
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి దూకుడుగా ముందుకు వెళ్లాలనుకుంటున్న షర్మిల అందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. జులై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా షర్మిల పార్టీ ప్రకటన ఉండబోతోంది. మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మాను క్యాష్ చేసుకునేలా ఆయన కుమార్తె వైఎస్ షర్మిల రేపటి రోజుకు స్కెచ్ గీస్తున్నారు. ఇప్పుడు షర్మిల పార్టీ తెలంగాణలో ఎంత ప్రభావం చూపుతుందనేది ఆసక్తిగా మారింది.
రాజకీయ విశ్లేషకులు, సోషల్ మీడియాలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. 2023లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల పార్టీ అవకాశాలపై ‘నేషనల్ పొలిటికల్ కన్సల్టెన్సీ’ అనే ప్రైవేటు ఏజెన్సీ ఒక సర్వేను షర్మిల చేయించిందని ప్రచారం సాగుతోంది. ఈ సర్వేలో సంచలన విషయాలు బయటపడినట్టు తెలుస్తోంది.
తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కనీసం 72 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతుందని సర్వే వెల్లడించిందని సమాచారం. అయితే పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ సర్వేలో ఈ 72 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ ఇమేజ్ ఇప్పటికీ ఓటర్లపై ప్రభావం చూపుతోందట. వచ్చే ఎన్నికల్లో షర్మిల పార్టీకి ఇది ఉపయోగపడుతుందని తేలింది.
కేసీఆర్ కు వ్యతిరేకులైన ఓటర్లు, రెడ్డి ఓటర్లలో షర్మిల విశ్వాసం నింపగలిగితే వచ్చే ఎన్నికల్లో ఆమె ఎక్కువ సీట్లను గెలుచుకోగలదని.. 72 సీట్లలో ప్రభావం చూపుతుందని సర్వే తేల్చింది.
ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం వైఎస్ఆర్ పేరును ఓన్ చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీఎం అని తన ప్రసంగాల్లో ఆయన ఓట్లను పొందేందుకు ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ కూడా రెడ్డి కావడంతో ఈ వర్గం ఓట్లు చీలిపోయే అవకాశాలున్నాయి.
దీంతో తెలంగాణలో వైఎస్ఆర్ వారసత్వాన్ని సొంతం చేసుకోవడంలో రేవంత్, షర్మిల ఒకరితో ఒకరు పోటీపడుతున్నట్టు కనిపిస్తోంది. వైఎస్ఆర్ అభిమానులు రేవంత్ రెడ్డి వైపు నిలుస్తారా? లేదా షర్మిల వైపుకు వెళుతారా? అన్నది ఆసక్తిగా మారింది. దాన్ని కాలమే నిర్ణయించనుంది.