Tirumala
Tirumala: తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వన్యప్రాణులు స్వైర విహారం చేస్తున్నాయి. ముఖ్యంగా నడక మార్గంలో నిత్యం కనిపిస్తున్నాయి. భక్తులపై దాడులు చేస్తున్నాయి. గత నెలలో బాలుడు పై చిరుత దాడి చేసింది. కొద్దిరోజుల కిందట లక్షిత అనే చిన్నారిని బలిగొంది. దీంతో తిరుమలలో భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా అటవీ శాఖ పనితీరు చర్చనీయాంశంగా మారింది. అటవీశాఖ అధికారుల తప్పిదం వల్లే వన్యప్రాణులు జనారణ్యం లోకి వస్తున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తిరుపతికి ఆనుకొని శేషాచలం కొండలు ఉన్నాయి. ఇది ఏపీలో ఒక ఉన్నత పర్వతశ్రేణి. తూర్పు కనుమల్లో ఒక అంతర్భాగం. మొత్తం ఏడు పర్వతాలు ఇక్కడ ఉన్నాయి. అంజనాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి,వెంకటాద్రి, వృషభద్రి అని పేర్లతో పిలవబడుతున్నాయి. ఈ శేషాచలం కొండలు జీవవైవిధ్య నెలవుగా వివిధ అధ్యయనాలు తేల్చాయి. ఇక్కడ ప్రధానంగా చిరుతపులులు, ఎలుగుబంట్లు సంచరిస్తుంటాయి. అవే ఇప్పుడు జనారణ్యంలోకి వస్తున్నాయి.
ఈ అడవులను సంరక్షించడంలో అటవీ శాఖ ఫెయిల్ అయిందన్న విమర్శలు ఉన్నాయి. సహజ సిద్ధంగా అటవీ విస్తరణకు అక్కరకు వచ్చే ఎటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడ కార్యకలాపాలన్నిటిని టీటీడీకి ప్రభుత్వం విడిచిపెట్టింది. అటు అటవీ శాఖ సైతం స్వేచ్ఛగా ఏ పని చేయలేకపోతోంది. స్వయం నిర్ణయాలు తీసుకోలేక పోతోంది. ప్రతి విషయము, నిర్ణయాధికారం టీటీడీ చేతిలో ఉండడంతో.. అటవీశాఖ ప్రేక్షక పాత్రకే పరిమితం అయిపోతోంది. వివిధ కారణాలతో అడవులను నాశనం చేస్తున్నా.. సంస్కరణల పేరిట వివిధ అటవీ నిర్మాణాలను తొలగిస్తున్నా అటవీ శాఖ ఎదురు చెప్పలేని స్థితిలో ఉంది. దీంతో అడవుల విస్తీర్ణం తగ్గుతోంది. అందులో ఉండే వన్యప్రాణులు బాహ్య ప్రపంచంలోకి వస్తున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ఏ ప్రభుత్వ శాఖ సక్రమంగా పనిచేయదన్న అపవాదు ఉంది. జాతీయస్థాయిలో ఆ శాఖకు సంబంధించి బ్యూరోక్రాసి వ్యవస్థ, అధికారులు, వారి బంధువులు తరచూ తిరుమల వస్తుంటారు. వారికి దర్శన ఏర్పాట్లు చేస్తుండడమే వీరి ప్రధాన వీధి. దీంతో సొంత శాఖ పనులు చేయలేకపోతుంటారు. అటవీ శాఖ సైతం నిత్యం తమ వారి సేవలోనే తరిస్తుంటుంది. అందుకే టీటీడీని ఏ విషయంలోనూ నియంత్రించలేక పోతుంది. దీంతో శాఖా పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబడిపోతుంది. అడవుల సంరక్షణ వంటి వాటిపై ఫోకస్ పెట్టలేక పోతోంది. వన్యప్రాణులు బాహ్య ప్రపంచంలోకి రావడానికి అటవీ శాఖ ఫెయిల్యూర్ ప్రధాన కారణం అన్న టాక్ విస్తరిస్తోంది.