CM KCR: కేసీఆర్ ఏం చేసినా రాజకీయమే ఉంటుంది. అది పంజాబ్ కావొచ్చు. ఝార్ఖండ్ కావచ్చు. ఎటు వెళ్ళినా ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎవరికీ దొరకకుండా కొద్దిరోజులు మౌనంగా ఉన్నారంటే దాని వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్టే లెక్క. హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్న వేళ.. ఎక్కడ తగ్గకుండా ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ పలికిన స్వాగతం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీస్తోంది.

ప్రతిపక్షాలు చేసినట్టే
ఇటీవల కాంగ్రెస్ రాహుల్ గాంధీని తీసుకొచ్చింది. వరంగల్ డిక్లరేషన్ను ప్రవేశపెట్టింది. బీజేపీ జేపీ నడ్డాని, అమిత్ షాని, నరేంద్ర మోడీని తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు ప్రతిపక్షాలు పోటాపోటీగా తమ సత్తాను చాటాయి. తెలివిగా ఒకరిని ఒకరు విమర్శించుకోకుండా అధికార టీఆర్ఎస్ పైనే ఆరోపణాస్త్రాలను సంధించాయి. ఈ సమావేశాల తర్వాత ఎంత లేదనుకున్నా రెండు పార్టీల మైలేజ్ తెలంగాణలో పెరిగింది. అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ, రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ తమ స్థాయిని మరింత పెంచుకున్నాయి. ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ నియమించుకున్న పీకే సర్వే టీం కూడా ఇదే చెప్పింది. అప్పటినుంచి నష్ట నివారణకు కేసీఆర్ చేస్తున్న పనులు అన్ని ఇన్ని కావు. ఢిల్లీ నుంచి పంజాబ్ దాకా వెళ్లొచ్చారు. కర్ణాటకలో పర్యటించారు.
Also Read: Venkaiah Naidu- Modi: వెంకయ్యకు షాకిస్తున్న మోడీ.. బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన?
అయినప్పటికీ అంత ఫాయిదా ఏమీ లభించలేదు. మధ్యలో జాతీయ రాజకీయాలకు వెళ్తానని లీకులు ఇచ్చినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అప్పటి నుంచి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న కేసీఆర్ విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాకను అనుకూలంగా మార్చుకున్నారు. మోడీ పర్యటనకు ముందే, రాష్ట్ర ప్రజల అటెన్షన్ ఆయన వైపు మరలక ముందే దృష్టి మొత్తం తన వైపు ఉండేలా చూసుకున్నారు. హైదరాబాద్కు వచ్చిన యశ్వంత్ సిన్హా కు రాష్ట్ర రాజధానిలో సుమారు పదివేల బైకులతో ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. గతంలో ఎప్పుడు కూడా ఒక రాష్ట్రపతి ఎన్నికకు ఇలా హంగు ఆర్భాటం చేసిన దాఖలాలు లేవు. గత రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ ను బీజేపీ ఎంపిక చేసినప్పుడు టీఆర్ఎస్ మద్దతు పలికింది. అప్పట్లో బీజేపీతో సఖ్యతగా ఉన్న టీఆర్ఎస్.. ఇప్పుడు దూరంగా ఉంటున్నది. తటస్థంగా ఉండి బిజెపికి మేలు చేయకుండా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు పలుకుతున్నది.
మొదట్లో కాదని.. ఇప్పుడు అవునని
రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగియడంతో రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ను బిజెపి ప్రకటించింది. ఆ తర్వాత విపక్ష పార్టీలు అనేక శష బిషల తర్వాత యశ్వంత్ సిన్హాను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. అయితే కాంగ్రెస్ ఉందన్న సాకు చూపి మొదట్లో విపక్ష పార్టీల మీటింగ్ కు దూరంగా ఉన్న టీఆర్ఎస్.. తర్వాత మనసు మార్చుకుంది. యశ్వంత్ సిన్హా కు మద్దతు ప్రకటించింది. ఈలోపు హైదరాబాద్ వేదికగా బిజెపి తన జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నామని ప్రకటించడంతో అకస్మాత్తుగా కేసీఆర్ మేల్కొన్నారు. వెంటనే హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో తమ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించేందుకు ఎల్ అండ్ టి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బిజెపికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందు జాగ్రత్త పడ్డారు.
ఒక దశలో యశ్వంత్ సిన్హా పరిచయ కార్యక్రమం కూడా నోవాటెల్ లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకుని జలవిహార్ ను వేదికగా చేసుకున్నారు. ప్రతి విషయంలోనూ పొలిటికల్ లెక్కలు చూసుకునే కేసీఆర్ యశ్వంత్ సిన్హా పరిచయ కార్యక్రమాన్ని కూడా పూర్తి రాజకీయ పార్టీ సమావేశంగా మార్చేశారు. కేవలం టిఆర్ఎస్, ఎంఐఎం నేతలు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొదటి నుండి చెప్పినట్టుగానే కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇక ఈ సమావేశంలో కేసీఆర్ నరేంద్ర మోడీని, బిజెపిని తిట్టడానికి మాత్రమే సమయం తీసుకున్నారు. వాస్తవానికి ఒక రాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమం చాలా హుందాగా ఉంటుంది. కానీ మోదిపై అక్కసు పెంచుకున్న కేసీఆర్.. పొలిటికల్ ఎజెండాతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

హైదరాబాదు నగరంలో అసలే ట్రాఫిక్ ఎక్కువ. మధ్యాహ్నం సమయంలో అయితే అసలు భరించలేం. అలాంటిది బేగంపేట విమానాశ్రయం నుంచి జల విహార్ దాకా సుమారు పదివేల బైకర్లతో ర్యాలీ నిర్వహించి హైదరాబాదు నగర వాసులకు చుక్కలు చూపించారు. అడుగడుగునా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో నగరవాసులు నరకం చూశారు. కాగా యశ్వంత్ సిన్హా కు మద్దతు కూడగట్టేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కెసిఆర్ కి ఫోన్ చేశారు. టిఆర్ఎస్ నాయకులు ఎలాగూ వస్తారని వారి పార్టీ పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. కాంగ్రెస్ బూచిని చూపి టిఆర్ఎస్ ఆ సమావేశానికి గైర్హాజరయింది. ఆ సమయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ టిఆర్ఎస్ ఫ్లెక్సీని తొలగించారు. సీన్ కట్ చేస్తే అదే యశ్వంత్ సిన్హా కు హైదరాబాదులో టిఆర్ఎస్ ఘన స్వాగతం పలికింది. అదే సమయంలో మమతా బెనర్జీ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే విషయంలో తమను కూడా సంప్రదిస్తే బాగుండని వ్యాఖ్యానించారు. ఎలాగూ ఓటమి తప్పదని తెలిసి నరేంద్ర మోడీకి పరోక్షంగా మద్దతు పలికారు. విషయాన్ని ముందే గ్రహించిన కేసీఆర్ కేంద్రంలో ఉన్న అధికార బిజెపిని ప్రశ్నించేది మేమేనని, అది ప్రజల్లోకి వెళ్లేలా ₹ కోట్లతో ప్రచారం చేసుకున్నారు. కాగా ఇన్నాళ్లు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ఊరిస్తున్న కేసీఆర్ త్వరలో బీఆర్ఎస్ పార్టీ పెట్టబోతున్నారని, అందుకే ఈ స్థాయిలో యశ్వంత్ సిన్హా కు స్వాగతం పలికారని వినికిడి.
Also Read:Telangana BJP: తెలంగాణలో గెలుపు బీజేపీకి సాధ్యమవుతుందా?