TRS Bhavan in Delhi: ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ ప్రత్యేకతేంటి?

TRS Bhavan in Delhi:  అందరూ నడిచే దారిలో నడిస్తే కిక్ ఏముంటుంది.. అందుకే నా రూట్ సపరేట్ అంటున్నారు గులాబీ దళపతి కేసీఆర్(KCR).. దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో అసలు సొంత భవనాలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రసమితి అధినేత, సీఎం కేసీఆర్ కు ఢిల్లీ నడిబొడ్డున కేంద్రం స్థలం కేటాయించింది. అక్కడ సకల హంగులతో కేసీఆర్ సర్వాంగ సుందరంగా భవనం నిర్మిస్తున్నారు. దీనికోసం టీఆర్ఎస్ మంత్రులు, నేతలు అంతా ఢిల్లీ బయలు దేరి […]

Written By: NARESH, Updated On : September 2, 2021 6:44 pm
Follow us on

TRS Bhavan in Delhi:  అందరూ నడిచే దారిలో నడిస్తే కిక్ ఏముంటుంది.. అందుకే నా రూట్ సపరేట్ అంటున్నారు గులాబీ దళపతి కేసీఆర్(KCR).. దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో అసలు సొంత భవనాలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రసమితి అధినేత, సీఎం కేసీఆర్ కు ఢిల్లీ నడిబొడ్డున కేంద్రం స్థలం కేటాయించింది. అక్కడ సకల హంగులతో కేసీఆర్ సర్వాంగ సుందరంగా భవనం నిర్మిస్తున్నారు. దీనికోసం టీఆర్ఎస్ మంత్రులు, నేతలు అంతా ఢిల్లీ బయలు దేరి వెళ్లారు.

దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్(TRS) భవన్ నిర్మాణానికి భూమి పూజ వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చి మరీ ఈ వేడుకలో పాల్గొన్నారు. పూజలు, పునస్కారాలు చేసి పూర్తి చేశారు. ఢిల్లీలోని వసంత్ విహార్ లో జరిగిన తెలంగాణ భవన్ కోసం కేటాయించిన స్థలంలో భూదేవతకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూజలు చేశారు. నిర్మాణ స్థలంలో వేద పండితులు శాస్త్రోకంగా పూజలు జరిపారు.

కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏ ప్రాంతీయ పార్టీకి ఇవ్వని గౌరవాన్ని టీఆర్ఎస్ కు ఇవ్వడం విశేషం. ఏకంగా ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ కోసం 1300 గజాల స్థలాన్ని కేటాయించింది. ఇప్పటివరకు ఏ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏ ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో ఆఫీసు లేదు. సంకీర్ణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన టీడీపీ, జనతాదళ్ ఎస్, డీఎంకే, అన్నాడీఎంకేలకు ఢిల్లీలో సొంత భవనం లేదు. ఒక్క యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీకి తప్ప ఏ ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో సొంత భవనం లేకపోవడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, వైసీపీ వంటి రెండు ప్రాంతీయ పార్టీలున్నా కూడా వాటికి ఢిల్లీలో భవనం కేటాయించలేదు. టీఆర్ఎస్ మాత్రం స్థలం సాధించి ఢిల్లీలో భవనం కడుతూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. దాదాపు 40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జీ ప్లస్ 3 భవన సముదాయంతో టీఆర్ఎస్ భవన్ ను నిర్మించనున్నారు. మీటింగ్ హాల్ తో పాటు రాష్ట్రం నుంచి వివిధ పనుల కోసం ఢిల్లీకి వచ్చే వారు స్టే చేసేందుకు అన్ని వసతులతో ఈ భవన నిర్మాణాన్ని డిజైన్ చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ ను పోలి ఉండేలా దీన్ని రూపొందించినట్టు టాక్.

ఏడాదిలోపే నిర్మాణాన్ని పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఢిల్లీలో గులాబీ దండు గ్రాండ్ గా నిర్వహించింది. మొత్తం ఢిల్లీ వీధులన్నింటిని గులాబీ జెండాలతో నింపేయడం విశేషం. భారీగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , నాయకులు ఢిల్లీకి చేరుకోవడంతో తెలంగాణ భవన నిర్మాణ ప్రాంతం కళకళ లాడుతోంది.

మొత్తంగా ఏ ప్రాంతీయ పార్టీ సాధించని ఘనతను కేసీఆర్ సాధించేశాడు. తెలంగాణ ప్రజలకు ఇక ఢిల్లీ వెళ్లినా స్టే చేసేలా అత్యాధునిక వసతులతో అంగరంగ వైభవంగా టీఆర్ఎస్ భవన్ నిర్మాణం అవుతోంది. ప్రాంతీయ పార్టీలన్నింటిలోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది.