Paleru: సెగ్మెంట్ స్కాన్: పాలేరు ఓటరు ఎటు వైపు?

పూర్తి గ్రామీణ నియోజకవర్గమైన పాలేరులో వ్యవసాయమే జీవనాధారం. వ్యవసాయానికి పాలేరు మధ్యతరహా ప్రాజెక్టు లోని నీళ్ళు అత్యంత అవసరం. ఈ ప్రాజెక్టుకు వర్షాధారంతోపాటు నాగార్జునసాగర్ నుంచి నీళ్లు వస్తాయి.

Written By: Bhaskar, Updated On : November 13, 2023 11:57 am
Follow us on

Paleru: ఖమ్మం జిల్లాలో అది ఒక సాధారణ నియోజకవర్గం. రాష్ట్రానికి ముగ్గురు మంత్రులను అందించిన ఘనత దాని సొంతం. ఈ నియోజకవర్గంలో గెలిచిన రాంరెడ్డి వెంకటరెడ్డి, సంబాని చంద్రశేఖర రావు, తుమ్మల నాగేశ్వరరావు క్యాబినెట్ మంత్రులుగా పని చేశారు. మొదటినుంచి కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉంది. 2018 నుంచి మాత్రం అనూహ్య ఫలితాలను ఇవ్వడం మొదలుపెట్టింది. ఎందుకంటే అప్పటి ఎన్నికల్లో కేబినెట్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఈ నియోజకవర్గ ప్రజలు తిరస్కరించారు. అప్పట్లో తుమ్మల మీద పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరారు.. ప్రస్తుతం ఆ పార్టీ తరఫున పాలేరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే..

పూర్తి గ్రామీణ నియోజకవర్గమైన పాలేరులో వ్యవసాయమే జీవనాధారం. వ్యవసాయానికి పాలేరు మధ్యతరహా ప్రాజెక్టు లోని నీళ్ళు అత్యంత అవసరం. ఈ ప్రాజెక్టుకు వర్షాధారంతోపాటు నాగార్జునసాగర్ నుంచి నీళ్లు వస్తాయి. ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు పాలేరు ప్రాజెక్టు నిండి అలుగు పోసింది. రైతులు కూడా ఉత్సాహంగా నాట్లు వేశారు. కృష్ణ పరివాహకంలో నీళ్లు లేకపోవడం, నాగార్జునసాగర్ నుంచి అంతంత మాత్రమే నీళ్లు వస్తుండడంతో రైతుల అవసరాల మేరకు ఆ నీళ్లు సరిపోలేదు. ఫలితంగా పాలేరు పరిధిలో పంట పొలాలకు నీళ్లు అందని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని బయ్యారం పెద్ద చెరువు నుంచి గోదావరి జలాలను బయ్యనగూడెం వాగుమీదుగా ఉర్లుగొండ వద్ద పాలేరు వాగులో కలిపారు. దీనికి ఈ ప్రాంత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి విపరీతమైన చొరవ తీసుకున్నారు. నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పాలేరు ప్రాజెక్టు నిండే విధంగా కృషి చేశారు. పూర్తి గ్రావిటీ ద్వారానే ఈ నీళ్లు వస్తుండడంతో పాలేరు వాగు ఇంతటి వర్షాభావ పరిస్థితుల్లోనూ నిండుకుండ లాగా కనిపిస్తోంది.. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం వల్ల పాలేరు పరిధిలో ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు. సహజంగానే ఈ చర్య వల్ల ఎమ్మెల్యే కు అక్కడి రైతుల నుంచి మద్దతు లభిస్తున్నది. మిగతా సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్ని వర్గాలకు అందడంతో.. ఈసారి కూడా నేనే గెలుస్తానని కందాల ఉపేందర్ రెడ్డి చెబుతున్నారు. ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. ప్రభుత్వ పథకాలే కాకుండా కందాల ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించానని, వారిలో చాలామందికి పోలీసు ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాలు కూడా వచ్చాయని ఉపేందర్ రెడ్డి అంటున్నారు.. ప్రభుత్వపరంగా నియోజకవర్గంలో 30 పల్లె దవఖానాలు ఏర్పాటు చేశానని, వంద మందికి దళిత బంధు యూనిట్లు ఇప్పించానని, 1850 మందికి ఫైలేరియా పింఛన్లు అందించానని ఆయన వివరించారు. కొత్తగా పాలేరు జేఎన్టీయూ, మత్స్య, నర్సింగ్ కళాశాలలను అందుబాటులోకి తీసుకొచ్చానని కందాల వివరిస్తున్నారు.

ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే..

ఈ నియోజకవర్గంలో మొదట తుమ్మల పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ప్రతికూల ఫలితాలు రావడంతో ఆయన ఖమ్మం వైపు వెళ్లిపోయారు. ఆ తర్వాత షర్మిల రంగంలోకి దిగుతానని ప్రకటించారు. ఏకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వైయస్ విజయమ్మ కూడా ఇక్కడ విస్తృతంగా పర్యటించారు. దీంతో షర్మిల ఇక్కడ పోటీ చేయడం అనివార్యమని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఏ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో_ చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు. ఆయన అంతంతమాత్రంగానే ప్రచారం చేస్తున్నారు. తన భార్య మాధురి, సోదరుడు ప్రసాద్ రెడ్డి, కుమారుడు హర్షారెడ్డి, అల్లుడు తుంబూరు దయాకర్ రెడ్డిని రంగంలోకి దింపారు.. వారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదిలా జరుగుతుండగానే పొంగులేటి కార్యాలయాలు, ఇంటిపై ఐటి దాడులు జరిగాయి. దీంతో ఒక్కసారిగా ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో అలజడి నెలకొంది.. ఐటీ అధికారులు పొంగులేటిని మినహాయించి కొంతమంది కుటుంబ సభ్యులను తమ వెంట తీసుకెళ్లారు. హైదరాబాదులో కొన్ని లాకర్లను వారితోపాటు తెరిపించాలని ప్రచారం జరుగుతోంది. ఆ లాకర్లలో ఏముందనేది వారు బయటకు చెప్పడం లేదు. ఐటి దాడులు పొంగులేటికి పెద్దగా మైలేజ్ ఇవ్వవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2019 లోనూ ఇదే స్థాయిలో పొంగులేటి కార్యాలయాలు, ఇంటి మీద ఐటి దాడులు జరిగాయని వారు ఉదహరిస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి కామెంట్లు చేయని పొంగులేటి.. ఇప్పుడు అధికార పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేయడం దేనికని వారు అంటున్నారు.

బలాలు ఏమిటంటే

పాలేరు నియోజకవర్గం లో 35 శాతం యువత ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రకటనలో చోటు చేసుకున్న జాప్యం వల్ల ఇక్కడ యువతలో సహజంగానే ఒకింత ప్రభుత్వం మీద ఆగ్రహం ఉంది. దీనిని అనుకూలంగా మలుచుకునేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు అందిస్తామని చెబుతున్నారు. ఇదే సమయంలో పాలేరు నియోజకవర్గాన్ని మోడల్ గా మారుస్తామని అంటున్నారు. ఆసుపత్రులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే పై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోవడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం మీదనే విమర్శలు చేస్తున్నారు. ఇక కందాల ఉపేందర్ రెడ్డి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూనే, తన ఫౌండేషన్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తున్నారు. తాను స్థానికుడినని, పారాచూట్ నాయకులతో పాలేరు నియోజకవర్గానికి పెద్దగా ఉపయోగం ఉండదని అంటున్నారు. తన నియోజకవర్గంలో మరణించిన ప్రతి కుటుంబానికి 10,000, గాయపడిన ప్రతి కుటుంబానికి 5000 ఇచ్చానని చెబుతున్నారు. ఇలా నియోజకవర్గంలో దాదాపు 12 కోట్ల దాకా సొంత నిధులు ఖర్చు చేశానని ప్రచారం చేస్తున్నారు. కోవిడ్ సమయంలో నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి నిత్యవసరాలు, మందులు పంపిణీ చేశానని ఆయన పేర్కొంటున్నారు.

ఎవరిది దీమా వారిదే

ప్రభుత్వ వ్యతిరేకత తనను గెలిపిస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెపుతుంటే, తన మంచితనం, అవినీతి రహిత పాలన రెండవసారి విజయం సాధించి పెడుతుందని కందాల ఉపేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.. పూర్తి గ్రామీణ నియోజకవర్గమైన పాలేరులో ప్రజలు ఎటువైపు మొగ్గుతారు? ఎవరికి ఓటు వేస్తారు? కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారా? లేక బీఆర్ఎస్ కు పట్టం కడతారా అనేది వేచి చూడాల్సి ఉంది.