Kasani Gnaneshwar: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీని వీడారు. వెళుతూనే అధినాయకత్వంపై విమర్శలు చేశారు. లోకేష్ ను టార్గెట్ చేశారు. కష్టకాలంలో ఉన్న పార్టీపై తిరుగుబాటుబావుట ఎగురవేశారు. తెలంగాణ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయకపోవడం కారణంగా చూపుతూ ఆయన పార్టీని వీడారు. ఎన్నికల ముంగిట హడావిడి చేసి.. తీరా అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిన తర్వాత పోటీ చేయకూడదని నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ టిడిపి నేతలు, కార్యకర్తల సైతం అగ్రనాయకత్వం నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు.
ఇప్పటికే అధికార బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి జ్ఞానేశ్వర్ కు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. తనకు సముచిత స్థానం కల్పించే పార్టీలోకి వెళ్లాలని కాసాని ఆలోచిస్తున్నారు. ఎన్నికలు దగ్గరవుతున్న నేపథ్యంలో ఏదో ఒక పార్టీలో చేరాల్సిన అనివార్య పరిస్థితి కాసాని జ్ఞానేశ్వర్ పై ఉంది. కాగా తాను కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేస్తానని కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. అయితే అక్కడ బి ఆర్ ఎస్, కాంగ్రెస్, బిజెపిలో అభ్యర్థులను ప్రకటించడంతో ఎలా సాధ్యమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
తెలుగుదేశం పార్టీలో కాసాని జ్ఞానేశ్వర్ ది సుదీర్ఘ నేపథ్యం. 2001 నుంచి 2006 వరకు ఆయన టిడిపి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. 2007లో పదిమంది తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2007లో దేవేందర్ గౌడ్ తో తలెత్తిన విభేదాలతో టిడిపిని వీడారు. మన పార్టీ పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అయినా రాజకీయంగా రాణించలేకపోయారు. 2022లో తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా సొంత టీమును ఏర్పాటు చేసుకోవడంలో కాసాని జ్ఞానేశ్వర్ సక్సెస్ అయ్యారు.
ఈ ఎన్నికల్లో విశేషమైన ప్రభావం చూపి కనీస స్థానాలను గెలుచుకోవాలని కాసాని జ్ఞానేశ్వర్ భావించారు. 2028 ఎన్నికల నాటికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ప్రభావమైన శక్తిగా మలచాలని వ్యూహం రూపొందించారు. అయితే చంద్రబాబు అరెస్టు రూపంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీ తెలంగాణలో పోటీకి దూరమైంది. అయితే వ్యక్తిగత కారణాలు చూపి టిడిపి పోటీ నుంచి తప్పుకోవడం పై కాసాని జ్ఞానేశ్వర్ కీనుక వహించారు.ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. జంక్షన్లో నిలబడ్డారు. ఏ పార్టీలో చేరుతారనే దానిపై స్పష్టత లేదు. అయితే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ లు జ్ఞానేశ్వర్ కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.