Congress Dalit Declaration: దళితుల ఆర్థిక అభ్యున్నతికి 12 లక్షలు.. వారి వారి విద్యార్హతలను బట్టి విద్యార్థులకు 5 లక్షల వరకు సహాయం… ఇదీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే ప్రకటించిన దళిత డిక్లరేషన్. వాస్తవానికి ఇలాంటి హామీలు జనాల్లో చర్చకు దారి తీస్తాయి.. ఎన్నికలవేళ ఇది మరింత వ్యాప్తిలో ఉంటుంది. సహజంగానే ప్రతిపక్ష పార్టీ ఇలాంటి హామీ ఇవ్వడం అధికార పార్టీని ఒకింత కలవరపాటుకు గురిచేస్తుంది. అలాంటప్పుడే అధికార పార్టీ నుంచి విసుర్లు వస్తుంటాయి. విమర్శలు కూడా వినిపిస్తాయి. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన దళిత డిక్లరేషన్ అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారిందని తెలుస్తోంది. ఇది మరింత తమ పార్టీ పుట్టి ముంచకుండా చూసుకునేందుకు భారత రాష్ట్ర సమితి పెద్దలు రంగంలోకి దిగారు. విలేకరుల సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగడుతున్నారు. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇస్తోందని ఆరోపిస్తున్నారు.
హుజురాబాద్ నియోజకవర్గం లో గెలిచేందుకు..
ఈటల రాజేందర్ ను బయటికి పంపించిన తర్వాత ఎలాగైనా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంలో గెలవాలని భారత రాష్ట్ర సమితి భావించింది. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా దళిత బంధు పథకాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఇదే పథకాన్ని అంబేద్కర్ అభయ హస్తంగా మార్చి 12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అది ఎలా సాధ్యమని భారత రాష్ట్ర సమితి వాదిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రకటించడం ఎన్నికల స్టంట్ అంటూ కొట్టి పారేస్తోంది. ఈ రోజున నీతులు చెబుతున్న భారత రాష్ట్ర సమితి ఆరోజు హుజరాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకే కదా దళిత బంధు పథకాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయకుండా మురగబెట్టింది. ఆ సబ్ ప్లాన్ చట్టం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ నే. కాకపోతే దానికి మసిపూసి మారేడు కాయ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు భారత రాష్ట్ర సమితి దానికి దళిత బంధు అని పేరు పెట్టింది. ఈ దళిత బంధు అందరికీ ఇస్తామని చెప్పి కేవలం ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికే ఇస్తోంది. మొదట్లో ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్లకు అప్పగించింది.. తర్వాత ఆ అధికారాన్ని ఎమ్మెల్యేలకు బదలాయించింది. ఫలితంగా ఇది కూడా గులాబీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చే పథకంగా మారిపోయింది.
అధికార పార్టీలో ప్రకంపనలు
ఇక చేవెళ్ల సభ ద్వారా డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. దళితుల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా రకరకాల తాయిలాలు ప్రకటించింది. మల్లికార్జున కార్గే కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం.. పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే డబ్బులను 12 లక్షలకు పెంచుతామని ప్రకటించడం.. దళిత ఓటర్లలో చర్చకు దారి తీస్తోంది. వాస్తవానికి సమాజంలో దళితులు అత్యంత దారుణమైన జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి అధికారంలోకి వస్తే 12 లక్షలు సహాయం చేసి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. దళారులకు అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి నగదు వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తామని అంటున్నారు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి అమలు చేస్తున్న దళిత బంధు యూనిట్ మంజూరుకు గాను అధికార పార్టీ నేతలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. జనగామ ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఏ విధంగా డబ్బులు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన పై ఆరోపణలు వచ్చాయి.. నేరుగా సీఎంవో రంగంలోకి దిగి ఆ డబ్బులను ఎమ్మెల్యే ద్వారా తిరిగి లబ్ధిదారులకు అప్పగించింది. ఒక జనగామ లోనే ఈ విధంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ పథకాన్ని గేమ్ చేజర్ లాగా భారత రాష్ట్ర సమితి అభివర్ణిస్తున్నప్పటికీ.. దళితుల్లో ఆశించినంత ప్రతిస్పందన రావడం లేదు. దీనిని గుర్తించే కాంగ్రెస్ పార్టీ దళిత డిక్లరేషన్ ప్రకటించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇది తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందని భావించిన భారత రాష్ట్ర సమితి నాయకులు కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ ప్రకటించిన దళిత డిక్లరేషన్ ప్రభుత్వానికి తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించడంతో కెసిఆర్ ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.