Bhadrachalam Sri Rama Temple : మొన్న మనం చెప్పుకున్నాం కదా. రాముడిపైన కెసిఆర్ ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తోందని… కనీసం కల్యాణానికి పట్టు వస్త్రాలు కూడా ఇవ్వడం లేదని.. దీనిపై అధికార గులాబీ మీడియా రకరకాల వ్యాఖ్యానాలు వండి వార్చింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అది రుచి లేని వంటకం మాదిరి అయింది..ఆఫ్ కోర్స్ కేసీఆర్ సుడి బాగోలేనట్టే.. నమస్తే తెలంగాణ లో వార్తలు కూడా అలాగే ఉంటున్నాయి.. పాపం ఒకప్పటి ఉద్యమ ప్రభలాగా వెలిగిన పత్రిక ఎంతటి దీనస్థితిలో కూరుకుపోయిందో చూస్తుంటేనే జాలి వేస్తోంది..
తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015, 2016 కాలాల్లో ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ భద్రాచలం లో జరిగే సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి హోదాలో హాజరయ్యారు.. పట్టు వస్త్రాలు సమర్పించారు. అదే సమయంలో రామాలయ అభివృద్ధికి 100 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. రెండేళ్లు గడిచిన తర్వాత మళ్లీ తెరపైకి భద్రాచలం అభివృద్ధిని తీసుకొచ్చారు. ఈసారి ఆర్కిటెక్ట్ ఆనంద సాయిని, చిన జీయర్ స్వామిని రంగంలోకి దింపారు. భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ గొప్పలకు పోయారు.. రెండు మూడు డిజైన్లు మీడియాకు విడుదల చేశారు. తర్వాత అంతా నిశ్శబ్దం.. అప్పుడు ముఖ్యమంత్రి ప్రకటించిన 100 కోట్లు, ఇప్పుడు మీడియాకు విడుదల చేసిన డిజైన్లు మరుగున పడిపోయాయి..
డబ్బులు లేకపోవడం వల్లే కరపత్రాలు పంపిణీ చేశారు
అయితే ఇటీవల రామయ్య కల్యాణానికి సంబంధించి దేవస్థానం దగ్గర డబ్బులు లేకపోవడం, ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించకపోవడంతో గత్యంతరం లేక దేవస్థానం దాతల నుంచి విరాళాలు కోరుతున్నట్టు కరపత్రాలు ముద్రించింది. వాటిని విరివిగా పంచింది.. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీనిపై పలు రకాల కథనాలు ప్రసారం కావడంతో అధికార పార్టీ మీడియా కౌంటర్ ఇచ్చింది..కానీ ఇందులో ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఒక పాయింట్.. భద్రాచలానికి పోలవరం ముప్పు ఉంది కాబట్టే ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది అని… మరి ఆ పోలవరం ముప్పే ఉంటే 100 కోట్లు ఎవరు ప్రకటించమన్నారు? రాముడే వచ్చి కేసీఆర్ ను అడిగాడా? ” ఏమోయ్ కేసీఆర్..నా గుడి బాగోలేదు.. నువ్వు 100 కోట్లు మంజూరు చేసి దాన్ని అభివృద్ధి చేయి” అని ప్రాధేయ పడ్డాడా?
దేని కోసం ప్రకటన చేశారు?
భద్రాచలం ప్రాంతానికి పోలవరం ముప్పు ఉన్నదని ప్రభుత్వం భావిస్తున్నప్పుడు.. 100 కోట్ల ప్రకటన చేయడం దేనికి? భద్రాద్రిని అభివృద్ధి చేస్తామని చెప్పడం దేనికి? ప్రభుత్వం ఇక్కడ విస్మరిస్తున్నది ఏంటంటే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఎత్తును తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో 2007 జనవరి 29న జరిగిన నిరసన కార్యక్రమం పోలీసు కాల్పులకు దారి తీయడం, ముగ్గురు గాయపడటం, 78 మందిపై కేసు నమోదయింది. 16 ఏళ్ల తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి 24న కొత్తగూడెం జిల్లా కోర్టు పోలవరం కేసును సైతం కొట్టివేసింది వాస్తవం కాదా. అక్కడి దాకా స్వయంగా కేంద్ర మంత్రుల హోదాలో కె.చంద్రశేఖర్‌రావు, ఆలే నరేంద్ర, శిబు సోరెన్‌లు భద్రాచలం వచ్చి పోలవరానికి వ్యతిరేకంగా భద్రాచలం జూనియర్ కళాశాలలో బహిరంగ సభలో ప్రసంగించారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం లో మంత్రులుగా ఉన్న వీరు పోలవరానికి వ్యతిరేకంగా గళం వినిపించి.. తర్వాత సైలెంట్ అయిపోయారు. తెలంగాణ ప్రాంతం మీద అంత అభిమానం ఉండి ఉంటే అప్పటి ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు? తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతున్నప్పుడు పోలవరానికి మేం వ్యతిరేకం అని ఎందుకు చెప్పలేదు?
ఏ విధంగా ప్రకటించారు?
భద్రాద్రి ఆలయ అభివృద్ధికి పోలవరమే అడ్డంకి అయితే అదే విషయాన్ని అధికారికంగా ఎందుకు ప్రకటించడం లేదు. భద్రాద్రి వరద కరకట్టను సురక్షితం చేసి ఎత్తు పెంచి పొడిగిస్తామని సీఎం కేసీఆర్ 2022 జూలై 17న భద్రాచలం పర్యటన సమయంలో చెప్పడం వాస్తవం కాదా? 32 ఏళ్ల నాటి వరదలు గత ఏడాది రావడంతో భద్రాద్రి రామాలయ పరిసరాలు, ఇతర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ క్రమంలో భవిష్యత్‌లో ఎటువంటి ముంపు సమస్య రాకుండా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.
సాకారం కాని భద్రాద్రి పాలక మండలి
స్వరాష్ట్రం ఆవిర్భవించి ఎనిమిదేళ్లు కావస్తున్నా దక్షిణ అయోధ్యగా ప్రసిద్దిగాంచిన భద్రాచలానికి కనీసం పాలక మండలిని ఏర్పాటు చేయకపోవడం పట్ల సర్వత్రా ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2010 నవంబరు 26న చివరి పాలక మండలి కొలువుదీరగా, 2012 నవంబరు 25న కాల పరిమితి ముగిసింది. అనంతరం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు భద్రాద్రి దేవస్థానానికి పాలక మండలి ఏర్పాటు కాకపోవడంతో అధికార పార్టీ ఆశావాహులు సైతం నిరాశకు లోనయ్యారు.
కనిపించడం లేదా?
రాముడికి సంబంధించి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో ప్రభుత్వం చెల్లించే 15000 సరిపోవని, దీన్ని లక్ష రూపాయలకు పెంచుతూ ప్రతిపాదనలు రూపొందించాలని అప్పట్లో దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశించారు. దీని ప్రకారం భద్రాచలం దేవస్థానం ఆయనకు ప్రతిపాదనలు పంపింది. కానీ ఇంతవరకు రూపాయి కూడా రాలేదు. ఆ పదిహేను వేల రూపాయల్లో కూడా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. స్థూలంగా చెప్పాలంటే ఉద్యమ కాలంలో తెలంగాణ దేవుడిగా భద్రాద్రి రాముడుని అభివర్ణించిన కేసీఆర్.. నేడు స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత పూర్తిగా విస్మరించడం బాధాకరం. తమకు చేసిన ద్రోహానికి గుర్తుగానే భద్రాచలం వాసులు ఒక్కసారి కూడా అధికార భారత రాష్ట్ర సమితి అభ్యర్థిని గెలిపించడం లేదు.. ఓటు ద్వారా తమ నిరసన తెలియజేస్తున్నప్పటికీ.. కెసిఆర్ కు అది కనిపించకపోవడం గమనార్హం.
రామాలయానికి నిధులు విడుదల చేయలేని ప్రభుత్వం.. రామనారాయణుడి వివాదం తీసుకొచ్చింది ఉమ్మడి పాలకులే అనడం హాస్యాస్పదం. అసలు రామ నారాయణుడి వివాదం వైదిక పరమైన అంశం. అసలు వంద కోట్లకు, రామ నారాయణుడి వివాదానికి ఏంటి సంబంధం? నమస్తే చెప్పినట్టు దేవస్థానం వద్ద ఫిక్స్‌డ్ డిపాజిట్లు కనుక ఉంటే విరాళాలు ఎందుకు సేకరిస్తున్నట్టు? ఒక వేళ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉత్సవాలకు ఖర్చు చేస్తారా? అసలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇష్టానుసారంగా వాడుకునే అధికారం దేవస్థానానికి ఎందుకు ఉంటుంది? భవిష్యత్ అవసరాల దృష్ట్యా బ్యాంకుల్లో వేస్తారు. అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు వాడుకునేందుకు అవకాశం ఉండదు. పోనీ భద్రాచలం అంతగా ఆదాయంతో అలరారుతున్నప్పుడు కేసీఆర్ వంద కోట్లు ఇస్తామని ప్రకటన ఎందుకు చేసినట్టు? దాని కోసం ఇన్నేళ్లుగా కాలయాపన ఎందుకు చేసినట్టు?
జీతాలు, ప్రొవిజినల్ చెల్లింపులకు భక్తుల నుంచి వచ్చే ఆదాయమే దిక్కు కాదా?
భద్రాద్రి దేవస్థానంలో రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సిబ్బందికి జీతాల చెల్లింపులు, ప్రసాదాల తయారీకి వినియోగించే సరుకుల కొనుగోలుకు భక్తుల నుంచి వచ్చే ఆదాయమే శరణ్యం. ప్రతి నెల జీతాలు, పెన్షన్ల రూపేణా ఉద్యోగులు, పెన్షనర్లు, సిబ్బందికి రూ.1.20 కోట్లు చెల్లిస్తున్నారు. కొన్ని సమయాల్లో ఈ జీతాల చెల్లింపులకు సరిపడా నిధులు లేకపోతే రాష్ట్రం ఆవిర్భావం అనంతరం సైతం హుండీలు తెరిచే వరకు ఆగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ప్రసాదాల సరుకుల అమ్మకందారులకు, దేవస్థానంలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిర్ణీత సమయంలో బిల్లులు చెల్లించిన దాఖలాలు లేవు. అంతెందుకు 2020 సమయంలో దేవస్థానంలో పని చేస్తున్న సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్‌కుమార్ ఆమోద ముద్రతో జీతాల కోసం జనరల్ ఫండ్‌లోని రూ. ఆరు కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లను ఉపసంహరించి ఉద్యోగులు, సిబ్బంది జీతాలు, వేతనాలు ఇతర చెల్లింపులను చేసింది వాస్తవం కాదా!