TDP And Janasena: టిడిపి, జనసేనలు దూకుడు పెంచాయి. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. పొత్తు ప్రకటన తర్వాత ఇటీవల రెండు పార్టీల సమన్వయ సమావేశం రాజమండ్రిలో జరిగిన సంగతి తెలిసిందే. పవన్ తో పాటు లోకేష్ ఈ సమావేశానికి హాజరయ్యారు. నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. అయితే అంతకంటే ముందే రెండు పార్టీల మధ్య ఆత్మీయ కలయికలు జరగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలోనే రెండు పార్టీ శ్రేణుల విస్తృతస్థాయి సమావేశాన్ని భారీగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఎన్నికలు సమీపిస్తున్నాయి. పట్టుమని ఆరు నెలల వ్యవధి కూడా లేదు. ఈ తరుణంలో ప్రజల్లోకి బలంగా వెళ్లాలని టిడిపి, జనసేనలు నిర్ణయం తీసుకున్నాయి. అదే సమయంలో రెండు పార్టీల మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉండాలని భావిస్తున్నాయి. అందుకే ఈనెల 29 నుంచి 31 వరకు.. మూడు రోజుల పాటు జిల్లాస్థాయిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకోనున్నాయి. క్షేత్రస్థాయిలో సమన్వయానికి ఈ ఆత్మీయ సమావేశాలు దోహదపడతాయని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం, జనసేన శ్రేణులను ఆత్మీయ సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు.
నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణను ప్రకటించనున్నారు. ఇప్పటికే తెలుగుదేశం మినీ మేనిఫెస్టో తయారుచేసిన సంగతి తెలిసిందే. దీనికి జనసేన నుంచి నాలుగు అంశాలపై ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని చేర్చిన తర్వాత ఉమ్మడిగా ప్రకటించనున్నారు. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఇరు పార్టీల శ్రేణులకు దిశ నిర్దేశం చేయనున్నారు.గతంలో కొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటికి జనసేన ప్రతిపాదించిన అంశాలను జత చేయనున్నారు. ఇప్పటికే ప్రతిపాదిత అంశాలను జనసేన నేతలు టిడిపి నాయకులకు అందించారు.
నవంబర్ మొదటి వారంలో టిడిపి, జనసేన విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ఇరు పార్టీల నాయకులు ఒక నిర్ణయం తీసుకోనున్నారు. పొత్తు ప్రకటన తర్వాత తొలి సమావేశం కావడంతో.. ప్రతిష్టాత్మకంగా సభ నిర్వహించాలని భావిస్తున్నారు. చంద్రబాబు లేకపోవడంతో పవన్ ఈ సభ సారధ్య బాధ్యతలను వహించే అవకాశం ఉంది. ఈ సభ ద్వారా రెండు పార్టీల శ్రేణులకు దిశ నిర్దేశం చేయడంతో పాటు వైసీపీ సర్కార్ అరాచక విధానాలను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై అవగాహన కల్పించనున్నారు. మొత్తానికైతే టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ కార్యక్రమాలు ఊపందుకోవడంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది.