మనకు చైనా తో ప్రత్యక్ష బోర్డర్ వున్నది చాలా చిన్న ప్రాంతం. ప్రస్తుతం పాకిస్తాన్ అధినంలో వున్న జిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతం ద్వారానే చైనా తో భూభాగం కలిసివుంది. అది నేరుగా జింజియాంగ్లోని కష్గర్ పట్టణాన్ని కలుపుతుంది. దాన్నే ఇప్పుడు చైనా-పాకిస్తాన్ ఆర్ధిక నడవాగా అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ వున్న కనుమల ద్వారానే చైనా కు చేరుకోవచ్చు. అలాగే తూర్పు వైపు ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు దారివుంది. అందుకనే ఆ దారి అత్యంత కీలకం. దాన్ని బ్రిటిష్ కుట్రతో 1948 లోనే మనం పోగొట్టుకున్నాం. ఆ తర్వాత మనకు చైనాతో భూ సంబంధం లేదు. అయితే 1951 లో మావో ఆధ్వర్యాన టిబెట్ ని ఆక్రమించిన తర్వాతనే చైనాతో సంబంధం ఏర్పడింది. 1959లో టిబెట్ లో తిరుగుబాటు జరిగినా దాన్ని నిర్ధాక్షిణ్యంగా అణిచి వేయటం , దలైలామా భారత్ కు పారిపోవటం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత టిబెట్ స్వతంత్ర పోరాటం దిక్కులేనిదై పోయింది. ఈరోజు వాళ్ళ గొంతుక ఎక్కడైనా వినబడుతుందంటే అది అమెరికా లోనే.
చైనా ఆరోజునుంచీ భారత్ తోటి తగాదా పడుతూనే వుంది. 1954లో ఒకవైపు పంచశీల ఒప్పందం పేరుతో హిందీ -చీనీ భాయి భాయి అంటూనే రెండో వైపు ఆక్సాయ్ చిన్ ని ఆక్రమించింది. మనం వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకోకుండా ప్రవర్తించాం. చైనా ని గుడ్డిగా నమ్మం. 1958 లో గ్వాదర్ ఓడరేవు ని ఒమాన్ సుల్తాన్ అమ్మకం పెట్టినప్పుడు భారత్ కి కూడా ఆఫర్ ఇచ్చాడు. మనం వద్దనుకున్నాం. పాకిస్తాన్ కొనుక్కుంది. అదే ఓడరేవు మనకింద వుంటే ఈరోజు చైనా కు అరేబియా సముద్రానికి దారి ఏర్పడేది కాదు. చరిత్రలో ఇటువంటివి చాలా తప్పులు చేసాము. అలాగే గ్వాదర్ ని ఆనుకుని వున్న బెలూచీలు కలాత్ సుల్తాను తరఫున మన సాయం అర్ధిస్తే ఆరోజు నెహ్రూ నిరాకరించాడు. చైనా, పాకిస్తాన్ ల విషయం లో మనమెప్పుడూ సాఫ్ట్ విధానాన్నే అవలంబించాము. టిబెట్ విషయం లో కూడా మనం చైనా చేసింది తప్పని పల్లెత్తుమాట అనలేదు. కొంతమేరకు ప్రాశ్చాత్య దేశాలు, అమెరికానే నిరసన తెలిపాయి. ఆరోజే మనం ఈరెండు దేశాలతో వ్యూహాత్మకంగా వ్యవహరించివుంటే పరిస్థితులు ఇక్కడిదాకా వచ్చేవి కాదు. 1959 లోనే చైనా కారకోరం హైవే ని ప్రారంబించింది. అయినా మనం ఎటువంటి అంతర్జాతీయ ఫోరం కి తీసికెల్లలేదు. మన భూభాగం లో చైనా ఎలా దారినిర్మిస్తుందని మనం ఆరోజే ప్రపంచ దేశాల్లో ప్రచారం చేసివుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. మన అదృష్టం కొద్దీ అది వెంటనే కార్యరూపం దాల్చలేదు. దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. ఇంతలో 1962 యుద్ధం రానే వచ్చింది. దీన్ని అదునుగా తీసుకొని 1963లో మన భూభాగం షాక్ షాగం లోయ 5800 చదరపు కిలో మీటర్లు పాకిస్తాన్ తో ఒప్పందం పేరుతో చైనా వశపరుచుకుంది. అయినా మనమేమీ చేయలేదు. ఎందుకంటే అప్పటికే మనం చైనా చేతిలో దెబ్బతిని వున్నాం. 1984లో షియాచిన్ మంచుప్రాంతాన్ని మన కంట్రోల్ లోకి తీసుకొని ఉండకపోతే చైనా ఆటలకు పూర్తి సానుకూలత దొరికేది. అప్పట్నుంచి చైనా ఇప్పుడు గొడవలు జరుగుతున్న గోల్వాన్ లోయ నుంచి పైకి దౌలత్ బేగ్ ఒల్డీ దాకా ఆక్రమిన్చుకోవాలనే కుట్రలు పన్నుతూనే వుంది. అలాగే తూర్పు సెక్టర్ లో కూడా మెక్ మహాన్ లైన్ ని ఒప్పుకోకుండా పేచీ పెడుతూనే వుంది. అది టిబెట్ చేసుకున్న ఒప్పందమని మాకు సంబంధం లేదని వాదిస్తుంది. మొత్తం మీద మనకున్న తగాదా అల్లా టిబెట్ – భారత్ సరిహద్దుకి సంబంధించింది. టిబెట్ చైనా లో భాగమని మనం ఒప్పుకోవటమే అసలు సమస్య. టిబెట్ స్వతంత్ర దేశమని మనం ఒక్కమాట మాట్లాడివుంటే అనాధాలైన టిబెటన్లకు పెద్ద ఊరట కలిగేది. వ్యూహాత్మకంగా చూసినా మనకు వచ్చిన లాభం ఏమీలేదు.
చైనా డెంగ్ షియావోపింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ధికంగా బలపడి ప్రపంచం లో అమెరికా తర్వాత ఇంకో పవర్ సెంటర్ గా తయారయ్యింది. ఇటీవలికాలం లో ఇంకో నయా వలసవాద దేశంగా మారింది. భారత్ చుట్టూ సైనిక స్థావరాలు ఏర్పరిచి మన భద్రతకి ముప్పుగా పరిణమించింది. ముఖ్యంగా పాకిస్తాన్ మనపై చెలరేగటానికి కొండంత అండగా నిలిచింది. ఒకవైపు నేపాల్ ని రెచ్చగొడుతుంది. ఎప్పట్నుంచో సాంస్కృతిక, చారిత్రిక సంబంధాలున్న నేపాల్ ని రెచ్చగొట్టటం లో సోదర కమ్యూనిస్టుల సహాయం తీసుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించింది. చైనా ఈరోజు భారత్ కి పెద్ద ముప్పుగా పరిణమించింది.
అదేసమయం లో మనమూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఆవేశం పాలు కన్నా , బుద్ధిబలం తో పరిస్థితుల్ని అధిగమించటానికి ప్రయత్నం చేయాలి. మనం 20 వీర సైనికుల్ని పోగుట్టుకున్న మాట నిజమయినా చైనా తో తక్షణ యుద్ధాన్ని కోరుకోకూడదు. వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. సంప్రదింపుల అవకాశాన్ని వదులుకోకూడదు. అదేసమయం లో మన భూభాగం విషయం లో రాజీ పడకూడదు. చివరిదాకా యుద్ధాన్ని నివారిస్తూనే రాజీ పడకుండా డీల్ చేయాలి. చైనా కన్నా మనం తెలివితేటల్లో తక్కువేమీ కాదని నిరూపించాలి. ప్రపంచానికి చైనా ఎలా ప్రపంచ శాంతికి విఘాతంగా తయారయ్యిందో, పాకిస్తాన్, ఉత్తర కొరియా దేశాలకు ఎలా వెన్నుదన్నుగా వుందో చెబుతూ చైనా ని అడ్డుకట్ట వేసే వ్యూహాలకు పడునుపెట్టాలి.
ఇప్పటికే ప్రపంచం లోని ప్రజాస్వామ్య దేశాలు చైనా కి వ్యతిరేకంగా నిలబడ్డాయి. మనం కూడా వాటితో చేయి కలపాలి. ఇప్పటి పరిస్థితుల్లో ఇంతకన్నా వేరే మార్గం లేదు. చైనా ని డీ కొట్టే అధునాతన ఆయుధాలు కావాలన్నా ఈ కొత్త సంఘటన లో చేరక తప్పదు. మెల్లి మెల్లిగా చైనా ప్రభావం నుండి బయటపడాల్సివుంది. చైనా అధీనంలోని ఆసియా బ్యాంకులో మనం రెండో అతిపెద్ద వాటా దారయినా చైనా 26 శాతం పైన వాటాతో వీటో అధికారాన్ని కలిగివుంది. అలాగే షాంఘై కూటమి పై కూడా పునర్విచారణ చేయాల్సి వుంది. మన జియో పొలిటికల్ వ్యూహాన్ని కొత్త పంధాలో నడిపించాలి. అలా అయితేనే చైనా దిగివస్తుంది. మన బలం చాలనప్పుడు ఇదొక్కటే మార్గం. ఈ లోపు మనం ఆర్ధికంగా బలపడటం ఒక్కటే శాశ్వత పరిష్కారం. మనం బలంతోనే చైనా ని ఎదుర్కోగలం. మిగతా పొరుగు దేశాల్ని బెదిరించినట్లు భారత్ ని బెదిరించి లొంగ దీసుకోవటం సాధ్యం కాదని చైనా గ్రహించినప్పుడే అది మనతో శాశ్వత సంధికి వస్తుంది. అప్పటివరకూ మనం స్వతంత్ర వ్యూహాలతో ముందుకు వెళ్ళాల్సిందే.