YS Vijayamma: విజయమ్మ.. అలియాస్ వైఎస్.విజయలక్ష్మి.. పరిచయం అక్కరలేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి భార్య. 2009లో వైఎస్సార్ మరణం తర్వాత కుటుంబం ఒక్కతాటిపై నిలిచింది. నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ కుటుంబం కొన్ని రోజులకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. తండ్రి మరణం తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇవ్వకపోవడం ఒక కారణమైతే.. తండ్రి సీఎంగా ఉండి చనిపోయిన నేపథ్యంలో ఆ పదవి కొడుక్కు దక్కలేదన్న ఆవేదన మరోవైపు.. ఈ రెండింటికి తోడు.. ఢిల్లీ వెళితే కనీసం సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కూడా దక్కలేదన్న బాధ వెరసి.. కుటుంబం మొత్తం కాంగ్రెస్‌ను వీడింది. అప్పుడే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. కాంగ్రెస్‌ను బొందపెట్టడమే లక్ష్యంగా వైఎస్.విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగా, జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షుడిగా ఏర్పడిన ఈ పార్టీకి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ లభించింది.
జగన్ అరెస్ట్‌తో..
అయితే.. మనీలాండరింగ్ కేసులో జగన్ అరెస్ట్ కావడంతో పార్టీ బాధ్యతను తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల భుజానికెత్తుకున్నారు. ఓదార్పు యాత్ర పేరుతో షర్మిల పాదయాత్ర చేశారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రాష్ట్ర విభజన జరిగింది. దాదాపు 16 నెలలు జగన్ జైల్లో ఉండేందుకు కాంగ్రెస్సే కారణమని తల్లి, చెల్లి విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరగగా, వైసీపీకి ఆదరణ లభించింది. దీంతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 60 ఎమ్మెల్యే సీట్లను గెలిపించారు. ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది.
2019లోనూ..
ఇక 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగనన్న వదిలిన బాణంలా షర్మిల వైసీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. బైబై బాబు అంటూ.. టీడీపీ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. దీంతో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అన్న తనకు ఏదైనా పదవి ఇస్తారని ఆశించిన షర్మిలకు భంగపాటే ఎదురైంది. దీంతో తెలంగాణకు వెళ్లిన షర్మిల 2021లో అక్కడ వైఎస్సార్‌టీపీ పార్టీని స్థాపించారు. ఈ సమయంలో విజయమ్మ కూతురుకు అండగా నిలిచారు. తన బిడ్డను ఆదుకోవాలని తెలంగాణ ప్రజలను కోరారు. వైఎస్సార్ సంక్షమ పాలన తీసుకొస్తుందని తెలిపారు.
కాంగ్రెస్‌లో విలీనం..
ఏ పార్టీ అయితే తమ కుటుంబం పాలిట శాపం అనుకున్నారో.. అదే పార్టీలో షర్మిల జనవరి 4న చేరారు. తాను స్థాపించిన వైఎస్సార్‌టీపీని విలీనం చేశారు. జనవరి 16న కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగించింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు విజయమ్మ ఎటువైపు ఉంటారన్న చర్చ ఏపీ పాలిటిక్స్‌లో జరుగుతోంది. తన భర్త చావుకు కారణం, కొడుకు జైలుకు వెళ్లడానికి కారణమైన కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తారా.. లేక తిరిగి కొడుకుతో ఉంటారా అన్న చర్చ జరుగుతోంది.
కూతురువైనే మొగ్గు..
బహిరంగ సభల్లో మీ బిడ్డ.. మీ బిడ్డ అని ప్రసంగించే సీఎం జగన్ సొంత తల్లి విజయమ్మను మాత్రం ఎప్పుడో దూరం చేసుకున్నారు. షర్మిల పార్టీ స్థాపించిన తర్వాత విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. కూతురుతో కలిసి తెలంగాణలో ప్రచారం చేశారు. మళ్లీ షర్మిల ఏపీకి వచ్చారు. కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో విజయమ్మ కూడా కొడుకు కన్నా.. కూతురుకే మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. కొన్ని రోజులుగా విజయమ్మ జగన్ ఇంటికి వెళ్లడం లేదు. షర్మిత తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు అన్న వద్దకు వెళ్లింది. అప్పుడు కూడా షర్మిల వెంట తల్లి వెళ్లలేదు. ఏపీకి షర్మిల రాకుండా చూడాలని జగన్ తల్లిపై ఒత్తిడి తెచ్చారన్న ప్రచారం జరిగింది. కానీ విజయమ్మ జగన్ ఒత్తిడికి తలొగ్గలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో విజయమ్మ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినా కూతురుకు మద్దతుగా ఉంటుంది అన్న చర్చ జరుగుతోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: What is the path to ys vijayamma
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com