Amaravathi: ఏపీ రాజధాని అమరావతి భూములను ప్రభుత్వం తాకట్టుపెట్టిందని ఇటీవల కథనాలు కలకలం రేపుతున్నాయి.. ‘ది హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో)కు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారని అంటున్నారు. అయితే రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) అధికారులు ఓ మండల కేంద్రంలో ఈ ప్రక్రియను పూర్తిచేశారని తెలుస్తోంది. అయితే దీనిపై అమరావతి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికి ప్రతిపక్షాలు మద్దతు పలుకుతున్నాయి. రాజధాని ప్రాంత అభివృద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆందోళన చేశారు. అయితే ఇలా సీఆర్డీఏ భూములను హడ్కోకు తనఖా పెట్టడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. పేదల భూములతో పాటు మధ్యతరగతి వారికి కూడా ఇక్కడ టౌన్ షిప్ నిర్మించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొంటున్నారు. మరి ఈ అమరావతి భూతుల కథ ఏంటి? ఎందుకు తనఖా పెట్టాల్సి వచ్చిందనే దానిపై స్పెషల్ స్టోరీ..
ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయిన తరువాత ఏపీ రాజధాని అమరావతిగా ప్రకటించారు. అమరావతిని అభివృద్ధి చేసేందుకు టీడీపీ హయాంలో 2015లో ల్యాండ్ పూలింగ్ ద్వారా 50 వేల ఎకరాలు సేకరించి నగర నిర్మాణాన్ని చేపట్టాలనుకున్నారు. తాత్కాలిక అవసరాలకోసం 2017లో సెక్రటేరియేట్, అసెంబ్లీ భవనాలు, హైకోర్టును నిర్మించారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ కార్యాలయాల్లోలోనే విధులు నిర్వహిస్తున్నారు.
2020 జనవరిలో ప్రభుత్వం రాజధానిగా కేవలం అమరావతినే కాకుండా మరో రెండు ప్రాంతాలను ఎంపిక చేసింది. అయితే అమరావతి రాజధానిని తరలించడంపై ఇక్కడి ప్రాంత రైతులు ఆందోళనలు నిర్వహించారు. దీంతో కొన్ని భవనాల నిర్మాణాలు కూడా అర్థంతరంగా నిలిచిపోయాయి. దీంతో గత డిసెంబర్లో ప్రభుత్వం మూడు రాజధానుల ప్రక్రియను తాత్కాలికంగా రద్దు చేసింది. దీంతో అమరావతిలో మళ్లీ భవనాల నిర్మాణాలు జోరందుకున్నాయి.
ఇందులో భాగంగా అమరావతిలో జగనన్న టౌన్ షిప్ నిర్మించాలని నిర్ణయించారు. దీనిని అమరావతి పరిధిలో ఉన్న సీఆర్డీఏ భూములను ఎంచుకున్నారు. ఇందుకోసం మంగళగిరి నవులూరు వద్ద 145 ఎకరాల్లో వెంచర్ కూడా వేశారు. లే అవుట్లు సిద్ధం చేసి భూమి రిజిస్ట్రేషన్ కు రెడీ చేశారు. అయితే గతంలో చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఈ భూములను హడ్కోకి తనఖా పెట్టడంతో వ్యవహారం మలుపు తిరిగింది. 2016లో టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం హడ్కో నుంచి రూ.1275 కోట్ల రుణం తీసుకుంది. వీటి ద్వారా రాజధానిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇలా తనఖా పెట్టిన భూముల్లో సుమారు 2 లక్షల చదరపు గజాల భూమి ఉంది. మిగతా 102.09 ఎకరాలు ఖాళీగా ఉంది. అయితే ఆ మిగిలిన భూమిని లేఅవుట్లు చేసి ఎంఐజీ వారికి అమ్మేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఇక హడ్కోకు తనఖా పెట్టిన భూములు విడిపించి వారికి మరోచోట భూమిని ఇవ్వాలని నిర్ణయించారు.
హడ్కో నుంచి సీఆర్డీఏ రూ.1151 కోట్ల రుణం తీసుకుంది. ఆ మొత్తం చెల్లించకుండా భూములు తీసుకోవడం సాధ్యం కాదు. ఇందు కోసం ప్రభుత్వం నవులూరు భూములకు బదులు గతంలో స్టార్టప్ ఏరియాగా ప్రకటించిన భూములను హడ్కోకు తనఖా పెట్టేందుకు రెడీ అయింది. ఈ స్టార్టప్ ఏరియాలో 1700 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కన్సార్షియానికి అప్పగించారు. దీంతో మొత్తం 407 ఎకరాలను తనఖా పెట్టడం ద్వారా గతంలో మంజూరైన రూ.1275 కోట్ల వరకు రుణం పూర్తిగా తీసుకోవడానికి రెడీ అయింది. ఈ భూములు అనంతగిరి, ఉద్దండ రాయునిపాలెం, మందడం గ్రామాల పరిధిలో ఉన్నాయి.
‘అయితే పేదలకు స్థలాలు ఇచ్చిన అమరావతి ప్రాంతంలో జగనన్న కాలనీలు వచ్చేవి. కానీ ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు టౌన్ షిప్ కూడా వస్తోంది. ఈ టౌన్ షిప్ నిబంధనల ప్రకారమే ఉంటుంది’ అని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ పేర్కొన్నారు. అయితే రాజధానిగా అమరావతి పనికిరాదన్నారని, కానీ ఇక్కడి భూములను తనఖా పెట్టి అప్పులు తీసుకుంటున్నారని రాజధాని కోసం పోరాటం చేసిన రైతులు వాపోతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.