రయోజనం లేదని ఎందుకు రాశాడన్నది సగటు పాఠకుడి ప్రశ్న.
ప్రజలకు దగ్గరైన పాలన చేరువ చేయడానికి.. ప్రజలకు ఎంతో సహాయం చేసిన ఎన్టీఆర్ మండలాలుగా విభజించారు. దాన్ని మాత్రం గొప్ప సంస్కరణగా ఇదే టీడీపీ మీడియా అభివర్ణించడం గమనార్హం. ఎన్టీఆర్ ను అంగీకరిస్తున్న టీడీపీ మీడియా.. జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు తదితర వాటికి ఎందుకు అంగీకరించలేకపోతున్నారన్నది ప్రశ్న. గ్రామ ప్రజలు ఎంఆర్‌ఓ, మండల స్థాయి కార్యాలయాలకు వెళ్లకుండా తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. వ్యవసాయానికి సంబంధించిన వీఆర్వోలు, సర్వేయర్లు, అధికారులు ప్రస్తుతం గ్రామాల్లోనే ఉన్నారు. దీన్ని ఆర్కే ఎందుకు మెచ్చుకోలేకపోతున్నారని ఇదే పాఠకులు ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి టీడీపీ మీడియా జగన్ జిల్లాల విభజనతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కక్కలేక మింగలేక సమర్థించలేక.. తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తోందన్నది నిజం. ఎన్టీఆర్ చేసిన మేలు మాత్రమే ఇష్టం కానీ జగన్ మోహన్ రెడ్డి చేస్తే మాత్రం వాళ్లకు నచ్చడం లేదు. జగన్ వీలైనంత చెడుగా చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ప్రక్రియలో టీడీపీ మీడియా లాజిక్ కోల్పోతోంది.