Dubbaka Incident- Moinabad Farm House: అవి దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న రోజులు. బిజెపి, టిఆర్ఎస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. సోలిపేట రామలింగారెడ్డి భార్య టిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నది. బిజెపి నుంచి రఘునందన్ రావు బరిలో ఉన్నాడు. అప్పటికే రెండు మార్లు ఓడిపోయి ఉన్నాడు. ఈసారి జనం కొంతలో కొంత సానుభూతి ప్రకటించారు. టిఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన హరీష్ రావు రామలింగారెడ్డి భార్య తరుపున అన్ని తానై ప్రచారం చేస్తున్నారు. ఇదే క్రమంలో హరీష్ రావుకు, బండి సంజయ్ కి మాటా మాట పెరిగింది. ఒకానొక దశలో హరీష్ రావు సమయమనం కోల్పోయి “దుబ్బాక బస్టాండ్ కి రా” అని సవాల్ చేశారు. అప్పటికే దుబ్బాక బస్టాండ్ అద్వానంగా ఉంది. దీనిని బిజెపి సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. తర్వాత జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రఘునందన్ రావు విజయంలో హరీష్ రావు మాట కీలక పాత్ర పోషించింది. అది మొదలు ట్రబుల్ షూటర్ ప్రభ మసకబారడం మొదలైంది

జోయల్ డేవిస్ రాకతో..
దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ఇప్పటికీ సిద్దిపేట సిపి జోయల్ డేవిస్ చేసిన అతిని ఎవరూ మర్చిపోరు. రఘునందన్ రావు బంధువుల ఇంట్లో కొంతమేర అప్పుడు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. దాని లింకు మొత్తం హైదరాబాదులో ఉన్నట్టు తేల్చారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట సిపి జోయల్ డేవిస్ ను ప్రత్యేక అధికారిగా నియమించింది. తర్వాత అనేక పరిణామల మధ్య ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గెలిచాడు. గెలిచిన అనంతరం నిర్వహించిన ర్యాలీలో సిద్దిపేట సి పి ఆఫీస్ ముందు తొడ కొట్టి మీసం మేలేసాడు. ఆ విజయాన్ని డేవిస్ కి అంకితమిస్తున్నట్టు పేర్కొన్నాడు.
తాజా పరిణామంతో
ప్రస్తుతం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామాతో మునుగోడు లో ఉప ఎన్నిక జరగనుంది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి.. పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఉన్నట్టు అక్కడ ప్రచారం జరుగుతున్నది. డబ్బు, ఇతర వ్యవహారాల్లో ఇరు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ మొయినాబాద్ కు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన నిన్నటి ఇష్యూలో పొలిటికల్ గా మైలేజ్ సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే అప్పటి దుబ్బాక ఇష్యూను, ఇప్పటి మొయినాబాద్ ఘటనతో పోల్చి చూస్తున్నారు.

అయితే ఈ కేసు లీగల్ గా నిలబడదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే 2015 లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టీఫెన్ సన్ కు డబ్బులు ఇస్తూ అప్పటి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసులో A3 గా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉన్నారు. 2018లో టిడిపి నుంచి గెలిచిన ఆయన ప్రస్తుతం టిఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి కేసు మాదిరే ఇది కూడా ఏళ్ల తరబడి సాగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఎర చూపిన స్వామీజీలకు బిజెపితో ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ బృందంలో నందకుమార్ అనే వ్యక్తిని లోతుగా విచారిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మునుగోడు లో బిజెపి గెలుస్తుందని, ప్రజల్లో వస్తున్న స్పందనను తట్టుకోలేక టిఆర్ఎస్ ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతోందని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా నిన్నటి ఘటన జరిగిన దగ్గర నుంచి బిజెపి, టిఆర్ఎస్ సోషల్ మీడియాలో పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.