Congress Revanth Reddy : ఆయన మాటలు కాంగ్రెస్ పార్టీలో లో జోష్ పెంచాయి.. ఆయన దూకుడు ఆ పార్టీ శ్రేణులకు ఉత్సాహం ఇచ్చింది. రోటీన్‌కు భిన్నంగా ఆయన వేసిన వ్యూహాత్మక అడుగులు పార్టీని బలోపేతం చేసినట్లు అనిపించింది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న నేతలు కూడా ఆయన వెంట నడిచేందుకు ఉత్సాహం చూపారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన నేతగా గుర్తింపు పొందాడు. ఆవేశం, ఆలోచనను కలగలిపి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఆయన సంధించిన ప్రశ్నిలు, చేసిన పోరాటం అధికార టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టాయి. ఆ పార్టీ ముఖ్య నేతలు కోర్టులకు వెళ్లి.. తమపై ఆరోపణలు చేయకుండా స్టే తెచ్చుకునేలా ఆరోపణలు, విమర్శలు చేశారు. పెలిటికల్ వెదర్‌ను హీటెక్కిస్తూ ఏడాదిగా రాజకీయాలను తనవైపు తిపుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయ తీరాలకు మాత్రం చేర్చలేకపోయారు. ఆయన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమతులైన తర్వాత రాష్ట్రంలో హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది.
-మూడు ఉపఎన్నికల్లోనూ డిపాజిట్ గల్లంతు
రాష్ట్రంలో టీడీపీ పరిస్థితే కాంగ్రెస్‌కు కూడా రాబోతున్నదా..? గాంధీభవన్‌ను కిరాయికి ఇవ్వాల్సిన దుస్థితికి పార్టీ దిగజారుతున్నదా..? ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర నామమాత్రమేనా..? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, ఎన్నికల ఫలితాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. వరుస ఎన్నికల్లో ఓటములతో ఓల్డ్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికేదైనా సరే ముందే ఓటమి ఖాయమైపోతుంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన మూడు ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. దశాబ్దాలపాటు రాష్ట్రంలో, కేంద్రంలో రాజ్యమేలిన ఆ పార్టీ ఇప్పుడు పరాజయ భారం మోస్తుండడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.
-కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు..
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలున్నట్టుగా హస్తం పార్టీ దీనస్థితికి అనేక కారణాలున్నాయి. ఓ వైపు నాయకత్వ లేమి, మరోవైపు అంతర్గత కుమ్ములాటలతో అల్లకల్లోలంగా మారింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో ఆ పార్టీ కోలుకోవడం కష్టమనే అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
-దూరమవుతున్న క్యాడర్
ఒకప్పుడు రాష్ట్రంలో పటిష్టమైన ఓటు బ్యాంకు, క్యాడర్ కలిగిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు పూర్తి భిన్నంగా ఉన్నది. క్యాడర్ దూరమైంది. ఓటు బ్యాంకు కరిగిపోతోంది. క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కీలక నేతలంతా పార్టీని వీడుతున్నారు. పార్టీలోనే ఉంటున్న క్యాడర్‌లోనూ భరోసా నింపే వారు కరువయ్యారు. గతంలో ఎంతో నమ్మకంగా హస్తంకు ఓటు వేసే వాళ్లు కూడా ఇప్పుడు ఆ పార్టీకి ఓటు వేసేందుకు వెనుకంజ వేస్తుండటం గమనార్హం. ఇలా రాష్ట్రంలో ఇటు క్యాడర్‌కు, అటు జనాలకు పార్టీ దూరమైంది.
-నాయకత్వలేమి.. కుమ్మలాటలు
నాయకత్వలేమి, అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీ పతనానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు జాతీయ స్థాయిలోనూ ఇటు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీని ముందుండి నడిపించే నాయకుడు కరువయ్యాడనే అభిప్రాయాలున్నాయి. జాతీయ స్థాయిలో ఆ పార్టీ సీనియర్ నేతలంతా నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్‌ను వీడి ఇటీవలే కొత్త పార్టీ స్థాపించారు. ఇక రాష్ట్రంలోనూ అంతకన్న ఎక్కువ గందరగోళ పరిస్థితే ఉన్నది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని ఇక్కడి సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఒంటెత్తు పోకడలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ దారుణమైన ఫలితాలు పొందడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో పార్టీని ఆయన కావాలని ఓడించారనే ప్రచారం జరుగుతోంది.
-వరుస ఓటములు.. డిపాజిట్లు గల్లంతు
2014 ఎన్నికల నుంచి మొదలైన ఆ పార్టీ ఓటముల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉన్నది. 2018 డిసెంబర్‌లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చావుదెబ్బ తిన్నది. ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 28.4 శాతం మాత్రమే. ఇటీవల జరిగిన మూడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ కనీస ఓట్లు సాధించలేక డిపాజిట్లనూ కోల్పోయింది. దుబ్బాక ఉప ఎన్నికలో 13.48 శాతం, హుజూరాబాద్‌లో మరీ దారుణంగా 1.46 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. తాజాగా మునుగోడు ఎన్నికలోనూ 10.58 శాతం ఓట్లు పొంది డిపాజిట్ కోల్పోయింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ ఆ పార్టీ దిగ్గజ నేత కుందూరు జానారెడ్డి సైతం ఓటమిపాలయ్యారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలోనూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి పరాజయం పొందారు. ఇలా 130 ఏళ్ల చరిత్ర గల పార్టీ ఇప్పుడు కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని దీనస్థితికి దిగజారడం గమనార్హం.
-మరో షాక్ తగలబోతుందా..?
రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టడంతో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని కార్యకర్తలు భావించారు. కానీ అదేమీ లేదని మునుగోడు ఉప ఎన్నికతో తేలిపోయింది. నేతల మధ్య విభేదాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని తెచ్చి పెడుతుంది. దీంతో పార్టీని నమ్ముకున్న నేతలు, కార్య కర్తలు ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల్లోకి చేరగా.. తాజాగా మరో కీలక నేత సైతం బీజేపీవైపు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామారావు పాటిల్.. త్వరలోనే ఆయన బీజేపీ గూటికి చేరుకోవడం ఖాయమనే ఊహాగానాలు రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి కూడా బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన వెంట కొందరు కూడా త్వరలో బీజేపీలో చేరతారని తెలుస్తోంది.
-రేవంత్ మౌనం వెనుక వ్యూహం ఏంటి?
టీపీసీసీ అధ్యక్షుడిగా ఏడాదిన్నగా కాంగ్రెస్ రాజకీయాలను నిషితంగా గమనిస్తున్నారు రేవంత్‌రెడ్డి. మునుగోడులో విజయం కోసం ఆయన సర్వశక్తులు ఒడ్డారు. కానీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనతో కలిసి రాలేదు. సీనియర్లు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఫలితాలు వచ్చిన సమయంలో రాహుల్‌గాంధీ పాదయాత్ర తెలంగాణలోనే సాగింది. అయితే ఓటమిపై కాంగ్రెస్ పోస్టుమార్టం చేయలేదు. టీపీసీసీ చీఫ్ కూడా సమీక్ష సమావేశం నిర్వహించలేదు. చేస్తామని కూడా ప్రకటించలేదు. రాహుల్ పాదయాత్ర ముగిసిన తర్వాత సమీక్ష ఉంటుందని సీనియర్లు భావించారు. కానీ సమీక్ష నిర్వహిస్తే.. తేనెతుట్టెను కదిల్చినట్లు అవుతుందని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడు అభ్యర్థి స్రవంతి మాత్రం తన ఓటమికి కోవర్టు రెడ్డిలే కారణమని ప్రకటించారు. మరోవైపు ఎన్నికల సమయంలో వెంకటరెడ్డి చేసిన కామెంట్లపై ఏఐసీసీ నోటీసీలు ఇచ్చింది. దానికి కూడా వెంకటరెడ్డి సమాధానం ఇవ్వలేదు. అయినా ఏఐసీసీ చర్యలు తీసుకోలేదు. ఈ పరిణామాలతో రేవంత్ వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. వెంకటరెడ్డిపై చర్య తర్వాతనే మునుగోడు ఓటమిపై సమీక్ష చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటరెడ్డిపై వేటు పడితే తనదైన మార్కుతో కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రేవంత్‌రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.