అనుకున్నట్లే జరిగింది. ఈసారి ఆంధ్ర ఓటర్లు కీలకంగా మారతారని వేసిన అంచనా నిజమేమో ననిపిస్తుంది. కాకపోతే ఓటేసి కీలకంగా మారకుండా ఓటింగ్ కి దూరంగా వుండి కీలకంగా మారారు. మొన్న జరిగిన జిహెచ్ఎంసి ఓటింగ్ సరళిని పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎప్పుడూ బ్రిస్క్ పోలింగ్ జరిగే పాత బస్తీలో ఓటర్లు నిరాసక్తి ప్రదర్శించినట్లు తెలుస్తుంది. అలాగే సిటీలో గణనీయంగా వున్న ఆంధ్రా ఓటర్లు ఈసారి పెద్దగా ఆసక్తి చూపించకపోవటం గమనార్హం. అదేసమయంలో వెయ్యికి పైగా వున్న బస్తీల్లో ఎప్పటిలాగే అధిక శాతం ఓట్లు పోలయ్యాయి. శివారు ప్రాంతాల్లో అన్ని డివిజన్ల కన్నా ఎక్కువగా ప్రజలు ఓటు వేశారు. ఈ ఓటింగ్ సరళి దేనికి సంకేతం?
ఎవరి అంచనాలు వారివే
ఓటింగ్ శాతం తగ్గటంతో ప్రభుత్వ వ్యతిరేకత వీస్తుందనే ప్రచారంలో అర్ధంలేదని తెరాస చెబుతుంది. మేము తీసుకొచ్చిన సంక్షేమ పధకాలే మమ్మల్ని గెలిపిస్తాయని ఘంటా బజాయించి చెబుతున్నారు. మేము ఓ పద్దతి ప్రకారం ప్రచారం నిర్వహించామని, ప్రతి ప్రాంతానికి మంత్రులు, ఎంఎల్ ఎలు దగ్గరుండి పనిచేశారని ఈసారికూడా గెలుపు ఖాయమని చెబుతున్నారు. కెసిఆర్ కున్న ఇమేజీ మమ్మల్ని గెలుపిస్తుందని చెబుతున్నారు. దుబ్బాకలో గెలుపు ఒక మినహాయింపు అని ప్రతిచోట అదే రిపీట్ అవుతుందని బిజెపి పగటి కలలు కంటుందని చెబుతున్నారు. అదేసమయంలో విడిగా మాట్లాడేటప్పుడు పోయినసారి గాలి ఈసారి లేదని, పోయినసారి లాగా 99 గెలిచే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మేయర్ పీఠం మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోయినసారిలాగా 99 స్థానాలు రాకపోయినా ఎక్స్ ఆఫిసియో సభ్యులతో కలుపుకొని మాకు పూర్తి మెజారిటీ వస్తుందని చెబుతున్నారు. అదీ కానప్పుడు మజ్లీస్ మద్దత్తు మాకే వుంటుంది కాబట్టి మేయర్ పదవి తమకే దక్కుతుందని చెబుతున్నారు. ఒకవేళ మా ఒక్కరితో మెజారిటీ రాకపోయినా మజ్లీస్ మేయర్ పదవికి పట్టుబట్ట బోదని కూడా చెబుతున్నారు. ఒక్కరోజు ఆగితే మా అంచనాలు నిజమని తేలతాయని బలంగా వాదిస్తున్నారు.
బిజెపి కూడా అదే విధంగా ధీమా వ్యక్తం చేస్తుంది. ఈసారి నగర ఓటర్లలో తెరాస మీద వ్యతిరేకత తారా స్థాయికి చేరిందని, అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఓటు మాత్రం కమలం గుర్తుకే వేస్తారని ధీమాగా వున్నారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత క్యాడర్ లో జోష్ వచ్చిందని, బస్తీల్లో ప్రజలు బిజెపి వైపు స్పష్టంగా మొగ్గు చూపారని చెబుతున్నారు. ప్రచారంలో మేము తెరాసని ఆత్మ రక్షణలో పడేశామని కూడా చెబుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో అతి పెద్దపార్టీగా మేమే గెలుస్తామని కూడా చెబుతున్నారు. మేయర్ పదవిని చేజిక్కించుకుంటామని పైకి గంభీరంగా మాట్లాడుతున్నా అది కష్టమని గుసగుసలాడుకుంటున్నారు. మేయర్ పదవి రాకపోయినా అతి పెద్ద పార్టీగా అవతరిస్తే రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమార్పులు వస్తాయని కూడా చెబుతున్నారు. ఈ ఫలితంతో బిజెపి పురోగతి అప్రతిహతంగా ముందుకు సాగుతుందని కూడా చెబుతున్నారు. దీనితో కాంగ్రెస్ దుకాణం మూతబడుతుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
ఓటింగ్ సరళిపై అంచనాలు
కూకట్ పల్లి దాని చుట్టుపక్కల ప్రాంతాలు అతితక్కువ పోలింగ్ నమోదు కావటంతో ఆంధ్ర ఓటర్లు అనాసక్తిగా వున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. తెరాసకి ఎప్పుడూ అనుకూలంగా లేని ఈ వర్గం జాతీయ పార్టీల పైన కూడా గుర్రుగానే వున్నారు. తమకు అన్యాయం జరిగిందని వున్న మూడు ప్రధాన పార్టీల్లో ఎవరికీ ఓటేసినా ఒరిగేదేమీ లేదనికూడా అంటున్నారు. ఆంధ్ర పార్టీలైన తెలుగుదేశం, వైఎసార్ సిపి, జనసేన లు పోటీ చేయకపోవటంతో పెద్దగా ఆసక్తి చూపలేదని కూడా అనుకుంటున్నారు. అందుకే అపార్ట్మెంటుల నుంచి కాలు బయటకు పెట్టలేదని కూడా అనుకుంటున్నారు. ఇక ఇంకో గణనీయమైన వర్గం ముస్లింలు ఈసారి ఓటింగ్ లో అంత ఆసక్తి చూపలేదని కూడా ఓటింగ్ సరళి సూచిస్తుంది. అయినా పాత బస్తీలో ఎప్పటిలాగే వాళ్ళే గెలుస్తారని కూడా అంచనా వేస్తున్నారు.
మిగతా వంద సీట్లపైనే ఆసక్తికర చర్చ నడుస్తుంది. బస్తీ ప్రజలు, శివారు ప్రజలు ఎటు ఓటు వేస్తే ఫలితం అటే ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణా బస్తీల్లో గాలి ఎటు వీచిందనే దానిపైనే అందరి చర్చా మళ్ళింది. తెరాస నాయకులు బస్తీల్లో మాకు పటిష్టమైన యంత్రాంగం వుందని, బిజెపికి అంత క్యాడర్ లేదని కాబట్టి ఈ ఓటింగ్ సరళి మాకే అనుకూలమని వాదిస్తున్నారు. బిజెపి వారి అంచనాలు భిన్నంగా వున్నాయి. దుబ్బాక ఎన్నికల్లో తెలంగాణా సాధారణ ప్రజానీకం ఎటు వున్నారో తేలిపోయిందని, దాని వెంటనే వచ్చిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా బస్తీ వాళ్ళు మావైపే మొగ్గు చూపుతారని చెబుతున్నారు. చివరి రెండు రోజులు తెరాస నాయకులు డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసారని అయినా ప్రజలు ఓట్లు మాత్రం మాకే వేస్తారని చెబుతున్నారు. పధకం ప్రకారం కెసిఆర్ బయటి తెరాస నాయకుల్ని, క్యాడర్ ని రప్పించినా ఇవేమీ ప్రజల నిర్ణయం ముందు బలాదూర్ అనికూడా చెబుతున్నారు.
ఇంకొన్ని గంటల్లో ఫలితం వెలువడనున్నా ఈ ఎన్నికల ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది. ఆంధ్రులు ఓటింగ్ కి రాకుండా కీలకంగా మారితే బస్తీ ప్రజలు ఎటు వేసివుంటారనేదే గెలుపోటములను నిర్ణయించ బోతుంది. అంటే కాస్మో పాలిటన్ నగరమల్లా స్థానిక తెలంగాణా ప్రజల అభిప్రాయ తీర్పుగా మారిపోయింది. ఐటి రంగం వున్న మాదాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అసలు పోలింగ్ కేంద్రం ఎక్కడుందో కూడా చూడలేదు. హైదరాబాద్ నగర ఎన్నికలు ఫక్తు స్థానిక తెలంగాణా నాడిని ప్రతిబంబించ బోతున్నాయి. ఇది తర్వాత జరిగే పరిణామాల్ని సెట్ చేయబోతుంది. కెసిఆర్, తెలంగాణా యాసకి ఓటేస్తారా లేక బండి సంజయ్ బస్తీ గోసకి ఓటేస్తారా అనేది కొన్ని గంటల్లో తేలబోతుంది.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Which side hyderabad voters favored
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com