
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఫ్యాక్షనిస్టు రాజకీయాలు ఏమైనా ప్రారంభమయ్యాయా..? రాజకీయాల్లోకి గుండాలు ప్రవేశించారా..? అందుకేనా వరుసగా ప్రతిపక్ష నేతల కార్లపై దాడులకు పాల్పడుతున్నది. ఏపీలోని ప్రతిపక్ష నాయకులు ఇదే ఆరోపిస్తున్నారు కూడా.
టీడీపీ నేతలపై అధికార వైసీపీ వరుస దాడులకు పాల్పడుతున్నదని, ప్రశ్నించిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టడంలేదని టీడీపీ అధికార ప్రతినిధి కొమర్రెడ్డి పట్టాభిరాం అలియాస్ పట్టాభి అంటున్నారు. విజయవాడలోని హైసెక్యూరిటీ జోన్ లో నివసిస్తున్న పట్టాభి కారు అద్దాలను ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. ఇది కచ్చితంగా అధికార వైసీపీ కిరాయి గుండాల పనే అని పట్టాభి ఆరోపించారు.
Also Read: కేంద్రంలోనూ జగన్ ఇక చక్రం తిప్పనున్నారా?
అదీగాక.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి బట్టు దేవానంద్ నివాసం పక్కనే తన ఇల్లు ఉందని.. హైకోర్టు జడ్జి ఇంటి ముందు 24 గంటలూ పోలీస్ పికెటింగ్ ఉంటుందని.. అలాంటి హైసెక్యూరిటీ జోన్ లో ఉన్న తన ఇంటిపైనే సీఎం జగన్, వైసీపీ నేతలు కిరాయి గుండాలతో దాడిచేయించారని పట్టాభి ఆరోపించారు. సాక్షాత్తు జడ్జిలు నివాసముందే ప్రాంతాల్లోనే బండరాళ్లతో దాడులు జరుగుతుంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతున్నదని, ఏపీలో సామాన్యులకు కూడా రక్షణ లేదన్న సంగతి తేటతెల్లం అయిందని ఆరోపిస్తున్నారు.
‘ఏపీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే ప్రజల పక్షాన గట్టిగా వాణిని వినిపిస్తున్నందుకే.. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాకు బహుమానం ఇచ్చారు. నిన్ననే విశాఖపట్నంలో సబ్బంహరికి కూడా ఒక బహుమానాన్ని సీఎం అందించారు. ఈరోజు కొత్తగా నా కారును ధ్వంసం చేయించడం ద్వారా ఈ బహుమానాన్ని అందించారు. సబ్బంహరికి, నాకు మాత్రమే కాదు.. ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరికీ ఇలాంటి బహుమానాలే అందుతాయి..’ అంటూ వ్యాఖ్యానించారు.
Also Read: చేతులు జోడించి వేడుకుంటున్న స్టార్ హీరో.. ఎవరికోసం?
అంతటితో ఆగకుండా.. టీడీపీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేకనే వైసీపీ దద్దమ్మలు బెదిరింపులకు దిగుతున్నారని పట్టాభి ఆరోపించారు. దమ్ముంటే సమాధానం చెప్పాలేకానీ, ఇలా ఇళ్లపై అర్ధరాత్రులు దాడులు చేయించి, బండరాళ్లతో కారును పగులగొట్టడం ద్వారా టీడీపీ నేతల నోరు మూయించాలనుకుంటే అది సాధ్యంకాదని సీఎం తెలుసుకోవాలన్నారు. ఈ దాడితో తనలో పట్టుదల పదింతలు పెరిగిందని, ప్రజల తరఫున ఇంకా గట్టిగా వైసీపీ సర్కారుపై పోరాడుతామని, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ ఇది చూడబోతున్నారని టీడీపీ నేత హెచ్చరించారు. అయితే.. ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతారా.. గతంలోనూ టీడీపీ చేసిన అక్రమాలపై వైసీపీ ఎంతగానో నిలదీసింది. మరి అప్పుడు ఏ దాడులూ జరగలేదే. వీటన్నింటిని చూస్తుంటే సామాన్య ప్రజల్లోనూ అనుమానాలు కలుగుతున్నాయి. అసలు వైసీపీ నేతలు చేయిస్తున్నారా.. ఇతర కారణాలేవైనా ఉన్నాయా అంటూ ప్రశ్నలు వేసుకుంటున్నారు.