KTR: నిన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికల తరువాత టీఆర్ఎస్ లో తిరుగుబాటు ఖాయమని జోస్యం చెప్పారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో దమ్ముంటే డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. సొంత ఇల్లు చక్కబెట్టుకుని తరువాత మరో ఇంటి వైపు వేలు చూపెట్టాలని హితవు పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుమ్ములాటలు అందరికి తెలుసుని అలాంటింది వారు ఇతర పార్టీలను వేలెత్తి చూపడంలో ఉద్దేశమేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో రాజకీయ డ్రామాలో మాటల గారడీ కొనసాగుతోంది.

హుజురాబాద్ ఉప ఎన్నికలో మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల పోరు జోరందుకుంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్తాయిలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కైయ్యాయని అందుకే కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని హుజూరాబాద్ లో నిలబెట్టారని మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇక కొత్తగా పీసీసీ చీఫ్ అయిన రేవంత్ రెడ్డి ఎందుకు హుజూరాబాద్ లో ప్రచారం చేయడం లేదని నిలదీశారు. ఓడిపోతామని రేవంత్ కు ముందే తెలుసన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత టీఆర్ఎస్ కు గడ్డు రోజులే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
బీజేపీ నేతలందరు కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలున్నాయని కేటీఆర్ మరో బాంబు పేల్చారు. దీనిపై బీజేపీ నాయకులు కూడా తమదైన శైలిలో స్పందించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వారికి షాకిచ్చే విధంగా ఉన్నాయని అందుకే వారు అవాకులు చెవాకులు పేలుతున్నారని కౌంటర్ ఇచ్చారు. దీంతో రెండు పార్టీల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఎందుకు వెళ్లట్లేదని మరో ప్రశ్న వచ్చింది. కొడంగల్ లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదని అడిగారు.
దీనిపై కూడా కాంగ్రెస్ నాయకులు స్పందించారు. కేసీఆర్ ఇచ్చిన వాగ్గానాల్లో ఎన్ని నెరవేర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మీరు ఎంత ఘనాపాటో మాకు తెలుసని బదులిచ్చారు. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నికలో పార్టీల వైఖరి పలు కోణాల్లో దూసుకుపోతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తిస్తున్నారు. ఒకరిపై ఇంకొకరు ఘాటైన మాటలతో పదునైన బాణాలతో విరుచుకుపడుతున్నారు.
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సమయం సందర్భం బట్టి వెళతారని కేటీఆర్ తెలిపారు. నేనేమీ దీనిపై చిలకజోస్యం చెప్పలేనన్నారు. ఇక కేసీఆర్ ఉపరాష్ట్రపతి కాబోతున్నారనే ప్రచారం వాట్సాప్ యూనివర్సిటీ చేస్తోన్న అబద్దపు ప్రచారం అన్నారు. వరంగల్ లో నిర్వహించే విజయగర్జన సందర్భంగా అక్టోబర్ 15న ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని కేటీఆర్ ప్రజలకు సూచించారు.