Police Command Control Centre: మీరు హాలీవుడ్ సినిమాలు చూస్తారా? ఏదైనా నేరం జరిగితే పోలీసులు క్షణంలో స్పందించే తీరు భలే అనిపిస్తుంది కదూ! అదంటే సినిమా కాబట్టి ఊహాతీతంగా ఉంటుంది. అలాంటిదే నిజ జీవితంలో జరిగితే.. వాషింగ్టన్ డిసి లో ఉన్న సిఐఏ కమాండ్ సెంటర్ మాదిరి.. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం నిఘానేత్రం పరిశీలిస్తూ ఉంటే.. ఎలా ఉంటుంది? ఎలా ఉండటం ఏంటి ఇప్పుడు అదే హైదరాబాదులో నిర్మితమైంది. అది కూడా అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో.. నానాటికి విస్తరిస్తున్న హైదరాబాద్, తెలంగాణలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన నిఘా నేత్రమే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
ఎక్కడ ఏం జరిగినా
ఏ సమయంలో అయినా, ఎక్కడైనా ఏం జరిగినా క్షణాల్లో పసిగట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన హైదరాబాద్ బంజారాహిల్స్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆగస్టు 4న ప్రారంభానికి సిద్ధమైంది. ఫిబ్రవరి మొదటి లోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా మెయిన్ కమాండ్ కంట్రోల్ ను ప్రారంభిస్తారని వార్తలు వచ్చినా.. కొన్ని పనులు మిగిలిపోవడంతో అధికారులు వాయిదా వేశారు. వివిధ దేశాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు పని చేస్తున్న తీరును పరిశీలించి.. మరిన్ని డిజిటల్ కెమెరాలు అవసరం ఉండటంతో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో మూలన ఏం జరిగినా చిటికెలో తెలుసుకునే లాగా అన్ని వ్యవస్థలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించారు.
ప్రత్యేకతలు ఇవే
కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనం 1,12,77 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. అసలు ప్రతి అంగుళం 360 డిగ్రీల కోణంలో పోలీస్ రాడార్ పరిధిలోకి వస్తుంది. భవనాన్ని 350 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టిన తర్వాత మరో 200 కోట్లు కేటాయించారు. మొత్తానికి బడ్జెట్ 550 కోట్లు అయింది. ఏడు ఎకరాల్లో ఏడు లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో నాలుగు బ్లాకుల్లో ఏ , బి , సి , డి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ టవర్లు ఉంటాయి. ఇక టవర్ -ఏ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 84 పాయింట్ రెండు మీటర్ల ఎత్తులో ఉంటుంది. బీ, సీ, డీ బ్లాక్ లు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65.2 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇందులో టవర్ ఏ అతి ముఖ్యమైనది. ఇందులో నుంచే హైదరాబాద్ నగర కమిషనర్ కార్యాలయం నడుస్తుంది. హెలిప్యాడ్ తో కలిపి జి ప్లస్ 20 అంతస్తులు కలుపుకొని టవర్ _ఏ ను నిర్మించారు. దీనికి తోడు ఓపెన్ ఆఫీస్ మీటింగ్ రూమ్స్, కాన్ఫరెన్స్ రూమ్, క్యాబిన్లు వేరువేరుగా ఉంటాయి.
పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోంది. నేరాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ఈ మధ్య వైట్ కాలర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. దీంతో పోలీసులకు విధి నిర్వహణ తలకు మించిన భారం అవుతోంది. ఈ క్రమంలోనే పలు నేరాల్లో సీసీ కెమెరాల ఫుటేజీ సహాయంతో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అందువల్లే సీసీ కెమెరాల ఏర్పాటు పోలీస్ శాఖకు అత్యంత అవసరం అయింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని మండలాలలో దాతల సహాయంతో పోలీసు శాఖ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. వీటి అన్నింటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించారు. దీని వల్ల రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే వీలు వెంటనే కలుగుతుంది. నేరాల దర్యాప్తు సులభతరం అవుతుంది. నిందితులను వెంటనే అదుపులో తీసుకునే అవకాశం కలుగుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీసీ కెమేరాల పర్యవేక్షణే కాకుండా అత్యాధునిక సైబర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. దీనివల్ల వైట్ కలర్ నేరాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నియామక ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు అన్నింటిని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ కు మరో కలికితురాయి అవుతుందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
Also Read:Droupadi Murmu: కొత్త రాష్ట్రపతికి పుట్టింటి కానుకగా ఏమి ఇచ్చారంటే