
రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు మిత్రులవుతారో.. ఎవరు శత్రువులు అవుతారే ఎవరం ఊహించలేం. అలాగే.. ఈ పార్టీలో ఉన్న లీడర్ రేపు ఏ పార్టీలో చేరుతాడో కూడా ఎవరికీ తెలియదు. అందుకే వాటిని రాజకీయాలు అంటుంటారు. సొంత కుటుంబ సభ్యులే వేరే వేరు పార్టీల్లో ఉండడాన్ని చూస్తుంటాం. అన్నదమ్ములే వేర్వేరు పార్టీల నుంచి బరిలోకి దిగుతుంటారు. సొంత కుటుంబ సభ్యులే అయినా రాజకీయాల్లో మాత్రం ఆ వైరం తప్పదు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అదే కనిపిస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా ఎదిగింది తెలుగుదేశం పార్టీ నుంచే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా కూడా చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీని ప్రకటించి ఉద్యమించి, తెలంగాణను సాధించారు. తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. అయితే.. ఓ విషయంలో మాత్రం మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫార్ములాను కేసీఆర్ పూర్తి చేశారు. వైఎస్ బతికి ఉండగా మొదలు పెట్టిన పనిని కేసీఆర్ దిగ్విజయంగా పూర్తి చేశారు.
Also Read: నెమ్మదించిన కేసీఆర్.. నేడు పుట్టినరోజు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ అంటూ స్పెషల్ రాజకీయం ప్రారంభించారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన ముఖ్య నేతలను కాంగ్రెస్‌లోకి పిలిచారు. ప్రతిపక్ష పార్టీలను బలహీనపర్చడమే ఆయన టార్గెట్. అయితే.. ఆ ఆపరేషన్ ఆకర్ష్‌ను స్టార్ట్ చేసిన కొన్నాళ్లకే విమాన ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఆ తర్వాత అనూహ్యంగా ఉద్యమాన్ని కేసీఆర్ ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ లో ఉద్యమకారుడు కాస్త పక్కా రాజకీయ నేతగా రూపాంతరం చెందారనేది బహిరంగ ఆరోపణ.
Also Read: కేసీఆర్ పుట్టినరోజుకు చిరంజీవి స్పెషల్ గిఫ్ట్
ఓ వైపు పరిపాలన బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు రాజకీయంగా వ్యూహాత్మక పావులు కదిపారు. వైఎస్ బతికి ఉండగా స్టార్ట్ చేసి మధ్యలోనే ఆగిపోయిన ఆపరేషన్ ఆకర్ష్‌ను కేసీఆర్ చేబట్టారు. తెలంగాణలో ఉన్న పార్టీల్లో టీడీపీ ఉంటే తనకు ఎప్పటికైనా ప్రమాదమని భావించారు. అందుకే మొదటగా ‘ఆపరేషన్ టీడీపీ’ని మొదలు పెట్టారు. తెలంగాణలోని ప్రముఖ టీడీపీ నేతలను అందరినీ పార్టీలోకి రప్పించారు. బంగారు తెలంగాణ సాకారం కోసం టీఆర్ఎస్ పార్టీని బలపర్చాల్సిన అవసరం ఉందంటూ అందిరనీ ఒప్పించారు. టీడీపీలోని అన్ని నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలను పార్టీలోకి రప్పించారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
మొత్తానికి ఆ ఆపరేషన్ ఆకర్ష్‌ను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నామమాత్రపు పార్టీగా చేశారు. అదే రీతిలో కాంగ్రెస్ పార్టీని కూడా కోలుకోకుండా చేశారు. అయితే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను కేసీఆర్ బలహీనం చేయడం ఆయనకే నష్టం చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీల్లోని రాజకీయ శూన్యతను దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ హైజాక్ చేసిందని చెబుతున్నారు. కాంగ్రెస్ బలహీనతను బీజేపీ అందిపుచ్చుకుందని, తద్వారా దూకుడు పెంచి కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం తామేనని ప్రజలకు చాటి చెప్పగలిగారన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌గా రాజకీయం ఉండొచ్చని చెబుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేసిన కేసీఆర్.. ఇప్పుడు బీజేపీని ఎలా ఎదుర్కోబోతున్నాడో చూడాలి.