https://oktelugu.com/

CM Jagan: సంక్షేమం సరే.. అభివృద్ధిపై జగన్ సమాధానమేది?

విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చారు. జగన్ ను విపక్షంలో కూర్చోబెట్టారు. చంద్రబాబు రాజధాని తో పాటు అభివృద్ధిపై దృష్టి పెట్టారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : January 29, 2024 / 11:59 AM IST
    Follow us on

    CM Jagan: ఏపీలో జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా వాస్తవం ఇదే. అయితే సంక్షేమం అనే తారక మంత్రంతో తాను గెలుస్తానని జగన్ ధీమాగా ఉన్నారు. అయితే అందులో కూడా వాస్తవం ఉంది. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. అయితే ఈ ఐదేళ్లలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నది విపక్షాల ఆరోపణ. దానికి సమాధానం చెప్పాల్సింది కూడా జగనే. కానీ ఆయన ఆ పని చేసేందుకు ఇష్టపడడం లేదు. అభివృద్ధి లేదన్న వాస్తవాన్ని ఒప్పుకోవడం లేదు. తాను అభిమన్యుడిని కాదని.. అర్జునుడునని చెప్పుకుంటున్నారు. ప్రత్యర్థుల చుట్టుముట్టడంతో దానిని తిప్పికొట్టేందుకు జగన్ ఈ మాట చెప్పి ఉండవచ్చు. కానీ విపక్షాల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు, నిలదీతలు ఆయన పద్మవ్యూహంలో పెడుతున్నాయన్న వాస్తవాన్ని మాత్రం తెలుసుకోవాలి.

    విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చారు. జగన్ ను విపక్షంలో కూర్చోబెట్టారు. చంద్రబాబు రాజధాని తో పాటు అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అంతకుముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మర్చిపోయారు. తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు ఆలోచన రివర్స్ అయ్యింది. తాను సంక్షేమంతో పాటు అభివృద్ధిని చేపడతానన్న జగన్ హామీలను ప్రజలు విశ్వసించారు. ఒక్క ఛాన్స్ ఇద్దామని.. జగన్ కు అధికారాన్ని కట్టబెట్టారు. కానీ ఇప్పుడు జగన్ ప్రజల విశ్వాసాన్ని పొందారా? లేదా? అన్నది ఈ ఎన్నికల్లో తెలిసిపోతుంది. అయితే విపక్షాల నుంచి వస్తున్న ప్రశ్నలను సున్నితంగా స్వీకరించాల్సిన జగన్.. తిరిగి వారి పైన సంధిస్తున్నారు. అదరను.. బెదరను అంటూ కొత్త కొత్త మాటలు చెబుతున్నారు. విపక్షాలు తనను అడుగుతున్న వాటికి సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. నేరుగా జవాబు ఇవ్వలేకపోతున్నారు.

    ముఖ్యంగా సోదరి షర్మిల అడుగుతున్న ప్రశ్నలకు జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, దోపిడిని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడా ఆమె వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలో ఆమెతో పాటు భర్త బ్రదర్ అనిల్ కుమార్ ను దాడి చేయిస్తున్న తీరు మాత్రం అభ్యంతరకరంగా ఉంది. షర్మిల జగన్ తనకు అన్యాయం చేశారని మాత్రమే ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. హామీలను అమలు చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం వంటి వాటి గురించి ప్రస్తావిస్తున్నారు. వీటిని తిప్పి కొట్టలేకపోతున్న జగన్ తాను అభిమన్యుడిని కాదని చెప్పడం ద్వారా బేలతనాన్ని ప్రదర్శించుకుంటున్నారు.

    విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలు ప్రజల మది నుంచి వస్తున్నవే. పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. పోలవరం ఎందుకు కట్టలేక పోయారు? మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు ఎందుకు వృధా చేశారు? సెంటు భూమి పేరుతో ఇళ్ల డ్రామా ఎందుకు ఆడారు? మధ్య నిషేధం ఎందుకు చేయలేకపోయారు? నిత్యవసర ధరలను ఎందుకు నియంత్రించలేకపోయారు? ఇలా రకరకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. విపక్షాలే కాదు సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. చివరకు సోదరి షర్మిల కూడా ఇదే తరహా ప్రశ్నలు సంధిస్తున్నారు. కానీ వీటన్నింటికీ సమాధానం చెప్పే స్థితిలో జగన్ లేకపోవడం వైసీపీకి మైనస్ గా మారుతుంది. సంక్షేమం ద్వారా ప్రజలకు, అభివృద్ధి ద్వారా ఈ రాష్ట్రానికి న్యాయం చేశానని జగన్ లో నమ్మకం ఉంటే అభిమన్యుడు, అర్జునుడు వంటి వారితో కాకుండా.. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మాదిరిగా పాలన అందించాలని చెప్పడం ద్వారా ప్రజలకు చేరువు కావచ్చు. ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తనకు మాత్రమే ప్రజలు ఇస్తారని నమ్మకంగా చెప్పవచ్చు. కానీ అభిమన్యుడు పేరు చెప్పి విపక్షాల పద్మవ్యూహంలో చిక్కుకోవడం మాత్రం స్వయంకృతాపమే. తాను అర్జునుడు నన్ను చెప్పడం కాదు.. విపక్షాల విమర్శలను, ఆరోపణలను అర్జునుడి బాణం మాదిరిగా తిప్పి కొట్టొచ్చు. అయితే అది తాను మనస్ఫూర్తిగా చేసినట్లయితేనే మాత్రం చెప్పగలరు.