Homeజాతీయ వార్తలుTelangana Liberation Day: చరిత్ర దాచిన తెలంగాణ ‘విమోచన’ పోరాటం!

Telangana Liberation Day: చరిత్ర దాచిన తెలంగాణ ‘విమోచన’ పోరాటం!

Telangana Liberation Day: Telangana 'Liberation' struggle

Telangana Liberation Day:  దేశమంత బ్రిటీష్ వారిది.. అందులో మధ్యలోని ‘హైదరాబాద్ సంస్థానం’ నిజాందీ.. నిజాం రాక్షస సైన్యం ‘రజాకర్లు’ తెలంగాణ పల్లెలు, పట్టణాల్లో రక్తపుటేరులు పాలిస్తున్న రోజులవీ.. రజాకర్ల సృష్టికర్త ‘ఖాసీం రజ్వీ’ నేతృత్వంలోని కీచక ముఠాలు మహిళల మాన, ప్రాణాలు తీస్తూ వికటట్టాహాసంతో దోపిడీకి తెగబడ్డ చివరి రోజులు.. దేశమంతా త్రివర్ణపతాకం రెపరెపలాడుతుంటే.. మధ్యలో ఉన్న హైదరాబాద్ సంస్థానం మాత్రం స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు దూరంగా కటిక చీకట్లో మగ్గుతున్న దౌర్భాగ్యపు రోజులవీ..

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్నాడు దశరథి. నిజాం నిరుకుశంలో నిప్పు కణికలు కురిపించాడు ఆ మహా కవి. భారతదేశానికి స్వాతంత్యం వచ్చినా ఇంకా స్వేచ్ఛ లభించకపోవడంతో  కడుపుమండిన తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు. తమకు స్వాతంత్య్రం  కావాలని పోరుబాట పట్టారు. భూమి కోసం.. భుక్తి.. నిజాం రాజు నుంచి తెలంగాణ విముక్తి కోసం ఎంతో మంది సాయుధ రైతాంగ పోరాటం చేశారు. అప్పటికే ఓ చాకలి ఐలమ్మ, అనభేరి ప్రభాకర్ రావు, పరకాల విప్లవ వీరులు ఇలా ఎంతో మంది ‘హైదరాబాద్ సంస్థానం’లో నిజాం రాజుతో పోరాడి అసువులు బాసారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం.. ప్రపంచ చరిత్రలోనే ఓ మహా అద్భుత ఘట్టం. కానీ చరిత్ర ఎందుకో తెలంగాణ సాయుధ పోరాటాన్ని దాచేసింది. ఇప్పటికీ దీనిపై సరైన పుస్తకాలు లేవు.. తెలంగాణలో పాఠ్యాంశాలుగా లేవు. మరే ఇతర కారణాలో తెలియదుగానీ సాయుధ చరిత్ర ఎందుకో అందరికీ చేరలేకపోయింది.. ప్రజలే కర్రలు, కారం, బడిసెలు, రాళ్లు, రప్పలూ ఆయుధాలుగా మలిచి పోరాడిన ఆ తెలంగాణ సాయుధ పోరాటం.. ఈ ‘తెలంగాణ విమోచన దినం’ రోజున అయినా భావి తరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా తెలంగాణ మేధావులు, సమాజం పాటు పడాల్సిన ఆవశ్యకత ఉంది..

బ్రిటీష్ పాలకులు భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చినప్పటికీ సంస్థానాల విషయంలో మెలికపెట్టి వెళ్లడంతో సమస్య జఠిలంగా మారింది. అప్పటికీ దేశంలో 565 సంస్థానాలు ఉండేవి. వాటికి స్వయం నిర్ణయాధికారాన్ని బ్రిటీష్ పాలకులు కట్టబెట్టారు. అందులో 562 సంస్థానాలు స్వచ్ఛందంగా భారత్ లో చేరిపోయాయి. కానీ కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు మాత్రం స్వతంత్ర్య రాజ్యాలుగా ఉంటామని భీష్మించాయి.
YouTube video player
562 సంస్థానాలు భారత్ లో విలీనం అయ్యాక తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనపై పోరాటం ప్రారంభించారు. జమీందార్లు, దొరలు, దేశ్‌ముఖ్‌ల ఆగడాలు, మరోవైపు రజాకార్ల అకృత్యాలు, అరాచకాలు కలగలుపుకొని నిజాం నవాబుల నిరంకుశ పాలన కారణంగా తెలంగాణ అంతటా నిర్బంధ పరిస్థితులే కొనసాగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జోరందుకుంది. ఈ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. సామాన్య ప్రజలే సాయుధులై ముందుకు నడిచారు. కర్రలు, కారం, బడిసెలు, రాళ్లు, రప్పలూ ఆయుధాలయ్యాయి. నాటు తుపాకులు పేల్చడం మొదలుకొని గెరిల్లా యుద్ధతంత్రం వరకూ రాటుదేలారు. ఇదే క్రమంలో కమ్యూనిస్ట్‌ పార్టీకి ప్రజల నుంచి రోజురోజుకు ఆదరణ పెరిగింది. సాయుధ పోరాటంలో దాదాపు నాలుగు వేల మందికి పైచిలుకు అమరులయ్యారు. దేశ ఉపప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానంపై దండెత్తాడు. పోలీస్‌ చర్య ద్వారా హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. అయినా కమ్యూనిస్ట్‌ పార్టీకి తెలంగాణ ప్రజానీకమంతా అండగానే ఉంది.

హైదరాబాద్ సంస్థానం ఏడో నిజాం ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్ ’ పాలనలో ఉంది. సొంత కరెన్సీ, సొంత రైల్వే, సొంత సైన్యం ఉన్న హైదరాబాద్ ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని నిజాం ప్రయత్నించారు. భారత్ లో విలీనానికి ఒప్పుకోలేదు. స్వతంత్ర దేశంగా ఉంటామన్నారు. కానీ దీనికి సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఒప్పుకోలేదు. భారత్ తో చర్చలకు గడువు కోరిన నిజాం అదే సమయంలో పాకిస్తాన్ సాయం కోరాడు. పాకిస్తాన్ కు రూ.20 కోట్లు ఇచ్చినట్టుగా పటేల్ కు ఆధారాలు దొరికాయి. కరాచీలో హైదరాబాద్ సంస్థానం తరుఫున ఒక ప్రజాసంబంధాల అధికారిని కూడా నియమించారు. దీంతో నిజాం వైఖరి పటేల్ కు అనుమానం కలిగింది.

మరోవైపు నిజాం ప్రైవేటు సైన్యం రజాకర్లు కల్లోలం రేపడం మొదలుపెట్టారు. మారణహోమం సృష్టించారు. రజాకర్ల నాయకుడు ఖాసిం రజ్వి లక్షలాదిమందితో భారీ కవాతు నిర్వహించి భారత ప్రభుత్వానికి హెచ్చరికలు పంపాడు. వీరి ఆగడాలు హైదరాబాద్ ను దాటి ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో ఇక లాభం లేదని భావించిన పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయడానికి నిర్ణయించాడు. ఆ ఫలితమే భారత సైన్యం చేపట్టిన పోలీస్ చర్య.. దీన్నే ‘ఆపరేషన్ పోలో’గా పిలుస్తారు. మేజర్ జనర్ జేఎన్ చౌధురి నేతృత్వంలో అపరేషన్ పోలో ‘1948 సెప్టెంబర్ 13న మొదలై అదే నెల 18న సాయంత్రానికి పూర్తయ్యింది. హైదరాబాద్ సంస్థానాన్ని రెండు వైపుల నుంచి ముట్టడించి స్వాధీనం చేసుకున్నారు. షోలాపూర్-హైదరాబాద్ మార్గంలో ప్రధాన బలగాలు రాగా.. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో మరికొన్ని బలగాలు హైదరాబాద్ పై పోలీస్ చర్య చేపట్టాయి. రెండు రోజులు నిజాం సైన్యం ప్రతిఘటించింది. ఆ తర్వాత సైన్యం దూసుకుపోయింది. రజాకర్లు 800 మందికి పైగా చనిపోయారు. రజాకర్లు అప్పటికే తెలంగాణలో హత్యలు, లూటీలు, మానభంగాలతో అపార ప్రాణనష్టం మిగిల్చారు. కొన్ని వారాల పాటు సాగుతుందని భావించిన తెలంగాణపై యుద్ధం సెప్టెంబర్ 17కే విముక్తి లభించింది. 17న నిజాం సైన్యం భారత సైన్యానికి లొంగిపోవడంతో తెలంగాణ స్వేచ్ఛ స్వాతంత్య్రాలు పీల్చుకుంది.

తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుడి నడిపించిన కమ్యూనిస్ట్‌ పార్టీని ప్రజలు ఎంతగా ఆదరించారని చెప్పడానికి 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలే ఉదాహరణ. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన రావి నారాయణరెడ్డి ఆ ఎన్నికల్లో దేశంలోనే అధిక మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాతి నుంచి వరుసగా లోక్‌సభకు, అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లోనూ సాయుధ పోరాటం ఉధృతంగా సాగిన ప్రాంతాల ప్రజలు కమ్యూనిస్టు పార్టీని ఆదరిస్తూ వచ్చారు. మారిన రాజకీయ పరిస్థితులు.. మలి దశ తెలంగాణ ఉద్యమం కారణంగా కమ్యూనిస్టులకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోగా, క్రమక్రమంగా చట్టసభల్లో ప్రాతినిథ్యం కరువైంది.

తెలంగాణ సాయుధ పోరాటానికి కలం..గళం కూడా తోడుగా నిలిచింది. దాశరథి కృష్ణమాచార్య ‘ఓ నిజాము పిశాచమా నినుబోలిన రాజుమాకెన్నడేని.. నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్నా,.. యాదగిరి రాసిన ‘నైజాము సర్కరోడా.. నాజీలను మించినోడా.. గోల్కొండ ఖిల్లా కింద గోరీ కడతాం.. కొడుకా నైజాం సర్కరోడా’తోపాటు సుద్దాల హనుమంతు తదితరులూ అక్షర యుద్ధం చేసి సాయుధ పోరాటానికి స్ఫూర్తి నింపిన వారే.

భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసమే తెలంగాణ సాయుధ పోరాటం సాగింది. కానీ.. స్వరాష్ట్రం వచ్చాక పరిస్థితుల్లోనూ.. ఇప్పటితరంవారు ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకోవడం లేదు. రాజకీయ కోణంలో చూస్తున్న కారణంగానే సాయుధ పోరాట చరిత్ర క్రమక్రమంగా మరుగునపడుతోంది. పోలీస్‌ చర్య తర్వాత హైదరాబాద్‌ సంస్థానంలోని కొన్ని ప్రాంతాలను కర్ణాటక, మహారాష్ట్రలలో కలిపారు. అక్కడ సెప్టెంబర్‌ 17వ తేదీన ఉత్సవాలు జరపడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. మన దగ్గరకు వచ్చే సరికి దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పార్టీలు విమోచన దినం అంటూ జాతీయ పతాకాలు ఎగురవేస్తుండగా, మరికొన్నిపార్టీలు విద్రోహ దినం అంటూ నల్లజెండాలు ఎగురవేస్తున్నాయి. మరికొందరు దేశంలో ఒక ప్రాంతం విలీనం అయ్యిందంటూ సరిపెట్టేస్తున్నారు.

ఈ పోరుపై అవగాహన లేక.. అవగాహన కల్పించే వారూ లేక తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని విస్మరిస్తున్నారు. ఈ పోరు ఇప్పటివరకు చరిత్రలోకి కూడా ఎక్కలేదు. ఇప్పటివరకూ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రపై పుస్తకాలూ లేవు. వీధికో వీరుడు.. ఊరుకో దళం, ప్రాంతాల వారీగా నాయకత్వ బాధ్యతల నిర్వహణ కారణంగా ఎక్కడి చరిత్ర అక్కడే నిక్షిప్తమై ఉంది. ఆయా ప్రాంతాల్లోనూ.. ఆయా సందర్భాల్లోనూ… కొంతమేర పుస్తకరూపంలోకి వచ్చినా, అది తెలంగాణ సామాజానికి చేరువ కాలేదు. సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొన్నవారు తమ అనుభవాలను పుస్తకరూపంలోకి తెచ్చినా.. దానికీ పార్టీ రంగు పులిమే ప్రయత్నాలో.. మరే ఇతర కారణాలో తెలియదుగానీ సాయుధ చరిత్ర ఎందుకో అందరికీ చేరలేకపోయింది. పార్టీలు రాజకీయ కోణంలో చూడకుండా.. తెలంగాణ ప్రాంత స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులుగానే వారిని చూడాలి. భవిష్యత్‌ తరాలకు ఆ సాయుధ పోరాట పటిమ చేరేలా చూడాలి. అప్పుడే సామాన్యులే.. సాయుధులైన వారికి మనం అర్పించే నిజమైన నివాళి. ఇప్పటికే చరిత్రలోనే అతి గొప్పదమైన తెలంగాణ విమోచన దినాన్ని ఇక్కడి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి నాటి వీరుల గొప్పతనాన్ని భావితరాలకు సగర్వంగా చాటాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version