Visakhapatnam: ఈసారి విశాఖ సిటీ ఎటువైపు?

గత ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు, పశ్చిమ నుంచి గణబాబు, ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావు, దక్షిణ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ టిడిపి అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు.

Written By: Dharma, Updated On : March 19, 2024 1:39 pm

Which party will win in Visakhapatnam

Follow us on

Visakhapatnam: విశాఖ నగరంలో ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని వైసిపి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. ప్రచార కార్యక్రమాలను సైతం ప్రారంభించింది. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచినా.. విశాఖ నగరంలో మాత్రం వర్కౌట్ కాలేదు. నాలుగు నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈసారి కూడా ఇక్కడ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. దీంతో బలమైన అభ్యర్థులను బరిలో దించి మంచి ఫలితం సాధించాలని వైసీపీ చూస్తోంది.

గత ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు, పశ్చిమ నుంచి గణబాబు, ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావు, దక్షిణ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ టిడిపి అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఇందులో వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి ఫిరాయించారు. గంటా శ్రీనివాసరావు సైతం కొద్ది రోజులు సైలెంట్ అయ్యారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. భీమిలి అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. హై కమాండ్ మాత్రం చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని సూచిస్తోంది. దీంతో గంటా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇద్దరు సిట్టింగ్లను ఖరారు చేసింది. విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు, పశ్చిమ నుంచి గణబాబు పేర్లను ప్రకటించింది.

వైసిపి నగరంలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు గాజువాక అభ్యర్థిని సైతం ఖరారు చేసింది. విశాఖ తూర్పు లో వెలగపూడి రామకృష్ణ బాబును చెక్ పెట్టాలని అదే సామాజిక వర్గానికి చెందిన అంగ బలం ఉన్న ఎంవివి సత్యనారాయణ ను రంగంలోకి దించింది. దీంతో ఇక్కడ పోటాపోటీగా ఫైట్ నడిచే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పట్టున్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేనలో చేరారు. ఈ నియోజకవర్గంలో జనసేన అభిమానులు అధికం. దీంతో వెలగపూడి విజయం పై ధీమాతో ఉన్నారు. మరోవైపు ఎంవివి సత్యనారాయణ సైతం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ కేకే రాజు ను అభ్యర్థిగా ప్రకటించింది. టిడిపి పొత్తులో భాగంగా ఈ సీటును బిజెపికి కేటాయించే అవకాశం ఉంది. అదే జరిగితే మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేసే పరిస్థితి ఉంది. గత కొన్నాళ్లుగా కేకే రాజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మరోవైపు మూడు పార్టీల పొత్తు ఉండడంతో బిజెపి అభ్యర్థి విజయం ఖాయమన్న సంకేతాలు ఉన్నాయి. విశాఖ పశ్చిమ టిడిపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు ఖరారు అయ్యారు. ఇక్కడ వైసిపి అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ పోటీ చేస్తున్నారు. విశాఖ డైరీ చైర్మన్ అయిన ఆనంద్ కుమార్ బలమైన అభ్యర్థి. గత ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఎన్నికల అనంతరం వైసీపీలో చేరి పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులయ్యారు. ఇప్పుడు టిక్కెట్ దక్కించుకున్నారు.

దక్షిణ నియోజకవర్గం నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను వైసిపి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ స్థానం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ టిడిపి టికెట్ ఆశించిన గండి బాబ్జి పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు వైసీపీ టికెట్ ఆశించిన సీతంరాజు సుధాకర్ సైతం టిడిపిలో చేరారు. ఇక్కడ గత రెండు ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి మాత్రం గట్టి ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం ఈ నాలుగు స్థానాలను టిడిపి కైవసం చేసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈసారి కూడా గత ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.