టీడీపీ పార్టీ పత్రికగా ముద్రపడిన ఓ న్యూస్ పేపర్లో ప్రచురితమైన ఎడిట్ పేజీ ఆర్టికల్ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రతీ వారం వచ్చే వ్యాసంలో ఈ సారి ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులపై చర్చించారు. టీడీపీ నేతలందరినీ అరెస్టు చేసేదాక.. ఏపీ సీఎం జగన్ ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదని రాసుకొచ్చారు. అందుకే.. ఆయన హిట్ లిస్టులో ఉన్న టీడీపీ నేతలందరూ స్వచ్ఛందంగా వెళ్లి అరెస్టు అయిపోవాలని సలహా కూడా ఇచ్చారు.
అయితే.. టీడీపీ నేతలపై కొనసాగుతున్న ఏసీబీ, సీఐడీ దాడుల నేపథ్యంలో ఈ తరహా చర్చ సహజంగానే రాష్ట్రంలో జరుగుతోంది. అయితే.. తన హిట్ లిస్టులో ఉన్న వారినందరినీ అరెస్టు చేయించే వరకూ నిద్ర పోయేట్టు లేడనే వ్యాఖ్యలపై ఆసక్తికరమైన డిబేట్ తెరపైకి వస్తోంది.
జగన్ టార్గెట్ లిస్టులో ప్రధాన టీడీపీ నేతలు గనక ఉంటే.. ఆ జాబితాలో సదరు పత్రిక అధిపతి పేరు కూడా ఉంటుందనేది ఆ డిబేట్ సారాంశం. నిజంగా హిట్ లిస్టు ప్రిపేర్ చేయాల్సి వస్తే.. ఆయన పేరు కూడా ఉంటుందని.. మరి, ఈ లెక్కన ఆయన కూడా వెళ్లి స్వచ్ఛందంగా అరెస్టు అవుతారా? అనే సెటైర్లు పడుతున్నాయి.
వైఎస్ హయాం నుంచీ కంట్లో నలుసుగా తయారైన ఆ పత్రికాధిపతిపై ఎప్పటి నుంచో మంటగా ఉందనే చర్చ బహిరంగంగానే సాగుతున్న సంగతి తెలిసిందే. మరి, ఏ ఆధారమూ లేకుండా కేసులు పెట్టాల్సి వస్తే.. ఈయనపైన కూడా పెడతారు కదా? అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. మరి, ఆ లెక్కన ఆయన జైలుకు వెళ్లే సమయాన్ని జగన్ ఎప్పుడు ఫిక్స్ చేసి ఉంటారో.. ఆయనే ఊహించి చెబితే బాగుంటుందని కూడా సెటైర్లు వేస్తున్నారు.
టీడీపీ నేతలు అరెస్టు అవుతున్నప్పటికీ.. వాళ్లు ఏ తప్పు చేయకుండానే అరెస్టు చేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. వాళ్లపై వచ్చిన విమర్శలు, పెట్టిన కేసులకు సమాధానాలు చెప్పకుండా.. అరెస్టులు చేశారని మాత్రమే మొత్తుకుంటే ఎలా కుదురుతుందన్నది వైసీపీ నేతల వాదన. వాళ్ల మీద నమోదైన అభియోగాల గురించి మాట్లాడకుండా.. కేవలం కక్షసాధింపు అనడం ద్వారా.. సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.