
YCP: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఒక ఏడాది వ్యవధి మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. అటు విపక్షాలు సైతం ఐక్యతారాగం పఠిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్నాటకతో సహా మరో తొమ్మిది రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు రానున్నాయి. ఇప్పటికే మేఘాలయ, నాగాలండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. 16న త్రిపుర, 27న మేఘాలయలో పోలింగ్ జరగనుంది. మార్చి 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెబుతున్నారు. తాజా గా లోక్ పాల్ సంస్థ ఇటువంటి సర్వేనే వెల్లడించింది.
Also Read: Actor Hema: ఆ వ్యాపారంతో డబ్బులు సుఖం, అందుకే సినిమాలు చేయడంలా… హేమ షాకింగ్ కామెంట్స్!
ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు వేర్వేరుగా.. రెండు విడతల్లో ఫలితాలను వెల్లడించింది ఈ సంస్థ.ఉత్తరాది రాష్ట్రాల్లో 225, దక్షిణాది రాష్ట్రాల్లో 132 నియోజకవర్గాల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో సర్వే చేపట్టింది. ఎవరిది అధికారం. ఎవరు విపక్షంలో ఉండబోతున్నారు. ప్రజాబలం ఎవరికి ఉంది? అన్నదానిపై కుండబద్దలు కొడుతూ చెప్పింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో మెజార్టీ లోక్ సభ స్థానాలు ఎవరికి దక్కుతాయి. రాష్ట్రాలు, నియోజకవర్గాల వారీగా ఫలితాలను వెల్లడించింది. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని తేల్చేసింది. కానీ గతంకంటే ఎంపీ స్థానాలు తక్కువ వస్తాయని తేల్చిచెప్పింది.
దేశ వ్యాప్తంగా 357 లోక్ సభ స్థానాల్లో సాగిన ఈ సర్వే ఫలితాలను ఆ సంస్థ వెల్లడించింది. ఉత్తరాదిన 225 స్థానాల్లో బీజేపీ-142 చోట్ల విజయం సాధిస్తుందని లోక్ పోల్ తెలిపింది. కాంగ్రెస్- 30 స్థానాలకే పరిమితమౌతుందని అంచనా వేసింది. ఇతరులు 53 లోక్ సభ నియోజకవర్గాల్లో పాగా వేస్తారని స్పష్టం చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో 132 లోక్ సభ స్థానాల్లో లోక్ పోల్ సర్వే చేపట్టింది. ఇందులో బీజేపీ-21, కాంగ్రెస్-39, ఇతరులు 72 స్థానాలను గెలుచుకుంటారని తెలిపింది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని లోక్ పోల్ తేల్చింది. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అందులో 17 చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధిస్తారని పేర్కొంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏడు లోక్‌సభ స్థానాలకు మాత్రమే పరిమితమౌతారని అంచనా వేసింది. అయితే ఈ సర్వేపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పటికే జగన్ చేపట్టిన సర్వే నివేదికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అటు ఐ ప్యాక్ చేపట్టిన సర్వేలో కూడా సగం స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఎదురీదక తప్పదని తేలినట్టు వార్తలు వచ్చాయి. ప్రభుత్వ నిఘా సంస్థలు కూడా అవే హెచ్చరికలు పంపినట్టు తెలుస్తోంది. పార్టీలో క్రమశిక్షణ కట్టుదాటడం, అటు ఎమ్మెల్యేలు ధిక్కార స్వరాలు వినిపిస్తుండడం, జనసేన, టీడీపీ పొత్తు వంటి అంశాలు వైసీపీ గెలుపుపై ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో లోక్ పాల్ సంస్థ వైసీపీకి మెజార్టీ ఎంపీ స్థానాలు కట్టబెట్టడం జగన్ కాస్తా ఉపశమనం కలిగించింది.
Also Read:Drug Cases In Kerala: స్కూల్ డెస్క్ లు, బ్యాగ్ లలో డ్రగ్స్.. ప్రగతి శీల రాష్ట్రంలో ఉడ్తా పంజాబ్