Praveen Prakash: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ఒక ఉన్నతాధికారి పోతే పండుగ చేసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం ఏపీలో నెలకొందట… ఆయన ఏం చేశాడు? ఎలా చేశాడన్న దానిపై ఇప్పుడు కథలు కథలుగా చెబుతున్నారు. ఏపీ సీఎం జగన్ నిన్న రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్న ఇద్దరు అధికారులను అనూహ్యంగా బదిలీ చేశారు. వీరిలో ఒకరు డీజీపీ గౌతమ్ సావాంగ్ కాగా.. మరొకరు సీఎంవో కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్. ‘చలో విజయవాడ’ కార్యక్రమ విజయవంతానికి కారణం డీజీపీనేనని, అందుకే బదిలీ చేశారని అనుకుంటున్నారు. అయితే అసలు కారణం వేరే ఉన్నా.. ఆయన బదిలీ చర్చనీయాంశంగా మారింది. ఇక పరిపాలనకు కేంద్ర బిందువైన సీఎంవో కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను కూడా బదిలీ చేశారు. అయితే ప్రవీణ్ ప్రకాశ్ పై అధికారులు, ప్రజాప్రతినిధుల్లో ఇప్పుడు చర్చ సాగుతోంది. ఆయన బదిలీ కావడంతో వీరంతా ఊపిరి పీల్చుకున్నంత పనైందని అంటున్నారు. ఇంతకీ ప్రవీణ్ చేసిన చేసిన పనులేంటి? ఆయన బదిలీతో వాళ్లంతా ఎందుకు సంతోషంగా ఉన్నారన్న దానిపై స్పెషల్ ఫోకస్..
సీఎంవో కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. కానీ ఆయన శరీరమంతా ఇగోతో నిండి ఉందని కొందరు అధికారులు వాపోతున్నారు. ఆయన చేసిన పనులపై మంత్రులు సైతం మనస్థాపానికి గురైనట్లు చెబుతున్నారు. జగన్ కు అత్యంత సన్నిహిత అధికారిగా పిలుచుకునే ఈయన జగన్ ను కలిసేందుకు వచ్చిన వారిని ముప్పు తిప్పలు పెట్టాడట. సీఎంలో ఉన్నప్పుడు మంత్రులను కూడా జగన్ ను కలవనియలేదని అనుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేల సంగతిని అసలే పట్టించుకునేవారు కాదట. ఇక ఏదైనా నియోజకవర్గ సమస్యల కోసం సీఎం కార్యాలయానికి వస్తే వారిని దూరం పెట్టేవారట. జగన్ జిల్లాల పర్యటనలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన కొన్ని సమస్యలను జగన్ పెద్దగా పట్టించుకోలేదట. అందుకు ఈ అధికారి చేసిన పుణ్యమేనని చెవులు కొరుక్కుంటున్నారు.
Also Read: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?
ఇక అధికారులను సైతం ప్రవీణ్ ప్రకాశ్ వదలలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కాదని ప్రవీణ్ ప్రకాష్ జీవోలను జారీ చేసేవారట. ఆయనకు తెలియకుండా ఉత్తర్వులు కూడా జారీ చేశారని అంటున్నారు. అలా ఇవ్వడం కొన్నిసార్లు వివాదం కూడా అయింది. అయితే ప్రవీణ్ ఇలా చేయడంపై కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో ఆయనను సీఎంవో నుంచి తప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ తరువాత ప్రిన్సిపల్ సెక్రెటరీగా బాధ్యతలు అప్పజెప్పారు. ఇక్కడా ఆయన తన ఇగోను చూపించారు. ప్రతీ విషయాన్ని జగన్ వద్దకు చేరనివ్వకుండా ఇక్కడే తిప్పి పంపేవారట. కొన్ని వాస్తవ విషయాలు జగన్ ను చేరనివ్వకుండా సీఎంను తప్పుదోవ పట్టించాని అంటున్నారు. దీనిపై వైసీపీ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ విషయాన్ని జగన్ కు చెప్పలేక.. ఆయనను అదుపులో పెట్టలేక సతమతమయ్యేవారు.
ఇటీవల జరిగిన ఉద్యోగుల సమ్మె విషయంలోనూ ప్రవీణ్ తన మార్క్ చూపించారు. సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ముందుగా సమస్యను పరిష్కరించాల్సింది పోయి.. ప్రభుత్వ డిమాండ్లను ఉద్యోగులు అంగీకరించినట్లు తప్పుడు సమాచారం అందించారు. అందుకే జగన్ హెచ్ఆర్ఏ, ఫిట్మెంట్ విషయంలో జీవో వెంటనే విడుదల చేశారని అంటున్నారు. కొత్త జీతాల విషయంలో కూడా ప్రవీణ్ ప్రకాశ్ ఒత్తిడి చేశారని అంటున్నారు. ప్రవీణ్ బ్యాడ్ కమ్యూనికేషన్ తో ప్రభుత్వంపై అధిక భారం పడిందని అంటున్నారు.
అయితే ఈ విషయాన్ని ఎలాగోలా జగన్ కు కొందరు వివరించడంతో సీఎం వెంటనే అప్రమత్తమయ్యారు. అసలు విషయాన్ని గ్రహించి వెంటనే ఆయనను రాష్ట్రంలో ఉంచకుండా ఢిల్లీకి బదిలీ చేశారు. దీంతో రాష్ట్రంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు ఊపిరీ పీల్చుకున్నారని చర్చించుకుంటున్నారు. అయితే ప్రవీణ్ ప్రకాశ్ ఎలాంటి అవినీతికి పాల్పడకపోయినా ఆయన చేసిన చర్యల వల్ల అటు ప్రభుత్వం, ఇటు ప్రజాప్రతినిధులు తీవ్రంగా నష్టపోయారని అంటున్నారు. అందుకే ఆయన విషయంలో జగన్ చాలా కఠినంగానే వ్యవహరించినట్లు సమాచారం.
Also Read: నేడే మేడారం జాతర ప్రారంభం.. పోటెత్తుతున్న భక్తులు