మొదట్లో ఈజిప్టు ఆధీనంలో ఉన్న గాజా ప్రాంతం 1967లో జరిగిన మిడిల్ ఈస్ట్ యుద్ధం తరువాత ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చింది. 2005లో ఇక్కడి నుంచి తన బలగాలతో పాటు 7 వేల మంది సెటిలర్లు కూడా ఇజ్రాయెల్ వెనక్కి రప్పించింది. 2007లో పాలస్తీనా సైన్యంలోని ఇస్లామిక్ తిరుగుబాటు గ్రూప్ హమాస్ ఈ ప్రాంతాన్ని తన చేతిలోకి తీసుకుంది. అప్పటి నుంచి అటు ఇజ్రాయెల్, ఇటు ఈజిప్టు దేశాలు గాజాకు సరుకు రవాణా, రాకపోకలపై ఆంక్షలు విధించాయి. హమాస్, ఇజ్రాయెల్ మధ్య 2014లో స్వల్పంగా ఘర్షణ జరగ్గా, ఇప్పుడు అది తీవ్ర స్థాయిలో పెరిగింది.
ముస్లింలు, యూదులు పవిత్ర నగరంగా భావించే జెరూసలెంలోని తూర్పు ప్రాంత ఆక్రమణ అంశంపై ఇజ్రాయెల్, గాజాలు ఘర్షణకు దిగాయి. ఈ ప్రాంతం నుంచి ఇజ్రాయె ల్ వెనక్కి వెళ్లాలన్నది హమాస్ డిమాండ్. మే 10న హమాస్, ఇజ్రాయెల్ మీద రాకెట్ దాడులు చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ముదిరింది. 2014 తరువాత గాజా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఇజ్రాయెల్ నుంచి తరుచూ జరుగుతున్న వైమానిక దాడులతో గాజా ప్రాంతంలో విద్యుత్ సరఫరా తీవ్రంగా దెబ్బతింది. రోజులో కనీసం 8 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. చాలా ఇళ్లకు మూడు నాలుగు గంటల పాటు కూడా కరెంటు ఉండడం లేదు. గాజాకు విద్యుత్ సరఫరా ఉన్న ఒకే ఒక ఉత్పత్తి కేంద్రంతోపాటు ఇజ్రాయె ల్, ఈజిప్టుల విద్యుత్ అందుతోంది.
గాజా ప్రాంతం హమాస్ చేతిలోకి వచ్చిన 2007 సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలో ఉన్న సరిహద్దులను ఈజిప్టు పూర్తిగా మూసివేసింది. కరోనా వైరస్ కారణంగా ఈ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈజిప్టులోకి వెళ్లే రఫా క్రాస్, ఇజ్రాయెల్ లోి ప్రవేశం కల్పించే ఎరెజ్ క్రాస్ లు సంవత్సరంలో 240 రోజులు మూసే ఉంటాయి. 2019లో సుమారు 78 వేల మంది రాఫా క్రాసింగ్ ద్వారా గాజా దాటి ఈజిప్టులో ప్రవేశించగా 2020లో కేవలం 25 వేల మంది మాత్రమే రాగలిగారు. ఇదే ఎరెజ్ క్రాస్ ద్వారా కేవలం 8 వేల మంది మాత్రమే ఇజ్రాయెల్ లో ప్రవేశించగలిగారు. అందులో ఎక్కువ మంది కోవిడ్ చికిత్స కోసం వెళ్లిన వారే కావడం విశేషం.
ఇజ్రాయెల్, గాజాల మధ్య జరుగుతున్న పోరు పదో రోజుకు చేరుకుంది. ఇందులో హమాస్ కమాండర్ల నివాసాలే లక్ష్యంగా చేసుకున్నారు. హమాస్ మిలటరీ చీఫ్ మహమ్మద్ డీఫ్ ను అంతమొందించేందుకు చాలాసార్లు ప్రయత్నాలు జరిగిట్లు ఇజ్రాయెల్ చెప్పింది. ఒక అపార్టుమెంట్ పై జరిపిన మెరుపు దాడిలో రాత్రి ఇద్దరు మిలిటెంట్లు మరణించారు. మరో వైపు దాడులు ఆపాలనే ప్రయత్నాలు తెర వెనుక చోటుచేసుకుంటున్నప్పటికీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఈజిప్టు మధ్యవర్తిత్వం వహించి ఏర్పాటు చేసిన ఒప్పందం కొన్ని రోజుల్లో అమలులోకి రానుంది.