Pawan Kalyan Yatra: ఏపీలో దసరా నుంచి పవన్ యాత్రకు సిద్ధమవుతున్నారా? యాత్రకు సంబంధించి వాహనం ముంబాయిలో తయారవుతోందా? టీ టైమ్ రూపకర్తకు ఆ బాధ్యతలు అప్పగించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జనసేన అధికారికంగా వెల్లడించకున్నా పొలిటికల్ సర్కిల్ లో మాత్రం యాత్ర హాట్ టాపిక్ గా మారుతోంది. దసరా నుంచి పవన్ సినిమాలకు విరామం ఇచ్చి.. రాజకీయాలపై పూర్తిస్థాయిలో కాన్సంట్రేషన్ చేయనున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. అదే సమయంలో పవన్ చేపట్టేది యాత్ర కాదని.. రెగ్యులర్ పొలిటికల్ ఫార్మెట్ లో ఇది సాగదని.. అటు సినిమాలు చేస్తూ మధ్యమధ్యలో మాత్రమే యాత్ర కొనసాగుతుందన్న ప్రచారం కూడా ఉంది. కానీ దీనిపై జనసేన వర్గాల నుంచి ఎటువంటి అప్ డేట్ రావడం లేదు. అసలు యాత్ర దసరా నుంచి ప్రారంభమవుతుందా? అసలు షెడ్యూలేమిటి? రూట్ మ్యాప్ ఏంటీ? అనే వివరాలు కూడా బయటకు రావడం లేదు. ఈ విషయంలో జనసేన వర్గాలు గోప్యంగా ఉంచుతున్నాయి. అటు యాత్ర సన్నాహాలైతే ఎప్పటి నుంచో ప్రారంభమయ్యాయి. దీనిపై బ్యాక్ గ్రౌండ్ లో జన సైనికులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కాన్వాయ్ సిద్ధం…
ఇప్పటికే పవన్ యాత్రకు సంబంధించి కాన్వాయ్ వాహనాలు సిద్ధమయ్యాయి. కొద్ది నెలల కిందటే నలుపు రంగు స్కార్పియోలను ఆ పార్టీ కొనుగోలు చేసింది. అటు ప్రైవేటు సైన్యం సైతం ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. వారికి శిక్షణ కూడా ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు పవన్ యాత్ర ప్రత్యేక వాహనం ముంబాయిలో ప్రత్యేకంగా డిజైన్ రూపంలో తయారుచేస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ చైతన్య రథం తరహాలో వాహనాన్ని ముస్తాబు చేస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి యాంటిక్ లుక్ తో, మిలటరీ వాహనాన్ని తలపించే రీతిలో అన్ని సొబగులు అద్దుతున్నట్టు సమాచారం. నిర్మాణ బాధ్యతలను టీటైమ్ డిజైన్ రూపకర్త విజయ్ కు అప్పగించారు. వాహనాన్ని చాలా ధృడంగా రూపొందిస్తున్నారు. ఓ వార్ వెహికల్ మాదిరిగా అన్ని జాగ్రత్తలు తీసుకొని రూపొందిస్తున్నారు. వాహనానికి రెండు వైపులా బార్లు, ప్లాట్ ఫారమ్ లు ఉండేలా చూస్తున్నారు. కనీసం అరడజను మంది బాడీగార్డులు నిలబడేలా వాటిని అమర్చుతున్నారు.

త్వరలో షెడ్యూల్ ఖరారు..
అయితే ఇప్పటికే అమరావతికి మద్దతుగా మహా పాదయాత్ర 2.0 ప్రారంభమైంది. ఉద్యమంలా సాగుతోంది. ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నాయి. దాదాపు 53 రోజుల పాటు సుదీర్ఘంగా పాదయాత్ర సాగుతుంది., శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ముగుస్తుంది. యాత్రను అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దసరా నుంచి ప్రారంభమయ్యే పవన్ యాత్ర రైతు మహా పాదయాత్రకు ఇబ్బంది లేకుండా రూట్ మ్యాప్ సిద్ధమవుతున్నట్టు సమాచారం ఇటీవల రాష్ట్రంలో పవన్ ఆదరణ పెరిగినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో యాత్రకు భారీగా జనాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అందుకు తగ్గట్టుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ జనసేన అధిష్టానం కొద్దిరోజుల్లో పవన్ యాత్రపై షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది.