MLC Kavitha Meet CM KCR: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించిన ఈడీ, ఐదుగురిని అరెస్టు కూడా చేసింది. ఇందులో ముగ్గురు తెలుగువారే కావడం గమనార్హం. ఇటీవల కోర్టుకు సమర్పించిన రిమాండ్ షీట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించారు. ఏడాది కాలంలో ఈ కేసుకు సంబంధించిన పది సెల్‌ఫోన్లు, రెండు సిమ్ కార్డులు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. సౌత్ గ్రూప్ మొత్తాని కవితనే లీడ్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో రహస్య భేటీ..
సీబీఐ నోటీసులు అందుకున్న కవిత డిసెంబర్ 6న హైదరాబాద్‌లోని తన ఇంట్లో విచారణకు హాజరవుతానని సమాచారం ఇచ్చారు. దీనిపై సీబీఐ నిర్ణనయం తీసుకోవాల్సి ఉంది. కాగా, నోటీసులు అందిన 12 గంటల వ్యవధిలోనే తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ప్రగతిభవన్‌లో రహస్యంగా కలిశారు. సీబీఐ నోటీసులపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు..
ఢిల్లీ మద్యం స్కాం కేసులో ఢిల్లీలో కేసు నమోదు చేసిన సీబీఐ ఆర్‌సీ 53(ఎ)/2022 కేసులో దర్యాప్తు కోసం సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఢిల్లీకి చెందిన సీబీఐ అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ అలోక్ కుమార్ షాహి శుక్రవారం ఈ నోటీసులు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోకానీ, ఢిల్లీలో కానీ కవితను విచారించాలని అనుకుంటున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత ప్రగతి భవన్‌కు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
న్యాయ నిపుణులతో చర్చ..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనకు నోటీసులు రావొచ్చని ముందే ఊహించిన కవిత ఇటీవలే ఢిల్లీ వెళ్లి.. న్యాయ నిపుణులతో రహస్యంగా చర్చించారు. ఈ క్రమంలో ఆమే ఊహించినట్లుగానే రిమాండ్ షీట్‌లో పేరు రావడం, ఆ మరుసటి రోజే సీబీఐ నోటీసులు ఇవ్వడంతో న్యాయపరంగా, రాజకీయంగా ఏం చేయాలి.. ఎలా ముందుకు వెళ్లాలనే విసయమై సీఎం కేసీఆర్‌తో కవిత చిర్చంచినట్లు తెలిసింది.

రాజకీయ దుమారం..
కాగా, కవితకు సీబీఐ నోటీసుల వ్యవహారం రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెనే టార్గెట్‌గా చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనివెనుక భారతీయ జనత పార్టీ కుట్ర ఉందనే ఆరోపణలు ఊపందుకుంటోన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారుల నోటీసులకు తాము ఏ మాత్రం భయపడబోమంటూ కవిత ఘాటుగా వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలో ఆమెకు సీబీఐ నోటీసులు అందడం గమనార్హం.
భయపడను అంటూనే తండ్రి సాయం కోసం..
నోటీసులకు తాను భయపడబోనని, ఎలాంటి విచారణకైనా సహకరిస్తానని కవిత చెప్పారు. వివరణ కోసం తనకు అందిన నోటీసులను బీజేపీ నాయకులు భూతద్దంలో చూపే ప్రయత్నం చేస్తోన్నారని మండిపడ్డారు. వాట్సాప్ యూనివర్సిటీ అసత్యాలను ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. వివరణ కోసమే సీబీఐ అధికారులు తనకు నోటీసులను ఇచ్చారనే విషయం బీజేపీకి తెలుసని, ప్రజలను తప్పుదారి పట్టించడానికే విచారణ అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అయితే భయపడను అంటూనే తండ్రి శరణు కోరడం చర్చనీయాంశమైంది.