KCR Politics: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. అధికార పార్టీని టార్గెట్ చేసుకొని ప్రతిపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇందుకోసం ఆయా పార్టీల అగ్రనాయకులు సైతం రంగంలోకి దిగి సభల్లో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర వ్యాఖ్యలతో దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇంత అలజడి సృష్టిస్తున్నా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం స్పందించడం లేదు. అడపాదడపా కేటీఆర్, ఇతర మంత్రులు మినహా ప్రతిపక్షాలపై కేసీఆర్ ఎలాంటి కామెంట్ చేయడం లేదు. దీంతో కేసీఆర్ ఇంతలా మౌనంగా ఉండడానికి కారణమేంటి..? అన్న ప్రశ్న మొదలైంది. అంతేకాకుండా కేసీఆర్ ఇలా మౌనంగా ఉన్నాడంటే పెద్ద ప్లానే వేస్తున్నారని పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది.
తుఫాను వచ్చే ముందు వాతావరణం సైలెన్స్ గా ఉంటుందన్నట్లు.. కేసీఆర్ రాబోయే రోజుల్లో ప్రతిపక్షాల దాడిని ఎదుర్కొనేందుకు పెద్ద స్కెచ్చే వేస్తున్నారని పార్టీలో చర్చించుకుంటున్నారు. గతంలోనూ ప్రతిపక్షాలు వరుసగా దాడి చేసిన సమయంలో కేసీఆర్ ఇలా కొన్ని రోజుల పాటు మౌనం పాటించారు. ఆ తరువాత బీజేపీని టార్గెట్ చేసుకొని వరుస ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం అలాంటిదేదో చేస్తున్నారని కేడర్ అభిప్రాయపడుతోంది. ప్రతిపక్షాల నుంచి ఇలాంటి విమర్శలు రావడం కొత్త కాదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రణాళిక రచించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అగ్రనాయకులు సభల్లో పాల్గొని చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలని కొందరు కోరుకుంటున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి లాంటి మంత్రులు స్పందించినా ఎవరూ పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ ద్వితీయశ్రేణి నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సక్సెస్ చేయడంతో పాటు బీజేపీ డబుల్ ఇంజన్లో ఒకరైన అమిత్ షా సంగ్రామయాత్ర ముగింపు సభకు హాజరు కావడం ఆ పార్టీ నాయకుల్లో జోష్ నింపుతోంది. మరోవైపు అమిత్ షా ప్రసంగిస్తూ ‘ఎన్నికలకు ఎప్పడైనా సిద్ధం’ అన్న వ్యాఖ్యలు చేయడంతో తమ పార్టీ బలపడిందనే ఆనందంలో ఉన్నారు. దీంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు తమదే అన్న దీమాతో బీజేపీ శ్రేణులు ఉన్నారు.
అటు కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ సైతం తెలంగాణలో పర్యటించి హస్తం శ్రేణుల్లో జోష్ నింపారు. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని చెబుతూనే తమ పార్టీ చేయబోయే కార్యక్రమాలను వివరించారు.. ముఖ్యంగా ‘రైతు డిక్లరేషన్’ సభ పెట్టి కర్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ పెట్టిన పథకాలకు మించి ఆఫర్లు ఇవ్వడంతో రైతులు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. దీంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తమదేనన్న ధీమాతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
కానీ తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నా కాంగ్రెస్, బీజేపీలకు మాత్రం కేసీఆర్ ఎలాంటి కౌంటర్ ఇవ్వడం లేదు. మొన్నటి వరకు బీజేపీపై ఫైర్ అయిన కేసీఆర్ కొద్దిరోజులుగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పడు ఎవరూ విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అయితే సమయం చూసి దెబ్బకొట్టడం కేసీఆర్ స్టైల్. తనకున్న తెలివితో రెండు పార్టీలను ఒకేసారి రివర్స్ పంచ్ వేసేందుకు కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారని కొందరు అనుకుంటున్నారు.